India vs NZ: న్యూజిలాండ్ తో సెమీస్ సంగ్రామం - వాంఖడేకు తరలివచ్చి మ్యాచ్ ఆస్వాదిస్తున్న సెలబ్రిటీలు
ODI World Cup 2023: ముంబైలోని వాంఖడే మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు దిగ్గజ క్రికెటర్లు, పారిశ్రామిక, రాజకీయ, సినీ ప్రముఖులు తరలివచ్చారు.
India vs New Zealand: ప్రపంచకప్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్‌తో మధ్య జరుగుతున్న తొలి సెమీఫైనల్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్‌కు దిగి భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. రోహిత్ శర్మ-గిల్ అదిరే ఆరంభాన్నివ్వగా... విరాట్ కోహ్లీ ఆ ఆరంభాన్ని ముందుకు తీసుకెళాడు. ముంబైలోని వాంఖడే మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు దిగ్గజ క్రికెటర్లు, పారిశ్రామిక, రాజకీయ, సినీ ప్రముఖులు తరలివచ్చారు. ఇంగ్లండ్ మాజీ స్టార్ ఫుట్‌బాల‌్ ప్లేయర్ డేవిడ్ బెక్‌హమ్ ఈ మ్యాచ్‌కు హాజరై ప్రత్యక్షంగా వీక్షిస్తున్నాడు. బీసీసీఐ సెక్రటరీ జై షా పక్కన ఆసీనుడైన బెక్‌హమ్ భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సీరియస్‌గా మ్యాచ్ చూస్తూ కనిపించాడు.
క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, హార్దిక్ పాండ్య , వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ ఈ మ్యాచ్‌కు హాజరయ్యారు. సినీ తారలు రణ్‌బీర్ కపూర్, కియారా అడ్వాణీ, విక్టరీ వెంకటేష్ ఈ మ్యాచ్‌ను చూసేందుకు వాంఖడేకు తరలివచ్చారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త, అపర కుభేరుడు ముఖేష్ అంబానీ, అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ కూడా ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు తరలివచ్చారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన తర్వాత రోహిత్ తొలి బంతి నుంచే విధ్వంసానికి దిగడంతో వీరంతా చప్పట్లు కొడుతూ సందడి చేశారు. బౌండరీలు, సిక్సులు కొట్టినప్పుడు ఎగిరి గంతేశారు. సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్ ఈ మ్యాచ్‌కు హాజరై.... శుభ్‌మన్ గిల్ బౌండరీలు, సిక్సులు కొట్టినప్పుడల్లా సందడి చేసింది.
ఇక ఈ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. రోహిత్ శర్మ టీమిండియాకు అదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. తొలి ఓవర్‌లోనే పది పరుగులు రాబట్టిన రోహిత్... దొరికి బౌలర్‌ను దొరికనట్లు బాదేశాడు. గిల్ కూడా ధాటిగా ఆడడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 29 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 4 ఫోర్లు, 4 సిక్సులతో 47 పరుగులు చేసిన హిట్ మ్యాన్ అర్ధ శతకానికి ముందు అవుటయ్యాడు. సౌధీ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు యత్నించి రోహిత్ అవుటయ్యాడు. కానీ రోహిత్ అవుటయ్యే సరికే 8.2 ఓవర్లలో భారత్ స్కోరు 71 పరుగులకు చేరింది. గిల్ కూడా ధాటిగా ఆడాడు . 65 బంతుల్లో 8 ఫోర్లు, మూడు సిక్సర్లతో 79 పరుగులు చేశాడు. ఈ దశలో గిల్‌కు తొడ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. తర్వాత విరాట్‌తో కలిసి శ్రేయస్స్ మ్యాచ్‌ను ముందుకు నడిపిస్తున్నారు.
2019 ప్రపంచకప్ సెమీస్‌లో పరాభవానికి ప్రతీకారంగా కివీస్‌ను ఇంటికి పంపాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. ప్రస్తుతం అజేయంగా సెమీస్‌కు చేరిన టీమిండియా జోరు చూస్తేంటే కివీస్‌కు మరోసారి భంగపాటు తప్పకపోవచ్చని మాజీలు అంటున్నారు.
ఈ ప్రపంచకప్ ఆరంభానికి ముందు జట్టు తుది కూర్పు, మిడిలార్డర్ వైఫల్యం వంటి సమస్యలతో కనిపించిన రోహిత్ సేన.. బరిలోకి దిగాక మాత్రం అంచనాలను మించి రాణిస్తోంది. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది. గత నెల ఆస్ట్రేలియాతో ప్రారంభమైన రోహిత్‌సేన ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌ల ప్రస్థానం... నెదర్లాండ్స్‌తో మ్యాచ్ వరకు నిరాటంకంగా సాగింది. ఇక మిగిలింది రెండు మ్యాచ్‌లే. ఈ సెమీస్‌లోనూ బలమైన ఆరంభాన్ని దక్కించుకున్న టీమిండియా భారీ స్కోరు సాధిస్తే న్యూజిలాండ్‌కు తిప్పలు తప్పవు.