(Source: ECI/ABP News/ABP Majha)
IND vs BAN 1st Test: డామినేషన్ స్టార్ట్స్! బంగ్లాపై పుజారా, శ్రేయస్ హాఫ్ సెంచరీలు
IND vs BAN 1st Test: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్సులో భారత్ నిలకడగా రాణిస్తోంది. టీమ్‌ఇండియా నయావాల్ చెతేశ్వర్ పుజారా, శ్రేయస్ అయ్యర్ విలువైన అర్ధశతకాలు బాదేశారు.
IND vs BAN 1st Test:
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్సులో భారత్ నిలకడగా రాణిస్తోంది. భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టీమ్‌ఇండియా నయావాల్ చెతేశ్వర్ పుజారా (61; 137 బంతుల్లో 7x4), శ్రేయస్ అయ్యర్ (51; 98 బంతుల్లో 7x4) విలువైన అర్ధశతకాలు బాదేశారు. దాంతో 63 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 203 పరుగులతో నిలిచింది.
నిలబడ్డ పుజారా, శ్రేయస్
తొలి రోజు భోజన విరామానికి టీమ్‌ఇండియా 85/3తో కష్టాల్లో పడింది. రిషభ్ పంత్ నిలబడటంతో కాస్త గట్టెక్కింది. అతడు ఔటవ్వడంతో డ్రింక్స్ బ్రేక్‌కు 128/4కు చేరుకుంది. ఈ క్రమంలో చెతేశ్వర్ పుజారా, శ్రేయస్ అయ్యర్ క్రీజులో నిలదొక్కుకున్నారు. ఒకరికొకరు అండగా నిలిచారు. తక్కువ బౌన్స్, ఊహించని వేగంతో వస్తున్న బంతులను డిఫెండ్ చేశారు. పిచ్ కాస్త అనుకూలించే వరకు ఆగారు. సింగిల్స్, డబుల్స్ తీస్తూ జట్టు స్కోరును పెంచారు. తేనీటి విరామానికి 56 ఓవర్లకు 174కు తీసుకెళ్లారు. పుజారా 125 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడంతో 62.1 ఓవర్లకు స్కోరు 200 మైలురాయికి చేరుకుంది. మరికాసేపటికే శ్రేయస్ 93 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు.
తొలి సెషన్లో ముగ్గురు
ఛటోగ్రామ్ వేదికగా సాగుతున్న పోరులో టాస్ గెలిచిన టీమ్‌ఇండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కేఎల్ రాహుల్ (22; 54 బంతుల్లో 3x4), శుభ్‌మన్ గిల్ (20; 40 బంతుల్లో 3x4)తో నిలకడగా ఆడారు. అయితే వీరిద్దరూ 4 పరుగుల వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. జట్టు స్కోరు 41 వద్ద గిల్‌ను తైజుల్ ఇస్లామ్ ఔట్ చేశాడు. మరికాసేపటికే ఖలీల్ అహ్మద్ వేసిన బంతిని రాహుల్ వికెట్ల మీదకు ఆడుకున్నాడు. తక్కువ బౌన్స్‌తో ఆఫ్‌సైడ్ వచ్చిన బంతి బ్యాటు అంచుకు తగిలి వికెట్లను గిరాటేసింది.
ఆదుకున్న రిషభ్ పంత్
మరో 3 పరుగులకే ఇస్లామ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ (1) ఔటవ్వడంతో టీమ్‌ఇండియాకు భారీ షాక్ తగిలింది. ఈ క్రమంలో చెతేశ్వర్ పుజారాతో కలిసి వికెట్ కీపర్ రిషభ్ పంత్ (46; 45 బంతుల్లో 6x4, 2x6) జట్టును ఆదుకున్నాడు. బంతికో పరుగు చొప్పున సాధించాడు. చూడచక్కని బౌండరీలు, సిక్సర్లతో అలరించాడు. హాఫ్ సెంచరీకి మరో 4 పరుగుల దూరంలో మెహదీ హసన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్లో 4000 పరుగులు మైలురాయి అందుకున్నాడు.
That's a brilliant 100-run partnership between @cheteshwar1 & @ShreyasIyer15 👌💪
— BCCI (@BCCI) December 14, 2022
Keep going 🙌
Live - https://t.co/GUHODOYOh9 #BANvIND pic.twitter.com/3Jwh0mhfvT