Ayodhya Ram Pran Pratishtha : జై శ్రీరామ్ అన్న పాక్ క్రికెటర్, రామ ఫొటో ట్వీట్ చేసిన ఆసిస్ క్రికెటర్
Ayodhya : ప్రాణ ప్రతిష్ట మహోత్సవంపై విదేశీ క్రికెటర్లు పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్, దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ స్పందించారు.
రామజన్మభూమి అయోధ్య(Ayodhya) లో భక్తుల ఐదు శతాబ్దాల కల నెరవేరింది. జన్మభూమిలో కోదండరాముడు కొలువుదీరాడు. ఆధునికత, సంప్రదాయాల మేళవింపుతో చరిత్రలో చెరగని ముద్రవేసేలా అయోధ్యలో నిర్మించిన భవ్యమందిరలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. వేదమంత్రోచ్చరణలు, మంగళవాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ నీలమేఘ శ్యాముడైన రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
దాదాపు 8 వేలమంది దేశ, విదేశీ అతిథులు, టీవీల్లో చూసిన కోట్లమంది భక్తులు కోదండరాముడిని చూసి తన్మయత్వానికి గురయ్యారు. ఈ చారిత్రక క్షణాలను దేశ, విదేశీ క్రికెటర్లు చూసి పులకించిపోయారు. క్రికెట్ దిగ్గజాలు ఈ వేడుకను చూసి తన్మయత్వంతో తరించారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన మహోత్సవంపై విదేశీ క్రికెటర్లు స్పందించారు. రాముడి విగ్రహం ఫొటోను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా వందల ఏళ్ల నిరీక్షణకు తెరపడిందని... వాగ్దానం ముగిసిందని... రాముడి ప్రాణ ప్రతిష్ఠ పూర్తయ్యిందని ట్వీట్ చేశాడు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ జై శ్రీరామ్ అనే క్యాప్షన్‌తో రాముడిపై పోస్ట్ పెట్టాడు. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ప్రాణ ప్రతిష్ఠ వేడుక శుభాకాంక్షలు తెలిపాడు. అయోధ్య రామయ్య విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి భారత దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, వెంకటేశ్ ప్రసాద్, మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, రవీంద్ర జడేజా హాజరయ్యారు.
క్రీడా దిగ్గజాల భావోద్వేగం-
అయోధ్య వేదికగా అద్భుత దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి దేశం నలుమూలల నుంచి ప్రముఖులు తరలివచ్చారు. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం కోసం.. ఇప్పటికే ట్రస్టు సుమారు 7 వేల మందికిపై ఆహ్వానాలు పంపింది. అతిథుల రాకతో అయోధ్య పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో క్రీడా ప్రముఖుల్లో ఆహ్వానాలు అందుకున్న వారు సైతం అయోధ్యకు తరలివచ్చారు. క్రికెటర్లు సచిన్(Sachin Tendulkar), అనిల్ కుంబ్లే, రవీంద్ర జడేజా(Ravindra Jadeja), మిథాలీరాజ్, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తదితరులు ఈ అద్భుతమైన, అపురూపమైన కార్యక్రమానికిహాజరయ్యారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సాంప్రదాయ దుస్తుల్లో ఈ మహా వేడుకకు హాజరవ్వగా... అభిమానులు సెల్ఫీల కోసం క్యూ కట్టారు.
కేశవ్ మహరాజ్...
విదేశీ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు భారత సంతతి ఆటగాళ్లూ ఈ వేడుకపై స్పందించారు. ఈ నేపధ్యంలో దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహరాజ్(Keshav Maharaj) సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశాడు. ఈ అద్భుతమైన రోజు ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండిపోతుందని, దేశ వ్యాప్తంగానే కాకుండా దక్షిణాఫ్రికాలోని భారత సంతతి ప్రజలకు కూడా శుభాకాంక్షలు చెబుతున్నానన్నారు. రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ ఘనంగా జరగాలని కోరుకుంటున్నానన్నారు . అందరిలోనూ శాంతి, సామరస్యం, ఆధ్యాత్మిక జ్ఞానోదయం తీసుకురావాలని కోరుకుంటున్నానన్నారు. కేశవ్ పూర్వీకులు భారత్ నుంచి ఉపాధి నిమిత్తం దక్షిణాఫ్రికాకు వలస వెళ్లారు. కేశవ్ తండ్రి ఆత్మానందం కూడా క్రికెట్ ఆడినా వర్ణవివక్ష కారణంగా ఎదగలేకపోయాడు. తొలి నాళ్లలో సీమ్ బౌలర్, ఆల్‌రౌండర్ అయిన కేశవ్.. తర్వాత స్పిన్నర్ అవతారం ఎత్తాడు. 2016లో ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి ఆరంగేట్రం చేశాడు.