IND vs AUS 2nd Test: అక్షర్, అశ్విన్ ల పోరాటంతో పోటీలోకి వచ్చిన భారత్- 62 పరుగుల ఆధిక్యంలో ఆసీస్
IND vs AUS 2nd Test: భారత్- ఆస్ట్రేలియా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 262 పరుగులకు ఆలౌటైంది. అక్షర్ పటేల్ (74), అశ్విన్ (37) 8వ వికెట్ కు శతక భాగస్వామ్యం అందించారు.

IND vs AUS 2nd Test: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న భారత్- ఆస్ట్రేలియా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 262 పరుగులకు ఆలౌటైంది. 139 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును అక్షర్ పటేల్- రవిచంద్రన్ అశ్విన్ లో జోడీ ఆదుకుంది. వీరిద్దరూ ఎనిమిదో వికెట్ కు 114 పరుగులు జోడించారు. దీంతో ఆస్ట్రేలియాకు ఆధిక్యం దక్కలేదు. అక్షర్ (115 బంతుల్లో 74), అశ్విన్ (71 బంతుల్లో 37) పట్టుదలగా ఆడటంతో భారత్ 262 పరుగులు చేసింది. ఆసీస్ కు ఒక పరుగు ఆధిక్యం లభించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లియాన్ 5 వికెట్లు తీయగా.. టాడ్ మర్ఫీ, మాథ్యూ కుహ్నెమాన్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు.
అశ్విన్- అక్షర్ హీరోయిక్ ఇన్నింగ్స్
ఆస్ట్రేలియా స్పిన్నర్లు విజృంభించటంతో టీ బ్రేక్ సమయానికి భారత్ 139 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇంకా చేతిలో 3 వికెట్లే ఉండటంతో ఆసీస్ కు భారీ ఆధిక్యం తప్పదనిపించింది. అయితే తొలి టెస్టులో జడేజాతో కలిసి టీమిండియాను ఆదుకున్న అక్షర్ పటేల్.. ఈసారి అశ్విన్ తో కలిసి జట్టు కుప్పకూలకుండా అడ్డుకున్నాడు. అప్పటికే బంతిని గింగిరాలు తిప్పుతూ విజృంభిస్తున్న ఆసీస్ స్పిన్నర్లను అశ్విన్- అక్షర్ లు సమర్ధంగా అడ్డుకున్నారు. ఒకసారి క్రీజులో కుదురుకున్నాక ఈ జోడీ వేగం పెంచింది. ముఖ్యంగా అరంగేట్ర బౌలర్ మాథ్యూ కుహ్నెమాన్ ను లక్ష్యంగా చేసుకుని వీరిద్దరూ బౌండరీలు కొట్టారు. ఓవైపు అశ్విన్ నెమ్మదిగా ఆడగా.. అక్షర్ మాత్రం వీలైనప్పుడల్లా బ్యాట్ ఝుళిపించాడు. అలా ఎనిమిదో వికెట్ కు వీరిద్దరూ 114 పరుగులు జోడించారు.
అయితే కొత్త బంతి తీసుకున్నాక ఆస్ట్రేలియా బౌలర్లు పుంజుకున్నారు. 9 పరుగుల వ్యవధిలో చివరి 3 వికెట్లు పడగొట్టారు. దీంతో భారత్ కు ఆధిక్యం దక్కలేదు. కొత్త బంతి తీసుకున్నాక తొలి ఓవర్లోనే కమిన్స్ బౌలింగ్ లో అశ్విన్ (71 బంతుల్లో 37) ఔటవగా.. ఆ వెంటనే అక్షర్ కూడా మర్ఫీ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. అనంతరం షమీని కుహ్నేమాన్ బౌల్డ్ చేశాడు. దీంతో భారత్ ఇన్నింగ్స్ 262 పరుగుల వద్ద ముగిసింది. విరాట్ కోహ్లీ (44), రోహిత్ శర్మ (32) రాణించారు.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 263 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖవాజా (81; 125 బంతుల్లో 12x4, 1x6), పీటర్ హ్యాండ్స్‌కాంబ్ (72 నాటౌట్; 142 బంతుల్లో 9x4) రాణించారు. భారత బౌలర్లలో షమీ 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్
రెండో ఇన్నింగ్స్ ను ఆస్ట్రేలియా దూకుడుగా మొదలుపెట్టింది. రెగ్యులర్ ఓపెనర్ వార్నర్ గాయంతో దూరమవటంతో ఖవాజాకు తోడుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన ట్రావెస్ హెడ్ బౌండరీలతో చెలరేగాడు. వన్డే తరహా ఆటతీరుతో వేగంగా పరుగులు రాబట్టాడు. మరో ఓపెనర్ ఖవాజా ((13 బంతుల్లో 6) తక్కువ స్కోరుకే వెనుదిరిగినప్పటికీ.. వన్ డౌన్ బ్యాటర్ మార్నస్ లబూషేన్, హెడ్ దూకుడుగా బ్యాటింగ్ చేశారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ ఒక వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. ట్రావెస్ హెడ్ (40 బంతుల్లో 39), లబూషేన్ (19 బంతుల్లో 16) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ 62 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Innings Break!#TeamIndia all out for 262 runs in the first innings of the 2nd Test.@akshar2026 (74) & @ashwinravi99 (37) with a brilliant 114 run partnership 💪
— BCCI (@BCCI) February 18, 2023
Scorecard - https://t.co/1DAFKevk9X #INDvAUS @mastercardindia pic.twitter.com/MHROqbFQ0D
.@akshar2026 scored a clinical momentum-changing knock of 7️⃣4️⃣ as he becomes #TeamIndia's Top Performer from the first innings 👌👌
— BCCI (@BCCI) February 18, 2023
A look at his batting summary ✅#INDvAUS pic.twitter.com/EbwNF60k08




















