Ind Vs Eng T20 Series: సమరానికి సిద్ధం.. తొలి టీ20 కోసం కోల్ కతా చేరుకున్న భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు..
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ కు రంగం సిద్ధమైంది. తొలి మ్యాచ్ కోసం మ్యాచ్ వేదికైన కోల్ కతా నగరానికి ఆటగాళ్లు చేరుకుంటున్నారు. ఈనెల 22న తొలి టీ20 ప్రారంభం కానుంది.

Kolkata T20: కొత్త సంవత్సరం భారత గడ్డపై టీ20 ఫీవర్ స్టార్టయ్యింది. ప్రస్తుత టీ20 వరల్డ్ చాంపియన్ ఇండియా, మాజీ చాంపియన్ ఇంగ్లాండ్ ల మధ్య ఐదు టీ20ల సిరీస్ కు రంగం సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ ఈనెల 22 నుంచి కోల్ కతా లో ప్రారంభం కానుంది. ఇందుకోసం నగరానికి ఇరుజట్ల ప్లేయర్లు చేరుకుంటున్నారు. మొదటగా సౌతాఫ్రికా నుంచి లియామ్ లివింగ్ స్టన్ నగరానికి చేరుకున్నాడు. ఆ తర్వాత విధ్వంసక ప్లేయర్ జానీ బెయిర్ స్టో.. దుబాయ్ లో నిర్వహించిన శిక్షణా శిబిరం నుంచి ఇండియాకు చేరుకున్నాడు. అలాగే భారత జట్టు తరఫున తెలుగు కుర్రాడు, నితీశ్ కుమార్ రెడ్డి, రింకూ సింగ్ కూడా కోల్ కతాకు చేరుకున్నాడు. అలాగే మరో తెలుగు తేజం ఠాకూర్ తిలక్ వర్మ, జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో కలిసి చేరుకున్నాడు. వీరిద్దరూ ఫ్లైట్ లో కలిసి ప్రయాణం చేస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. హెడ్ కోచ్ గౌతం గంభీర్ తోపాటు మిగతా ఆటగాళ్లు కూడా నగరానికి చేరుకుంటారు.
Captain Suryakumar Yadav & Tilak Verma are on their way to join Team India !! pic.twitter.com/sPF8Hsis4y
— Kamlesh Yadav (@kamleshyadav242) January 18, 2025
మూడేళ్ల తర్వాత తొలిసారి ఆతిథ్యం..
నగరంలోని ఈడెన్ గార్డెన్ స్టేడియం టీ20 మ్యాచ్ కు చివరిసారిగా 2022 ఫిబ్రవరిలో ఆతిథ్యమిచ్చింది. వెస్టిండీస్ తో ఆ మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత చివరిగా 2023 వన్డే ప్రపంచకప్ వన్డే మ్యాచ్ కు ఆతిథ్యమిచ్చింది. బుధవారం జరిగే ఈ మ్యాచ్ కు పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యే చాన్స్ ఉందని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడు స్నేహాశిష్ గంగూలీ అభిప్రాయ పడ్డాడు. టికెట్ల కోసం ఇప్పటికే అభిమానులు బారులు తీరి, నిలుచున్నారని పేర్కొన్నాడు. ఈసిరీస్ లో భాగంగా రెండో మ్యాచ్ ఈనెల 25న చెన్నైలో జరుగుతుంది. ఫిబ్రవరి 2న ముంబైలో జరిగే ఐదో మ్యాచ్ తో సిరీస్ పూర్తవుతుంది. ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది. దీనికి కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. ఫిబ్రవరి 6, 9, 12వ తేదీల్లో ఈ మ్యాచ్ లు జరుగుతాయి. వచ్చేనెల 19 నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా ఈ సిరీస్ ఉపయోగపడనుంది.
సత్కరించనున్న క్యాబ్..
దేశవాళీల్లో అద్భుత ప్రదర్శన చేసిన అండర్-15 జట్టుతో, సీనియర్స్ జట్టును కూడా క్యాబ్ సత్కరించనున్నట్లు చైర్మన్ స్నేహశీష్ గంగూలీ తెలిపాడు. ఈ కార్యక్రమానికి లెజెండ్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, దిగ్గజ లేడీ పేసర్ జులన్ గోస్వామి హాజరుకానున్నారు. అలాగే టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా హాజరవుతాడని క్యాబ్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. 2024లో చివరిసారిగా సౌతఫ్రికాతో భారత్ తలపడింది. నవంబర్ లో ముగిసిన ఈ సిరీస్ లో 3-1తో నాలుగు మ్యాచ్ ల సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. ప్రపంచ రికార్డు స్కోర్లు ఈ సిరీస్ లో భారత్ నమోదు చేసింది. అలాగే సంజూ శాంసన్, తిలక్ వర్మ సెంచరీల మీద సెంచరీలు బాదారు. మళ్లీ అలాంటి ప్రదర్శననే భారత్ ఆశిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

