IND vs AUS Test: ఈసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియాదే- ఎందుకంటే: గ్రెగ్ ఛాపెల్
IND vs AUS Test: భారత్ తో జరుగుతున్న 4 టెస్ట్ మ్యాచ్ ల బోర్డర్- గావస్కర్ ట్రోఫీని తమ దేశం గెలుచుకుంటుందని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గ్రెగ్ చాపెల్ అభిప్రాయపడ్డారు. అందుకు గల కారణాలను వివరించాడు
IND vs AUS Test: ఫిబ్రవరి 9 నుంచి భారత్- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్- గావస్కర్ సిరీస్ ప్రారంభం కానుంది. దీనికోసం ఇరు జట్లు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఈ టోర్నీని రెండు జట్లు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధించడానికి ఈ సిరీస్ భారత్- ఆస్ట్రేలియాకు మంచి అవకాశం.
దీంతో ఈ సిరీస్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మాజీలు, క్రికెట్ పండితులు, విశ్లేషకులు ఇందులో ఎవరు గెలుస్తారనే దానిపై తమ తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. అలాగే ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గ్రెగ్ చాపెల్ కూడా ఈ సిరీస్ పై మాట్లాడాడు.
వారిద్దరూ దూరమవడం భారత్ కు లోటు
భారత్ తో జరుగుతున్న 4 టెస్ట్ మ్యాచ్ ల బోర్డర్- గావస్కర్ ట్రోఫీని తమ దేశం గెలుచుకుంటుందని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గ్రెగ్ చాపెల్ అభిప్రాయపడ్డారు. అందుకు గల కారణాలను వివరించాడు. భారత్ ఇద్దరు కీలక ఆటగాళ్లను ఈ సిరీస్ లో కోల్పోయిందని.. ఇదే ఆసీస్ విజయానికి దోహదం అవుతుందని అన్నాడు. ఈసారి బోర్డర్- గావస్కర్ సిరీస్ ను ఆస్ట్రేలియా గెలుస్తుంది. రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా లాంటి కీలక ఆటగాళ్లు దూరమవటంతో భారత్ బలహీనంగా కనిపిస్తోంది. అందుకే ఈ సారి నా ఓటు మా జట్టుకే అని చాపెల్ అన్నాడు.
గతేడాది డిసెంబర్ 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న పంత్ దాదాపు ఈ ఏడాది క్రికెట్ కు దూరమవనున్నాడు. అలాగే బుమ్రా వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. ఎన్ సీఏకి వెళ్లిన బుమ్రా తొలి 2 టెస్టులకు దూరంగానే ఉండనున్నాడు. ఇక రవీంద్ర జడేజా మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుని కోలుకున్నాడు. ప్రస్తుతం రంజీల్లో ఆడుతున్నాడు. తొలి 2 టెస్టులకు జట్టు స్క్వాడ్ లో జడేజా ఉన్నాడు.
ఆస్ట్రేలియా తన నైపుణ్యాన్నంతా ప్రదర్శించాలి
అలాగే ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టు గురించి చాపెల్ తన అభిప్రాయలను పంచుకున్నారు. టర్నింగ్ పిచ్ లపై నాథన్ లియాన్ కంటే ఆస్టన్ అగర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చాపెల్ అన్నాడు. ఫింగర్ స్పిన్ మరింత కచ్చితంగా ఉంటుంది. కాబట్టి స్పిన్నర్లకు ఉపయోగపడే పిచ్ ఎదురైనప్పుడు ఆస్టన్ అగర్ ను ఎంచుకోవాలి. అనిల్ కుంబ్లే టెస్ట్ క్రికెట్ లో 619 వికెట్లు పడగొట్టాడు. అతను వేగంగా, ఫ్లాట్ లెగ్ బ్రేక్ లు వేసేవాడు. అగర్ కూడా అలాగే చేయాల్సి ఉంటుంది. అని అన్నాడు. ఇంకా ఆస్ట్రేలియా చాలా అంశాల్లో మెరుగవ్వాల్సిన అవసరముందని చాపెల్ అన్నాడు. డేవిడ్ వార్నర్ ఫాంలో లేడు. భారత్ లో అతను తన టెస్ట్ రికార్డును మెరుగుపరచుకోవాలి. ఉస్మాన్ ఖవాజా, అలెక్స్ క్యారీ, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్ లాంటి ఆటగాళ్లకు స్పిన్ పిచ్ లపై పరీక్ష ఎదురుకానుంది. మాగ్నస్ లబుషేన కు కఠిన పరీక్ష ఎదురుకానుంది. అని చాపెల్ అభిప్రాయపడ్డాడు.
చివరగా ఆస్ట్రేలియా తమ ప్రతిభను, నైపుణ్యాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని సూచించాడు. భారత్ లో గెలవడం అంత కష్టం కాదని చాపెల్ అన్నాడు. రెగ్యులర్ పర్యటనలు, ఐపీఎల్ తో తమ ఆటగాళ్లు ఇప్పటికే భారత్ పిచ్ లపై చాలా అనుభవం తెచ్చుకున్నారని చెప్పాడు.