IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మొదటి రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది.
WTC Final 2023: భారత్‌తో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో మొదటి రోజు ఆస్ట్రేలియా పూర్తిగా డామినేట్ చేసింది. ఓవల్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసేసరికి మూడు వికెట్లు కోల్పోయి 327 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (146 బ్యాటింగ్: 156 బంతుల్లో, 22 ఫోర్లు, ఒక సిక్సర్), స్టీవెన్ స్మిత్ (95 బ్యాటింగ్: 227 బంతుల్లో, 14 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. వీరు నాలుగో వికెట్‌కు అభేద్యంగా 251 పరుగులు జోడించారు. రెండో రోజు ప్రారంభంలో వీరి వికెట్ తీయకపోతే టీమిండియాకు పరిస్థితులు మరింత క్లిష్టం అవుతాయి.
బౌలింగ్ ఎంచుకున్న రోహిత్
ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా టాస్ గెలవగానే బౌలింగ్ ఎంచుకుంది. ప్రారంభంలో కండీషన్స్‌ను బాగానే ఉపయోగించుకుంది. జట్టు స్కోరు 2 వద్దే ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (0: 10 బంతుల్లో)ను మహ్మద్ సిరాజ్ ఔట్ చేసి భారత్‌కు మొదటి బ్రేక్ ఇచ్చాడు. వుబుల్ సీమ్‌తో వచ్చిన బంతి ఖవాజా బ్యాటు అంచుకు తగిలి వికెట్ కీపర్ భరత్ చేతుల్లో పడింది. ఈ సిచ్యువేషన్లో డేవిడ్ వార్నర్ (43; 60 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు), మార్నస్ లబుషేన్ (26: 62 బంతుల్లో, మూడు ఫోర్లు) క్రీజులో నిలబడ్డారు. రెండో వికెట్‌కు 108 బంతుల్లోనే 69 పరుగుల కీలక భాగస్వామ్యం అందించారు. చక్కని బంతుల్ని గౌరవిస్తూనే దొరికిన వాటిని బౌండరీకి తరలించారు.
మహ్మద్ షమి, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ చక్కని లెంగ్తుల్లో బంతులు వేశారు. దాంతో వీరి బౌలింగ్‌ను డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్ జాగ్రత్తగా ఆడారు. అయితే ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌ను మాత్రం బాగా అటాక్ చేశారు. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ చక్కని షాట్లతో చెలరేగాడు. వరుసగా బౌండరీలు బాదాడు. ఈ జోడీని విడదీయడానికి భారత పేసర్లు కాస్త కష్టపడాల్సి వచ్చింది. చివరికి శార్దూల్ ఠాకూర్ వేసిన 21.4వ బంతికి వార్నర్ ఔటయ్యాడు. డౌన్ ది లెగ్ భుజాల ఎత్తులో వచ్చిన బంతిని పుల్ చేయబోయిన అతడు కీపర్ భరత్‌కు చిక్కాడు. గ్లోవ్స్ తాకి లెగ్‌సైడ్ వెళ్తున్న బంతికి కీపర్ భరత్ డైవ్ చేసి అద్భుతంగా ఒడిసిపట్టాడు. మరికాసేపటికే లంచ్ బ్రేక్ అనౌన్స్ చేశారు.
మొదటి బంతికే షాక్
రెండో సెషన్‌లో మొదటి బంతికే ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. భారత పేసర్ మహ్మద్ షమీ బౌలింగ్‌లో నిలకడగా ఆడుతున్న మార్నస్ లబుషేన్ క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 76 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నట్లు కనిపించింది. కానీ స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ భారత్‌కు మరో అవకాశం ఇవ్వలేదు.
100కు పైగా స్ట్రైక్‌రేట్‌తో ట్రావిస్ హెడ్
ఒక ఎండ్‌లో స్టీవ్ స్మిత్ వికెట్ల ముందు అడ్డుగోడలా నిలబడ్డాడు. మరో ఎండ్‌లో ట్రావిస్ హెడ్ బౌండరీలతో చెలరేగాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన ఒక ఓవర్లో వీరిద్దరూ కలిసి 16 పరుగులు పిండుకున్నారు. ఒకానొక దశలో ట్రావిస్ హెడ్ స్ట్రైక్ రేట్ 100కు పైగా ఉంది. కేవలం 60 బంతుల్లోనే ట్రావిస్ హెడ్ అర్థ సెంచరీ పూర్తయింది.
ఇంకో వైపు వికెట్ తీయడానికి భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రవీంద్ర జడేజా స్పిన్‌ను ఆడటానికి వీరు కాస్త తడబడ్డారు. కానీ మరో ఎండ్‌లో పేస్ బౌలింగ్‌లో పరుగులు భారీగా పిండుకున్నారు. జడ్డూకు తోడుగా రెండో ఎండ్‌లో మంచి స్పిన్నర్ ఉంటే భారత్‌కు కొంచెం ఎడ్జ్ ఉండేది. రెండో సెషన్ ముగిసేసరికి ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.
ముంచేసిన మూడో సెషన్
ఇక మూడో సెషన్ భారత్‌ను పూర్తిగా ముంచేసింది. ఈ సెషన్‌లో పేస్, స్పిన్ అనే తేడా లేకుండా స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ చాలా సమర్థవంతంగా ఆడారు. మొదటి రెండు సెషన్లు జాగ్రత్తగా ఆడిన స్మిత్ మూడో సెషన్‌లో జోరు పెంచాడు.
మహ్మద్ సిరాజ్ వేసిన 62వ ఓవర్ చివరి బంతికి సింగిల్‌తో స్టీవ్ స్మిత్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వెంటనే షమీ వేసిన 65వ ఓవర్లో ట్రావిస్ హెడ్ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. వ్యక్తిగత మైలురాళ్లు దాటిన తర్వాత వీరు ఇన్నింగ్స్‌లో ఇంకా వేగం పెంచారు. చివరి సెషన్‌లో 34 ఓవర్లలోనే 157 పరుగులను ఆస్ట్రేలియా సాధించింది. భారత బౌలర్లు వికెట్ తీయడంలో విఫలం అయ్యారు. 81వ ఓవర్ తర్వాత కొత్త బంతిని తీసుకున్నా లాభం లేకపోయింది. దీంతో ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 327 పరుగులు సాధించింది.