IND vs ZIM, 1st T20I Match highlights: టీ 20 ప్రపంచకప్(T20 World Cup) గెలిచి విశ్వ విజేతలుగా జింబాబ్వే(Zim) గడ్డపై కాలుమోపిన టీమిండియా(IND)కు పసికూన జింబాబ్వే దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌లో యువ భారత్‌ను జింబాబ్వే ఓడించింది. తక్కువ స్కోరుకే పరిమితమై.. ఇక ఓటమి ఖాయమనుకున్న జింబాబ్వే..బౌలింగ్‌లో భారత యువ ఆటగాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 115 పరుగులే చేసింది. అనంతరం ఈ స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా తడబడింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ చివరి ఓవర్ వరకూ ఒంటరి పోరాటం చేసినా భారత్‌ను గెలిపించలేకపోయాడు. జింబాబ్వే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా లక్ష్యానికి13 పరుగుల దూరంలోనే ఆగిపోయింది.
రాణించిన స్పిన్నర్లు
హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై స్పిన్నర్లు జింబాబ్వే బ్యాటర్లను చుట్టేశారు. రెండో ఓవర్‌లోనే ఇన్నోసెంట్ కైనాను అవుట్ చేసి ముఖేశ్‌కుమార్ భారత్‌కు శుభారంభం అందించాడు. ఆరు పరుగుల వద్ద జింబాబ్వే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్ వెస్లీ మాధేవేరే, బెన్నెట్ జింబాబ్వే వికెట్ల పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు. ఆచితూచి అడిన ఈజోడి ధాటిగా ఆడకపోయినా జింబాబ్వే స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ఆ తర్వాత రవి భిష్ణోయ్ మాయా ఆరంభమైంది. 21 పరుగులు చేసిన మాధేవేరేను.... 22 పరుగులు చేసిన బెన్నెట్‌ను రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో బౌల్డయ్యారు. దీంతో 51 పరుగులకు జింబాబ్వే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా 17 పరుగులు, మైర్స్ పరుగులు చేసి పర్వాలేదనిపించారు. జింబాబ్వే బ్యాటర్లు భారీ స్కోర్లు నమోదు చేయకపోయినా తలా ఓ చేయి వేసి ఓ మోస్తరు స్కోరు చేశారు. దీంతో జింబాబ్వే స్కోరు బోర్డు ముందుకుసాగింది. టాపార్డర్‌లో ఒకరిద్దరి ఆటగాళ్లు మినహా మిగిలిన బ్యాటర్లందరూ రెండంకెల స్కోరు చేశారు. క్యాంప్‌బెల్ ఒక్క పరుగు కూడా చేయకుండా రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత భారత స్పిన్నర్లు రాణించడంతో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 115 పరుగులే చేసింది. రవి భిష్ణోయ్ నాలుగు, వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీశారు.
తడబడ్డ బ్యాటర్లు
116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాటర్లను జింబాబ్వే బౌలర్లు కట్టడి చేశారు. ఆట ఆరంభమైన కాసేపటికే టీమిండియా టాపార్డర్ కుప్పకూలింది. తొలి ఓవర్‌లోనే తెలుగు కుర్రాడు అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. దీంతో స్కోరు బోర్డుపై ఒక్క పరుగు లేకుండానే భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత టీమిండియా టాపార్డర్ పేకమేడను తలపించింది. రుతురాజ్ గైక్వాడ్ 7, రియాన్ పరాగ్ 2, రింకూ సింగ్ 0, ధ్రువ్ జురెల్ ఆరు పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఓవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కాసేపు పోరాడాడు. 29 బంతుల్లో 31 పరుగులు చేసిన గిల్‌ను అవుట్ చేసి సికిందర్ రజా కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత కూడా భారత వికెట్ల పతనం కొనసాగింది. రవి భిష్ణోయ్ 9, ఆవేశ్ ఖాన్ 16, ముఖేష్‌కుమార్ 0 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా వాషింగ్టన్ సుందర్ పోరాడాడు. చివరి ఓవర్ వరకూ క్రీజులో నిలబడి జట్టును గెలిపించేందుకు ప్రయత్నించాడు. 34 బంతుల్లో 27 పరుగులు చేసిన సుందర్ చివరి ఓవర్‌లో అవుట్ కావడంతో టీమిండియా పోరాటం ముగిసింది. దీంతో టీమిండియా 102 పరుగులకే కుప్పకూలి లక్ష్యానికి13 పరుగుల దూరంలోనే ఆగిపోయింది.