ICC: ఫిక్సింగ్ ఆరోపణలు నిజమే,బంగ్లా క్రికెటర్‌పై రెండేళ్ల వేటు
Nasir Hossain: బంగ్లాదేశ్ క్రికెటర్ నాసిర్ హొసేన్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి భారీ షాకిచ్చింది. రెండేళ్ల పాటు క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది.
బంగ్లాదేశ్ క్రికెటర్ నాసిర్ హొసేన్(Nasir Hossain)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి( ICC)భారీ షాకిచ్చింది. రెండేళ్ల పాటు క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. ఐసీసీ అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినందుకుగానూ నాసిర్ హొసేన్‌పై నిషేధం విధిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. అబుదాబి టీ10 లీగ్‌లో 2020-21 సీజన్‌కు గానూ పుణె డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన నాసిర్ హుసేన్.. మరో ఏడుగురితో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి.
ఆరోపణలు నిజమేనన్న కమిటీ
ఈ నేపథ్యంలో ఐసీసీ అవినీతి నిరోధక విభాగం సెప్టెంబరు, 2023లో అభియోగాలు నమోదు చేసింది. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం విచారణలో నాసిర్ హుసేన్ తప్పు చేసినట్లు తేలింది. ఖరీదైన ఐఫోన్ 12ను బహుమతిగా పొందడం సహా ఫిక్సింగ్‌కు సంబంధించి ఆ ఫోన్‌లో బుకీలతో మాట్లాడటం.. ఈ విషయాల గురించి ఏ దశలోనూ అవినీతి నిరోధక విభాగంతో సంప్రదించకపోవడం, విచారణలో సహకరించకపోవడం అతడిపై వేటుకు కారణమైంది. హొసేన్‌పై నిషేధం నేపథ్యంలో.. మళ్లీ 2025 ఏప్రిల్ 7 తర్వాతనే నాసిర్ హుసేన్ అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం ఉంటుంది. స్పిన్ ఆల్‌రౌండర్ అయిన నాసిర్ హుసేన్ బంగ్లాదేశ్ తరఫున 19 టెస్టులు, 65 వన్డేలు, 31 టీ20లు ఆడాడు. ఆఖరిసారిగా 2018లో బంగ్లా జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.
ఇటీవల వివాదాల్లో షకీబుల్
దురుసు ప్రవర్తనతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే బంగ్లాదేశ్(Bangladesh) స్టార్ ఆల్‌రౌండర్, కెప్టెన్ షకీబుల్ హసన్(Shakib Al Hasan) మరోసారి అలాంటి ప్రవర్తనతోనే వార్తల్లో నిలిచాడు. ఆన్‌ఫీల్డ్‌లో తన దుందుడుకు స్వభావంతో ఎన్నోసార్లు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించి చిక్కుల్లో పడ్డ ఈ స్టార్ ఆల్‌రౌండర్.. మరోసారి తన అభిమాని చెంప చెళ్లుమనిపించి వార్తల్లో నిలిచాడు. ఇటీవలే రాజకీయాల్లోకి దిగి అవామీ లీగ్ పార్టీ(Awami League party) తరఫున ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన షకీబ్.. పోలింగ్ రోజున సొంత అభిమానిపై చేయి చేసుకున్నాడు. ఓ పోలింగ్ స్టేషన్ సందర్శనకు వెళ్లిన షకీబ్‌ను సదరు అభిమాని వెనక నుంచి నెట్టడంతో సహనం కోల్పోయి షకీబుల్ హసన్ చెంప చెళ్లుమనిపించాడు. ఇప్పుడు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో షకీబ్ ఎంపీగా గెలిచాడు. షకీబ్ తన సమీప ప్రత్యర్ధి ఖాజీ రేజౌల్ హొస్సేన్‌పై లక్షాన్నరకుపైగా ఓట్ల తేడాతో గెలిచాడు. ఈ ఎన్నికల్లో షకీబ్ పార్టీ అవామీ లీగ్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈ అవామీ లీగ్ పార్టీకి ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ పార్టీ పూర్తి మెజార్టీ సాధించడంతో షేక్ హసీనానే మళ్లీ ప్రధాన పదవి చేపట్టనున్నారు. ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్(Shakib Al Hasan).. మాధ్యూస్‌ను టైమ్డ్ అవుట్ అంటూ అప్పీల్ చేశాడు. అంపైర్లు రెండుసార్లు అప్పీల్‌ను వెనక్కి తీసుకోవాలని కోరినా షకీబుల్ హసన్ నిరాకరించడంతో ఏంజెలో మాధ్యూస్ కోపంగా పెవిలియన్‌కు చేరాడు.
Also Read: టీమిండియా ప్రాక్టీస్‌లో అనుకోని అతిథి, వీడియో వైరల్
Also Read:చరిత్రకు ఆరు పరుగుల దూరంలో విరాట్-ఊరిస్తున్న రికార్టు