India Vs Zimbabwe: 161 పరుగులకే జింబాబ్వే ఆలౌట్ - చెలరేగిన శార్దూల్!
భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో జింబాబ్వే 161 పరుగులకు ఆలౌట్ అయింది.
భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో జింబాబ్వే కుప్పకూలింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు 38.1 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ సిరీస్‌లో జింబాబ్బే ఇప్పటివరకు 200 మార్కును దాటలేదు. మొదటి వన్డేలో కూడా 189 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ విజయానికి 162 పరుగులు సరిపోతాయి.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే ఇన్నింగ్స్ మందకొడిగా ప్రారంభం అయింది. మొదటి ఎనిమిది ఓవర్లలో వారు చేసింది 20 పరుగులు మాత్రమే. తొమ్మిదో ఓవర్లో ఓపెనర్ కైటానోను (7: 32 బంతుల్లో) అవుట్ చేసి సిరాజ్ టీమిండియాకు మొదటి వికెట్ అందించారు.
మరో ఓపెనర్ ఇన్నోసెంట్ కయా (16: 27 బంతుల్లో, రెండు ఫోర్లు), కెప్టెన్ రెగిస్ చబాగ్వాలను (2: 5 బంతుల్లో) శార్దూల్ ఠాకూర్ ఒకే ఓవర్లో అవుట్ చేశాడు. ఆ తర్వాతి వన్ డౌన్ బ్యాటర్ వెస్లీ మదెవెరెను (2: 12 బంతుల్లో) ప్రసీద్ కృష్ణ పెవిలియన్‌కు పంపడంతో జింబాబ్వే 12 ఓవర్లలో 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
అయితే సికిందర్ రాజా (16: 31 బంతుల్లో), షాన్ విలియమ్స్ (42: 42 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) జింబాబ్వేను ఈ దశలో ఆదుకున్నారు. వీరిద్దరూ అయిదో వికెట్‌కు 41 పరుగులు జోడించారు. వీళ్లు అవుటయ్యాక ర్యాన్ బుర్ల్ (39 నాటౌట్: 47 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) క్రీజులో ఒకవైపు నిలబడ్డా మరో వైపు తనకు సహకారం లభించలేదు.
దీంతో జింబాబ్వే 38.1 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ సిరాజ్, ప్రసీద్ కృష్ణ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడాలు ఒక్కో వికెట్ తీసుకున్నారు. బౌలింగ్ వేసిన ప్రతి ఒక్కరికీ వికెట్ దక్కింది.
View this post on Instagram
View this post on Instagram