(Source: ECI/ABP News/ABP Majha)
IND vs AUS Final: ఇది అప్పటి జట్టు కాదు, ప్రతీకారం అదిరిపోతుంది అంతే!
ODI World Cup 2023: టీమిండియా అప్పటి ఆస్ట్రేలియా జట్టు కంటే దుర్బేద్యంగా కనిపిస్తోంది. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ సేనకు ఒక్క మ్యాచ్‌లో పరాజయం లేదు.
India vs Australia World Cup: అది 2003 ప్రపంచకప్...... సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని టీమిండియ అద్భుత విజయాలతో ఫైనల్‌ల్లోకి దూసుకెళ్లింది. 1983 తర్వాత మళ్లీ ప్రపంచకప్ భారత్ కైవసం కాకపోవడంతో ఈసారి కప్పు మనదే అని అభిమానలు ఫైనల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రత్యర్థి ఆస్ట్రేలియా కావడంతో ఏమూలనో సందేహం ఉన్నా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. అప్పటివరకూ ఏ ప్రపంచకప్‌లోనూ ఏ క్రికెటర్ చేయని విధంగా 673 పరుగులు చేశాడు. అంటే ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.
టీమిండియా బలంగా ఉంది. గంగూలీ, సచిన్, ద్రవిడ్, సెహ్వాగ్, యువరాజ్, హర్భజన్, జహీర్ ఖాన్, శ్రీనాథ్, నెహ్రా.. ఇలా మహామహులైన ఆటగాళ్లతో టీమ్‌ఇండియా 2003 ప్రపంచకప్ ఫైనల్ బరిలోకి దిగింది. అటు... గిల్‌క్రిస్ట్, హేడెన్, పాంటింగ్, మార్టిన్, బెవాన్, సైమండ్స్‌లతో బ్యాటింగ్.. మెక్‌గ్రాత్, బ్రెట్‌లీ, బికెల్, హాగ్‌లతో బౌలింగ్ దుర్బేధ్యంగా ఉన్న జట్టుతో ఆస్ట్రేలియా రంగంలోకి దిగింది. కానీ ఫైనల్లో టీమిండియా చతికిలపడింది. ఆస్ట్రేలియా బ్యాటర్ పాంటింగ్ 121 బంతుల్లో 140 పరుగులు చేసి అజేయంగా నిలిచి మ్యాచ్‌ను టీమిండియా నుంచి లాగేసుకున్నాడు. 360 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే సచిన్ 4 పరుగులకే వెనుదిరగడంతో కుదేలైంది. చివరికి టీమిండియా 125 పరుగుల తేడాతో ఓడిపోయి కప్పును దూరం చేసుకుంది.
కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టీమిండియా అప్పటి ఆస్ట్రేలియా జట్టు కంటే దుర్బేద్యంగా కనిపిస్తోంది. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ సేన ఒక్క మ్యాచ్‌లో కూడా పరాజయం పాలు కాలేదు. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న మన జట్టు.. అప్పటి ఆస్ట్రేలియా తరహాలోనే పక్కా ప్రణాళికతో ఆడుతోంది. బ్యాటింగ్‌లో ఎదురుదాడికి దిగుతూ బౌలింగ్ ఆరంభం నుంచే ప్రత్యర్థులను దెబ్బ కొడుతూ ముందుకు సాగుతోంది.
రోహిత్, గిల్, కోహ్లీ, అయ్యర్, రాహుల్ భీకర ఫామ్‌లో ఉన్నారు. సెమీస్‌లో న్యూజిలాండ్‌పై వీళ్లందరూ రాణించడం విశేషం. ఒక ఇద్దరు అవుటవ్వగానే మిగిలిన జట్టంతా అవుటయ్యే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఒకరిద్దరు ఆరంభంలోనే అవుటైనా మిగిలిన వాళ్లు నిలబడుతున్నారు. ఇదే ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌చో ఆస్ట్రేలియాపైనే జరిగిన మ్యాచ్ అందుకు నిదర్శనం. 2 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశ నుంచి కోలుకుని టీమిండియా అద్భుత విజయం సాధించింది. బౌలింగ్‌లోనూ టీమిండియా బలంగా ఉంది. షమీ నిప్పులు చెరుగుతున్నాడు, బుమ్రా కట్టడి చేస్తున్నాడు. సిరాజ్ కట్టుదిట్టంగా బంతులు సంధిస్తూ ఒత్తిడి పెంచుతున్నాడు. రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్ స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. సొంతగడ్డపై ఆడుతుండటం భారత జట్టు బలాన్ని మరింత పెంచుతోంది. ఆస్ట్రేలియా మెరుగైన జట్టే అయినా.. భారత్‌తో పోల్చి చూస్తే బలహీనంగా కనిపిస్తోంది. రోహిత్ సేన ఆత్మవిశ్వాసం ప్రస్తుతం పతాక స్థాయిలో ఉంది. అప్పుడు ఆసీస్‌ను చూసి మనవాళ్లు కంగారు పడ్డట్లు.. ఇప్పుడు మన జట్టును చూసి ప్రత్యర్థే భయపడే పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా సాగిన ఆటతీరునే ఫైనల్లోనూ టీమిండియా కొనసాగిస్తే.. ఆస్ట్రేలియాపై విజయం అంత కష్టమేమీ కాదు.