Rohit Sharma On T20: టీ20 క్రికెట్‌ను వదల్లేదు.. చూద్దాం ఏం జరుగుతుందో - రోహిత్ శర్మ
Rohit Sharma On T20: టీ20 క్రికెట్‌ను తానేమీ వదల్లేదని టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. మూడు ఫార్మాట్లు ఆడే క్రికెటర్లకు కచ్చితంగా విశ్రాంతి ఇవ్వాలన్నాడు.
Rohit Sharma On T20:
టీ20 క్రికెట్‌ను తానేమీ వదల్లేదని టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. మూడు ఫార్మాట్లు ఆడే క్రికెటర్లకు కచ్చితంగా విశ్రాంతి ఇవ్వాలన్నాడు. తానూ ఆ విభాగంలోకే వస్తానని వెల్లడించాడు. శ్రీలంకతో తొలి వన్డేకు ముందు హిట్‌మ్యాన్ మీడియాతో మాట్లాడాడు.
'వెంటవెంటనే మ్యాచులు ఆడటం కుదరదని మొదట మనం అర్థం చేసుకోవాలి. మూడు ఫార్మాట్లు ఆడే క్రికెటర్లకు ఎక్కువ విశ్రాంతి అవసరం. నేను కచ్చితంగా ఆ కేటగిరీలోకి వస్తాను. న్యూజిలాండ్‌తో మాకు మూడు టీ20ల సిరీస్ ఉంది. ఐపీఎల్ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. టీ20 ఫార్మాట్‌ను వదిలేయాలని నేనైతే నిర్ణయించుకోలేదు' అని రోహిత్ శర్మ అన్నాడు.
I have not decided to give up on T20 format, says India's ODI and Test skipper Rohit Sharma
— Press Trust of India (@PTI_News) January 9, 2023
ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఓటమి తర్వాత బీసీసీఐ కఠిన నిర్ణయాలు తీసుకుంది. టీ20 క్రికెట్లో కుర్రాళ్లకే ఎక్కువ అవకాశాలు ఇస్తోంది. సీనియర్లను కీలకమైన వన్డే ప్రపంచకప్‌నకు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో వారిని తాజాగా ఉంచాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే శ్రీలంకతో టీ20 సిరీసుకు హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా ప్రకటించింది. దీంతో ఇక మీదట రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు పొట్టి క్రికెట్ ఆడరన్న వార్తలు వచ్చాయి. వీటిపై రోహిత్ స్పష్టతనిచ్చాడు.
టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాను శ్రీలంక వన్డే సిరీస్ నుంచి ఎందుకు తప్పించారో రోహిత్ వివరించాడు. 'జాతీయ క్రికెట్ అకాడమీ నెట్స్‌లో బౌలింగ్ చేస్తుండగా జస్ప్రీత్ బుమ్రా వెన్నెముక పట్టేసింది' అని తెలిపాడు. వన్డేల్లో శుభ్‌మన్ గిల్ తనతో కలిసి ఓపెనింగ్ చేస్తాడని పేర్కొన్నాడు. 'దురదృష్ట వశాత్తు ఇషాన్ కిషన్‌ను ఆడించలేకపోతున్నాం. శుభ్‌మన్ గిల్‌కు మేం మరిన్ని అవకాశాలు ఇవ్వడమే న్యాయం' అని వెల్లడించాడు.
టీ20 సిరీసుకు దూరమైన సీనియర్లు లంకతో వన్డే సిరీసుకు అందుబాటులోకి వచ్చారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ జట్టులో చేరారు. ఆసియాకప్‌ను మినహాయిస్తే ప్రపంచకప్ ముంగిట టీమ్‌ఇండియాకు 15 వన్డేలు ఉన్నాయి. ఆ లోపు సమతూకం తీసుకొచ్చేందుకు టీమ్‌ఇండియా యాజమాన్యం ప్రయత్నిస్తోంది.
View this post on Instagram