KL Rahul: తిట్టినోళ్లతోనే పొగిడించుకున్న రాహుల్.. ఇది కదా విజయమంటే..!
INDvsAUS: ఇండియా-ఆస్ట్రేలియా మధ్య వాంఖడే వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా వెటరన్ బ్యాటర్ కెఎల్ రాహుల్ పోరాటంతో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది.
Venkatesh Prasad on KL Rahul: ‘నీకేం చేతకాదు.. నువ్వెందుకూ పనికిరావు..’అని తిట్టిన వ్యక్తులే మన కష్టాన్ని గుర్తించి ఆ విజయాన్ని పది మందితో మన గురించి గొప్పగా చెబుతుంటే వచ్చే కిక్కే వేరు. తాజాగా టీమిండియా వెటరన్ బ్యాటర్ కెఎల్ రాహుల్ కూడా అదే కిక్కులో ఉన్నాడు. నిన్నా మొన్నటిదాకా ‘భారత జట్టులో రాహుల్ వద్దంటే వద్దు..’అని గగ్గోలు పెట్టిన టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్.. ఇప్పుడు అదే రాహుల్‌ను ‘నువ్వు తోపు’అంటుంటే ఆ మాత్రం కిక్ ఉండదా మరి..
ఇండియా - ఆస్ట్రేలియా మధ్య ముంబై (వాంఖడే) వేదికగా శుక్రవారం రాత్రి ముగిసిన తొలి వన్డేలో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆసీస్ ను 188 పరుగులకే కట్టడి చేసిన భారత్ కు విజయం అంత ఈజీగా రాలేదు. 39 కే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి ఓటమి ప్రమాదంలో పడ్డ భారత్ ను కెఎల్ రాహుల్ ఆదుకున్నాడు. భారత్ ను గెలిపించడానికి రవీంద్ర జడేజాతో కలిసి ఓ చిన్నపాటి పోరాటమే చేశాడు. పటిష్ట ఆసీస్ బౌలింగ్ దాడికి ఎదురునిలిచి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 91 బంతులాడి ఏడు ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 75 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
రాహుల్ క్లాస్ ఇన్నింగ్స్‌తో భారత్ గెలిచాక వెంకటేశ్ ప్రసాద్ ట్విటర్ వేదికగా స్పందించాడు. ‘కెఎల్ రాహుల్ ఒత్తిడిలో కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. గొప్ప ప్రదర్శన. రవీంద్ర జడేజా అతడికి మంచి సాయాన్ని అందించాడు. భారత్ కు ఇది అద్భుత విజయం..’ అని ట్వీట్ చేశాడు. ప్రసాద్ ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది. ఇన్నాళ్లు రాహుల్‌ను విమర్శించిన రాహుల్‌ను పొగడటంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Excellent composure under pressure and a brilliant innings by KL Rahul.
— Venkatesh Prasad (@venkateshprasad) March 17, 2023
Top knock. Great support by Ravindra Jadeja and a good win for India.#INDvAUS pic.twitter.com/tCs74rBiLP
రాహుల్‌పై యుద్ధం..
తొలి వన్డేలో గెలిచాక వెంకటేశ్ ప్రసాద్.. రాహుల్ ను మెచ్చుకున్నాడు గానీ నెల రోజుల క్రితం కథ మరోలా ఉంది. టెస్టులలో వరుసగా విఫలమవుతున్న రాహుల్ ను టీమ్ నుంచి తప్పించాలని ప్రసాద్ ట్విటర్ వేదికగా ఓ చిన్నపాటి యుద్ధమే చేశాడు. బీసీసీఐ అతడిని ఎందుకు సపోర్ట్ చేస్తుందో అర్థం కావడం లేదని.. రాహుల్ స్థానంలో దేశవాళీలో రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్, వన్డేలలో సూపర్ ఫామ్ లో ఉన్న శుభ్‌మన్ గిల్ ను ఆడించాలని కామెంట్స్ చేశాడు. ప్రసాద్ ట్వీట్ లకు తోడు రాహుల్ ఆట కూడా అలాగే సాగింది.
ఆస్ట్రేలియాతో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్ తో ఢిల్లీ టెస్టులో కూడా రాహుల్ అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. రాహుల్ ఫామ్ గురించి వెంకటేశ్ ప్రసాద్ లెక్కలు, బొక్కలూ అన్నీ తీశాడు. ఈ విషయంలో గౌతం గంభీర్, ఆకాశ్ చోప్రాలు రాహుల్ కు మద్దతుగా నిలిచినా వెంకటేశ్ వెనుకాడలేదు. అతడి విమర్శలకు తోడు ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇండోర్ టెస్టులో రాహుల్‌ను తప్పించి గిల్ ను ఆడించింది టీమ్ మేనేజ్మెంట్. ఇండోర్ లో గిల్ విఫలమైనా అహ్మదాబాద్ లో సెంచరీ చేశాడు.