India vs England: పోరాడుతున్న ఇంగ్లాండ్ - నాలుగోరోజే ముగుస్తుందా!
India vs England, 2nd Test: ఇంగ్లాండ్ జట్టుకు భారత్ 399 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది.
Visakha Test Match Between India Vs England: విశాఖ టెస్టులో ఇంగ్లాండ్ జట్టుకు భారత్ 399 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేసి, ఇంగ్లాండ్‌ను 253 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్ జట్టురెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ శతకంతో రాణించాడు. భారత ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ 17, రోహిత్ శర్మ 13 పరుగులకే పెవిలియన్ చేరగా శ్రేయాస్ అయ్యర్ 29, రజత్ పటిదార్ 9 పరుగులకే వెనుదిరిగారు. మరోవైపు శుభ్‌మన్ గిల్..అక్షర్ పటేల్‌తో కలిసి భారత్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ క్రమంలో ఐదో వికెట్‌కు89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గిల్ 104 పరుగులు చేసి పెవిలియన్ చేరగా అక్షర్ పటేల్ 45 పరుగులతో రాణించాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి భారత్ 398 పరుగుల ఆధిక్యం సాధించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు మూడోరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది.
జిగేల్ మనిపించిన గిల్ :
విమర్శలను తిప్పికొడుతూ.. అనుమానాలను పటాపంచలు చేస్తూ టీమిండియా స్టార్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) శతక నినాదం చేశాడు. రెండో టెస్ట్‌లో కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో గిల్ 132 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సులతో 100 పరుగులు చేసి సత్తా చాటాడు. వన్ డౌన్‌లో శుభ్‌మన్ గిల్‌కు ఇది తొలి సెంచరీ కావడం విశేషం. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో పెద్దగా రాణించని గిల్... రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లోనూ త్వరగానే అవుటై నిరాశను మిగిల్చాడు. గత ఐదు టెస్టుల్లో గిల్ అత్యధిక స్కోరు 36 పరుగులే. వైజాగ్ టెస్టులో 34 పరుగులు చేసి జోరు మీద కనిపించి హాఫ్ సెంచరీ అయినా చేస్తాడన్న అభిమానుల ఆశ నెరవేరలేదు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత శతకంతో మ్యాచ్‌ను పూర్తిగా భారత్ చేతుల్లోకి తెచ్చేశాడు గిల్.