వెయిట్‌లిఫ్టింగ్ చేయడమేంటి ? మీరేమైనా కోహ్లీనా? టీమిండియా క్రికెటర్ల సెహ్వాగ్ ఆగ్రహం
Virender Sehwag: టీమిండియా క్రికెటర్లు ఇటీవల కాలంలో తరుచూ గాయాలపాలవడంపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Sehwag on Indian Players: గత కొంతకాలంగా తరుచూ గాయాలపాలవుతున్న భారత క్రికెటర్లపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. క్రికెటర్లకు గ్రౌండ్ లో గాయాలయ్యే దానికంటే జిమ్ ల లోనే ఎక్కువ గాయాలవుతున్నాయని వ్యాఖ్యానించాడు. ఫిట్నెస్ విషయంలో అందరూ విరాట్ కోహ్లీలు కాదని.. ఎవరి బాడీని బట్టి వాళ్లు వ్యాయామాలు చేయాలి గానీ అందరికీ ఒకే విధమైన ఎక్సర్‌సైజులు మొదటికే మోసం తెస్తున్నాయని వీరేంద్ర సెహ్వాగ్ వాపోయాడు. ఆటగాళ్లతో పాటు టీమిండియా పర్ఫార్మెన్స్ కోచ్ బసు శంకర్ మీద కూడా విమర్శలు సంధించాడు వీరూ. అందరికీ ఒకే రకమైన ఫిట్నెస్ ప్రోగ్రామ్ లు మంచిది కాదని సూచించాడు.
ప్రముఖ యూట్యూబర్ రన్వీర్ అల్హబాదియా పోడ్‌కాస్ట్ ‘ద రన్వీర్ షో’కు అతిథిగా వచ్చిన క్రికెటర్ ఫిట్‌నెస్‌పై మాట్లాడారు. ...‘బసూ శంకర్ గత కొన్నాళ్లుగా భారత జట్టుతో ఉన్నాడు. అతడు అందరు క్రికెటర్లకూ ఒకే విధమైన ఫిట్నెస్ ప్రోగ్రామ్ లు పెడుతున్నాడు. రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీలు ఇద్దరికీ ఒకే రకమైన ఫిట్నెస్ ప్రోగ్రామ్ లు పెట్టడం ఎంత వరకు సమంజసం...? నేను అశ్విన్ తో కలిసి పంజాబ్ కింగ్స్ తో ఆడేప్పుడు అశ్విన్ నాతో మాట్లాడుతూ.. తమతో ఇంకా క్లీన్ అండ్ జెర్క్ (వెయిట్ లిఫ్టింగ్) చేయిస్తున్నాడని చెప్పాడ’ని అన్నాడు.
గ్రౌండ్‌లో కాదు జిమ్ లోనే గాయాలు..
భారత క్రికెటర్లకు మ్యాచ్ లు ఆడుతున్నప్పుడు అయ్యే గాయాల కంటే జిమ్ లలోనే ఎక్కువ అవుతున్నాయని నజఫ్‌గఢ్ నవాబ్ చెప్పాడు. ‘అసలు క్రికెటర్లు వెయిట్ లిఫ్టింగ్ చేయడమేంటి..? క్రికెట్ లో వెయిట్ లిఫ్టింగ్ కు చోటు లేదు. బరువులెత్తేకంటే మీ ఆటను ఇంప్రూవ్ చేసుకునే వ్యాయామాలు చేయండి. బరువులు ఎత్తడం వల్ల ఎముకలు దృఢమవుతాయోమో గానీ అది శరీరంపై నొప్పిని కూడా కలగజేస్తుంది. కెఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ.. వీళ్లంతా గాయాల బాధితులే. పైన చెప్పిన పేర్ల క్రికెటర్లకు ఫీల్డ్ లో అయిన గాయాల కంటే జిమ్ లో అయిన గాయాలే ఎక్కువ. మేం క్రికెట్ ఆడేప్పుడు సచిన్, గంభీర్, ధోని, యువరాజ్, ద్రావిడ్, లక్ష్మణ్ లు ఎప్పుడైనా ఇలా వెన్ను గాయంతో సిరీస్ ల నుంచి తప్పుకున్న సందర్భాలున్నాయా..?’అని ప్రశ్నించాడు.
అందరూ కోహ్లీలు కాదు..
మారుతున్న కాలానాకి అనుగుణంగా క్రికెటర్లు ఫిట్నెస్ కు ప్రాధాన్యమివ్వడం మంచి పరిణామమే అయినా వాళ్ల శరీర తత్వానికి అనుగుణంగా వ్యాయామాలు ఎంచుకోవడం మంచిదని వీరూ అన్నాడు. విరాట్ కోహ్లీ జిమ్ లో గంటల కొద్దీ శ్రమిస్తున్నట్టు తాము కూడా జిమ్ లలో బరువులెత్తడాలు, శక్తికి మించిన వ్యాయామాలు చేస్తే అది మొదటికే మోసం వస్తుందని సెహ్వాగ్ అన్నాడు. తమ హయాంలో ఫిట్నెస్ కంటే ఆట మీదే ఎక్కువ దృష్టి పెట్టేవాళ్లమని, అయినా కూడా తాము రోజంతా బ్యాటింగ్ చేశామని, నేటి కాలంలో క్రికెటర్లు ఒక్క సిరీస్ లో ఆడితే మరో సిరీస్ లో కనిపించేది గగనమవుతుందని వీరూ వాపోయాడు.