India vs Australia T20: భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ , టికెట్ల కోసం ఎగబడుతున్న అభిమానులు
Ind vs Aus T20 in Vizag: ప్రపంచకప్ తరువాత ఆస్ట్రేలియాతో సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. విశాఖ వేదికగా ఈ నెల 23న జరగనున్న మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
Heavy Demand For Vizag T20 Tickets : ప్రపంచకప్ తరువాత ఆస్ట్రేలియాతో సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. విశాఖ వేదికగా ఈ నెల 23న జరగనున్న మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఆన్‌లైన్ టికెట్ల విక్రయం పూర్తయింది. మరోవైపు నేటి నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్లను అమ్ముతున్నారు. విశాఖపట్నం పీఎంపాలెంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియం బీ గ్రౌండ్, వన్‌టౌన్‌లోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, గాజువాకలోని రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆఫ్‌లైన్‌లో టికెట్ల విక్రయిస్తున్నారు. ఆఫ్‌లైన్‌లో టికెట్లు దక్కించుకునేందుకు టికెట్ల కౌంటర్ల వద్ద యువత ఎగబడ్డారు. టికెట్లను కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున యువత అక్కడికి చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. త్వరితగతిన టికెట్లు దక్కించుకునేందుకు కొందరు యువకులు గురువారం రాత్రి స్టేడియాల వద్దే నిద్రపోయారు. మహిళలు సైతం శుక్రవారం వేకువజాము నుంచే క్యూలైన్లలోకి చేరుకుని టికెట్లకు పోటీపడ్డారు. గంటల తరబడి క్యూలైనల్లో నిలబడి మరీ టికెట్లు పొందారు. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌ను ఎలాగైనా చూడాలన్న పట్టుదలతో రాత్రంతా స్టేడియాల వద్దే అభిమానులు పడిగాపులు కాశారు. కొందరు టికెట్లు దక్కించుకుని ఆనందపడగా.. మరికొందరు ఇంకా క్యూలైన్లలోనే ఉన్నారు.
నవంబర్ 19న ప్రపంచకప్ ముగిసిన తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. నవంబర్ 23 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. నవంబర్ 23, 26, 28, డిసెంబర్ 1, 3 తేదీల్లో.. టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. నవంబర్ 23న భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న తొలి టీ 20 మ్యాచ్‌కు విశాఖ వేదికగా మారనుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే ఇండియా, ఆస్ట్రేలియా టీ–20 అంతర్జాతీయ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆఫ్‌లైన్‌లో 11,500 టికెట్లు విక్రయిస్తారని, కాంప్లిమెంటరీ టికెట్లు 5 వేల వరకు ఉంటాయని ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ అధికారులు తెలిపారు.
క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చే ప్రేక్షకులు పోలీసులకు సహకరించాలని విశాఖ డీసీపీ కోరారు. మ్యాచ్ ప్రారంభం కంటే ముందుగానే వచ్చి ఎవరి సీట్లలో వారు కూర్చోవాలని వాహనాలు పార్కింగ్ విషయంలో నిబంధనలు పాటించాలనారు. స్టేడియానికి విలువైన వస్తువులు, ఎక్కువ మొత్తంలో నగదు తీసుకురావద్దని విశాఖ పోలీసులు సూచించారు. సెక్యూరిటీ పరంగా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. టికెట్లపై ఒక ప్రత్యేక మార్కు ఉండేలా డిజైన్ చేశామని,స్కాన్‌లో ఆ మార్కు రాకపోయినా, కలర్ జిరాక్స్ టికెట్లు తీసుకొచ్చినా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. దానికి ఎవరూ బాధ్యత వహించరని, ఎటువంటి కారణాలు చెప్పినా మ్యాచ్ కు అనుమతించేది లేదు సరికదా అలా వచ్చిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇక భారత్‌తో జరిగే ఈ టీ 20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్టు.. 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. కీపర్ మాథ్యూ వేడ్‌కు సారధ్య బాధ్యతలు కట్టబెట్టింది. జట్టులో వార్నర్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మ్యాక్స్‌వెల్, స్టోయినిస్, జంపాలకు స్థానం దక్కింది. ఆసిస్ జట్టులో చాలా వరకు వరల్డ్‌కప్‌లో ఆడుతున్న ఆటగాళ్లే ఉన్నారు. వరల్డ్‌కప్‌లో ఆడుతున్న కమ్మిన్స్, స్టార్క్, హేజల్‌వుడ్, కెమరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్ లకు విశ్రాంతి ఇచ్చారు. ప్రపంచకప్ తర్వాత వీరు స్వదేశం తిరిగి వెళ్లనున్నారు.