IND vs WI: ఎందుకు తప్పించారో ఎవ్వరూ చెప్పలేదు - సెలక్టర్లపై హనుమ ఫైర్!
IND vs WI: టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ హనుమ విహారీ (Hanuma Vihari) ఫైర్ అయ్యాడు! బీసీసీఐ సెలక్టర్లపై సుతిమెత్తగా విమర్శలు గుప్పించాడు.
IND vs WI, Hanuma Vihari:
టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ హనుమ విహారీ (Hanuma Vihari) ఫైర్ అయ్యాడు! బీసీసీఐ సెలక్టర్లపై సుతిమెత్తగా విమర్శలు గుప్పించాడు. టెస్టు జట్టు నుంచి తననెందుకు తప్పించారో ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదని పేర్కొన్నాడు. మొదట్లో ఇది కొంత ఆందోళన కలిగించినా ఇప్పుడేమీ ఒత్తిడికి గురవ్వడం లేదన్నాడు. వెస్టిండీస్‌తో తొలి టెస్టుకు ముందు అతడి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడాడు.
తెలుగు బ్యాటర్ హనుమ విహారి పట్టుదలకు మారుపేరు! మంచి టెక్నిక్ అతడి సొంతం. క్రీజులో నిలిచాడంటే ఒక పట్టాన ఔటవ్వడు. నిలకడగా పరుగులు చేస్తుంటాడు. మోకాలి గాయమైనప్పటికీ ఆస్ట్రేలియాలో ఒక టెస్టులో అతడు రోజు మొత్తం ఆడిన సంగతి తెలిసిందే. నొప్పితో విలవిల్లాడుతున్నా అతడు టీమ్‌ఇండియా డ్రా చేసుకోవడమే లక్ష్యంగా అశ్విన్‌కు అండగా నిలిచాడు. ఏడాది క్రితం వరకు రెగ్యులర్‌గా జట్టులో ఉండేవాడు. 2022, జులై తర్వాత అతడు భారత జెర్సీ ధరించలేదు. అప్పట్నుంచి అతడిని పట్టించుకోవడం లేదు.
'అవును.. నన్ను తప్పించడంతో నిరాశచెందాను. నన్నెందుకు తీసుకోవడం లేదో ఇప్పటి వరకు కారణం తెలియదు. అదే నన్ను బాధిస్తోంది. సెలక్షన్ కమిటీ నుంచి నన్నెవరూ కలవలేదు. జట్టులోంచి ఎందుకు తొలగించారో చెప్పలేదు. కెరీర్లో నేను ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. దీనిని అర్థం చేసుకోవడానికి టైమ్ పట్టింది. ఇప్పుడు దీని గురించి ఆందోళన చెందడం లేదు' అని హను విహారీ అన్నాడు.
'నేను వ్యక్తిగత అంశాలను పక్కన పెట్టేశాను. టీమ్‌ఇండియాలో ఉంటానో లేదోనని బెంగ పడటం లేదు. గెలిపించడానికి ఇంకా వేరే మ్యాచులు ఉన్నాయి. ట్రోఫీలు గెలవడమే అత్యంత ముఖ్యం. జాతీయ జట్టులో పునరాగమనం చేయడం సులభం కాదు. ఒక్కసారి తప్పించారంటే మనసులో అదే ఉంటుంది. మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది. చివరి సీజన్లో నన్నిదే వేధించింది. అందుకే ఈ రంజీ సీజన్లో వీటిని పక్కన పెట్టేశాను. అవకాశం వచ్చినప్పుడు మెరుగ్గా రాణించడమే నా లక్ష్యం' అని హనుమ విహారీ పేర్కొన్నాడు.
Also Read: అశ్విన్ మ్యాజిక్, జైశ్వాల్, రోహిత్ మెరుపు ఇన్నింగ్స్- డొమినికా టెస్ట్‌లో టీమిండియా ఆధిపత్యం
టీమ్‌ఇండియా (Team India) తరఫున హనుమ విహారీ ఇప్పటి వరకు 16 టెస్టులు ఆడాడు. 33.56 సగటు, 42.20 స్ట్రైక్‌రేట్‌తో 839 పరుగులు చస్త్రశాడు. ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీ బాదేశాడు. ఇక 114 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 53.02 సగటు, 48.54 స్ట్రైక్‌రేట్‌తో 8643 పరుగులు చేశాడు. 23 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు కొట్టాడు. అప్పుడప్పుడు ఆఫ్ స్పిన్ వేస్తాడు. టీమ్‌ఇండియా తరఫున 10 ఇన్నింగ్సుల్లో 5 వికెట్లు తీశాడు. ఫస్ట్ క్లాస్‌లో 27, లిస్ట్ ఏలో 22, టీ20ల్లో 26 వికెట్లు పడగొట్టాడు.
ఇక వెస్టిండీస్ టెస్టులో టీమ్ఇండియా ఇరగదీస్తోంది. ఆతిథ్య జట్టును తొలి ఇన్నింగ్సులో 64.3 ఓవర్లకు 150కే ఆలౌట్ చేసింది. రవిచంద్రన్ అశ్విన్ ఐదు, రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీశారు. ఆ తర్వాత అరంగేట్రం బ్యాటర్ యశస్వీ జైశ్వాల్ 73 బంతుల్లో 40 పరుగులతో నిలిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 65 బంతుల్లో 30 పరుగులు సాధించాడు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial