Duleep Trophy Highlights: ఇండియా-ఏ గెలుపు, ఇండియా డీపై 186 పరుగుల తేడాతో ఘన విజయం
Duleep Trophy 2024 | దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఇండియా ఏ జట్టు 186 పరుగుల భారీ తేడాతో ఇండియా డీపై ఘన విజయం సాధించింది. అనంతపురంలో ఈ మ్యాచ్‌లు జరిగాయి.

India A beats India D by 186 runs in Anantapur | అనంతపురం: దులీప్ ట్రోఫీలో ఇండియా- ఏ జట్టు విజయభేరి మోగించింది. ఆదివారం ఆర్డీటీ స్పోర్ట్స్ సెంటర్‌లో ఇండియా- డీతో జరిగిన మ్యాచ్‌లో 186 పరుగుల భారీ తేడాతో ఇండియా- ఏ జట్టు గెలుపొందింది. తెలుగు తేజం రిక్కీ భుయ్ విరోచిత ఇన్నింగ్స్‌తో సెంచరీ సాధించినా..అతనికితోడు ఎవరూ క్రీజ్‌లో నిలబడకపోవడంతో డీ జట్టు 301 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఏ జట్టులో ఆల్ రౌండర్ సామ్స్ ములానీ 89 పరుగులతో పాటు తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీయడంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
సెంచరీతో కదంతొక్కిన రికీ భుయ్ :
488 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఇండియా -డీ జట్టు ఓవర్‌నైట్ స్కోర్ 62/1తో ప్రారంభించింది. యష్‌దుబే, రిక్కీ భుయ్ లు నెమ్మదిగా పరుగులు రాబట్టే ప్రయత్నం చేశారు. యష్ దుబే 94 బంతుల్లో 5 బౌండరీల సహాయంతో 37 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. రెండో డౌన్‌లో వచ్చిన దేవదత్ పడిక్కిల్ కేవలం ఒక పరుగు చేసి సామ్స్ ములానీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రిక్కీ భుయ్ లు జతకలిశారు. వీరిద్దరూ అవకాశం దొరికినప్పుడుల్లా బంతిని బౌండరీలకు తరలించారు.
రిక్కీ భుయ్ 195 బంతులు ఎదుర్కొని 14 బౌండరీలు, 3 భారీ సిక్సర్ల సహాయంతో 113 పరుగులు చేశాడు. 41 పరుగులు చేసి శ్రేయస్ అయ్యర్ 41(8 ఫోర్లు) చేశాడు. శ్రేయస్ అవుటయ్యాక వికెట్ కీపర్ సంజు సామ్సన్, రిక్కీ భుయ్ లు కాసేపు అలరించారు. 45 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. రిక్కీ భుయ్ దూకుడు తగ్గలేదు. చూడచక్కని షాట్లతో అందరినీ అలరించాడు. దూకుడుగా ఆడుతున్న రిక్కీ భుయ్ ను తనుష్ కొటియన్ అవుట్ చేశాడు. సౌరభ్‌కుమార్ 22, హర్షిత్ రాణా 24 పరుగులు చేశారు. ఇండియా ఏ బౌలర్లలో సామ్స్ ములానీ 3, తనుష్ కొటియన్ 4, రియన్ పరాగ్, ఖలీల్ అహ్మద్ చెరో వికెట్ తీసుకున్నారు.
డ్రాగా ముగిసిన ఇండియా బీ, సీ జట్ల మ్యాచ్
ఓవర్‌నైట్ స్కోర్ 309/7తో ప్రారంభించిన ఇండియా బీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 108 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఇండియా సీ జట్టుకు 193 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది. ఇండియా బీ జట్టు కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 286 బంతుల్లో 157 (14 ఫోర్లు, సిక్సర్) పరుగులు చేశాడు. ఇండియా సీ బౌలర్ అన్షుల్ కాంబోజ్ 27.5 ఓవర్లలో 69 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. విజయకుమార్ ౖవైశాక్, మయాంక్ మార్ఖండే చెరో వికెట్ తీసుకున్నారు.
అనంతరం ఇండియా సీ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 128/4 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 93 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ సహాయంతో 62 పరుగులు (అర్ధసెంచరీ) సాధించాడు. రజత్ పటీదార్ 84 బంతుల్లో 5 ఫోర్ల సహాయంతో 42 పరుగులు చేశాడు. ఇండియా బీ బౌలర్లలో రాహుల్ చాహర్ 2, ముకేష్‌కుమార్, ముషీర్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు.ఇండియా -సీ, బీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. 8 వికెట్లతో పాటు 38 పరుగులు సాధించిన అన్షుల్ కాంబోజ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎన్నికయ్యాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

