Uncle Percy Death: అంకుల్ పెర్సీ ఇక లేరు, లంక ఆటగాళ్ల భావోద్వేగం
Uncle Percy Death: శ్రీలంక క్రికెట్ జట్టు వీరాభిమాని పెర్సీ అబేశేఖర ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొలంబోలోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు.
శ్రీలంక క్రికెట్ జట్టు వీరాభిమాని పెర్సీ అబేశేఖర ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొలంబోలోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. అబేశేఖరను క్రికెట్ అభిమానులు ముద్దుగా అంకుల్ పెర్సీ అని పిలుచుకునేవారు. శ్రీలంక మ్యాచ్ ఎక్కడ జరిగితే అక్కడ అంకుల్ పెర్సీ వాలిపోయేవాడు. గత ఏడాదిగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 87 ఏళ్ల అంకుల్ పెర్సీ తుదిశ్వాస విడిచినట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు వెల్లడించింది. శ్రీలంక క్రికెట్ బోర్డు ఆయనకు నివాళులు అర్పిస్తూ ట్విట్టర్లో ఫొటో పోస్టు చేసింది. ఆయన వైద్యంకోసం క్రికెట్ శ్రీలంక రూ.50 లక్షలు ఆర్ధికసాయం కూడా చేసింది.
టీమిండియాతోనూ అనుబంధం
పెర్సీ అంకుల్’ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు వీరాభిమాని. ఈ క్రమంలో ఈ ఏడాది ఆసియాకప్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అంకుల్ పెర్సీని తన నివాసంలో కలిశారు. అంకుల్ పెర్సీతో కలిసి దిగిన ఫోటోను రోహిత్ శర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. 2015లో శ్రీలంక పర్యటన సందర్భంగా విరాట్ కోహ్లీ.. భారత డ్రెస్సింగ్ రూమ్‌లో పెర్సీతో ముచ్చటించారు. వారిద్దరూ కలిసి సరదాగా డ్యాన్స్ చేశారు.
43 ఏళ్లపాటూ జట్టుతోనే..
1936లో జన్మించిన పెర్సీ.. 1979 వన్డే ప్రపంచకప్ నుంచి శ్రీలంక జట్టును ఉత్సాహపరిచేందుకు స్టేడియానికి వచ్చేవారు. గత 40 ఏళ్లుగా శ్రీలంక క్రికెట్ జట్టు ఆడే ప్రతి మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వెళ్లి ఉత్సాహపరిచేవారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని స్టేడియాల్లో అంకుల్ పెర్సీ శ్రీలంక జాతీయజెండాను రెపరెపలాడించేవారు. 1979 నుంచి గతేడాది వరకు పెర్సీ 43 ఏళ్లపాటు పెర్సీ మ్యాచులను వీక్షించేందుకు స్టేడియానికి వచ్చారు. గతేడాది వరకు జట్టుతో కలిసి ప్రయాణం చేసిన అంకుల్ పెర్సీ గత ఏడాది నుంచి అనారోగ్య సమస్యలతో ఇంటికే పరిమితమయ్యారు. శ్రీలంక మాజీ క్రికెటర్లు అర్జున రణతుంగ, సనత్ జయసూర్య, కుమార సంగక్కర వంటి వారితో పెర్సీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పలువురు భారత ఆటగాళ్లతోనూ పెర్సీకి సత్సంబంధాలు ఉన్నాయి. మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ గతంలో పెర్సీని కలిసి ముచ్చటించారు.
లంక ఆటగాళ్ల నివాళులు
పెర్సీ అంకుల్ మృతిపట్ల శ్రీలంక క్రికెట్ దిగ్గజాలు సనత్ జయసూర్య, రస్సెల్ ఆర్నాల్డ్, భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు. పెర్సీ మరణం పట్ల శ్రీలంక మాజీ క్రికెటర్లు సనత్ జయసూర్య, కుమార సంగక్కర, మహేల జయవర్దనే సంతాపం తెలిపారు. శ్రీలంక క్రికెటర్లకు అంకుల్ పెర్సీ 12వ ఆటగాడన్న జయవర్ధనే.. తన కెరీర్ ఆసాంతం ఆయన ఉత్సాహపరిచాడన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ఆయన తమను నవ్వించే వాడన్నారు. పెర్సీ అంకుల్ మరణం పట్ల భావోద్వేగానికి గురైన సంగక్కర.. తాను క్రికెట్లోకి అడుగుపెట్టిన దగ్గర్నుంచి రిటైరయ్యే వరకూ పెర్సీ అంకుల్ సపోర్ట్ మాత్రం నిలకడగా కొనసాగిందన్నారు. జెర్సీ ధరించిన ఆటగాళ్ల కంటే ఆయన ఏ విధంగానూ తక్కువ కాదన్నారు. అంకుల్ పెర్సీ మరణం తమను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని పలువురు క్రికెటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.