International Cricket Council: శ్రీలంక కెప్టెన్‌పై నిషేధం, ఎందుకంటే
Wanindu Hasaranga: శ్రీలంక టీ 20 కెప్టెన్ వనిందు హసరంగాపై ఐసీసీ కొరడా ఝుళిపించింది. హసరంగాపై రెండు మ్యాచ్‌ల నిషేధాన్ని విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
అసలు ఎం జరిగిందంటే..
అఫ్గాన్‌తో జరిగిన చివరి టీ 20 మ్యాచ్‌లో శ్రీలంకకు 3 బంతుల్లో 11 పరుగులు కావాలి. ఈ సమయంలో అఫ్గాన్ బౌలర్ వఫాదర్ వేసిన బంతి బ్యాటర్ కమిందు మెండిస్ నడుము కంటే ఎత్తులో వెళ్లింది. లెగ్ అంపైర్‌గా ఉన్న హన్నిబల్ దాన్ని నోబాల్‌గా ప్రకటించలేదు. ఈ మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో శ్రీలంక ఓటమి పాలైంది. మ్యాచ్ అనంతరం హసరంగా మాట్లాడుతూ బంతి బ్యాటర్ నడుముకంటే ఎత్తుగా వెళ్లింది. అంపైర్ దాన్ని గమనించలేకపోతే అతడు క్రికెట్‌కు పనికిరాడు. వేరే పని చూసుకోవడం మంచిదంటూ వ్యాఖ్యానించాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ బ్యాటర్ రెహ్మానుల్లా గుర్బాజ్‌పై కూడా జరిమానా పడింది. అంపైర్ సూచనలు పాటించకుండా ఫీల్డ్‌లో పదే పదే బ్యాట్ గ్రిప్ మార్చుకోవడంతో అతని మ్యాచ్ ఫీజు నుంచి 15 శాతాన్ని ఐసీసీ కోత విధించింది.
లంకకు పూర్వ వైభవం కష్టమేనా..
అర్జున రణతుంగ,సనత్ జయసూర్య, ముత్తయ మురళీధరన్, కుమార సంగక్కర, మహేల జయవర్దనే, చమిందా వాస్, తిలకరత్నే దిల్షాన్...ఇలా ఒకప్పుడు శ్రీలంక జట్టునిండా దిగ్గజాలే. ఈ పేర్లు వింటేనే ప్రత్యర్థి జట్లు కొంచెం ఆందోళన పడేవి. ఒంటిచేత్తో జట్టును విజయ తీరాలకు చేర్చే ఆటగాళ్లతో శ్రీలంక ప్రత్యర్థి జట్లకు గట్టిపోటీనిచ్చేది. ఆస్ట్రేలియా అప్రతిహాత జైత్రయాత్ర చేస్తున్న రోజుల్లోనూ ఆ జట్టుకు లంకేయులు గట్టి సవాల్ విసిరి సత్తా చాటేవారు. మూడుసార్లు ప్రపంచకప్ ఫైనల్ ఆడిదంటే 1990వ దశకంలో లంక ఆటతీరు ఎలా సాగిందో చెప్పుకోవచ్చు. 1996లో అర్జున రణతుంగ సారథ్యంలో శ్రీలంక ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. 2007లో ఆస్ట్రేలియాతో ప్రపంచకప్ ఫైనల్స్ ఆడిన లంకేయులు 2011లో టీమిండియాతోనూ తుదిపోరులు తలపడ్డారు. 2007, 2011లో వరుసగా రెండుసార్లు ఫైనల్స్ ఆడి సత్తా చాటారు. కానీ 1996 తర్వాత లంక మళ్లీ ప్రపంచ ఛాంపియన్‌గా మారలేకపోయింది. కొన్నేళ్ల క్రితం వరకూ శ్రీలంక జట్టు తన ప్రదర్శనతో అద్భుతాలు సృష్టించేది. కానీ కాలం గడుస్తున్నా కొద్దీ సీనియర్ ఆటగాళ్ల రిటైర్‌మెంట్‌లు, దేశవాళీ నుంచి అద్భుతమైన క్రికెటర్లు రాక లంక పరిస్థితి దిగజారి పసికూన స్థాయికి దిగజారింది. ఇప్పుడు ఎప్పుడో కానీ లంకనుంచి అద్భుతాలు ఆశించడం గగనమైపోయింది. ఆసియాకప్ ఫైనల్లో భారత్ చేతిలో 50 పరుగులకు ఆలౌట్.. మళ్లీ ప్రపంచకప్‌లో 55 పరుగులకు ఆలౌట్ అయి లంక క్రికెట్ ప్రేమికుల మనసులను గాయపరిచింది.