BCCI President: బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్, ఆయనకు ప్యాకేజీ ఎంత? ఏమేం సౌకర్యాలు లభిస్తాయి
𝗠𝗶𝘁𝗵𝘂𝗻 𝗠𝗮𝗻𝗵𝗮𝘀 𝗕𝗲𝗰𝗼𝗺𝗲𝘀 𝗕𝗖𝗖𝗜 𝗣𝗿𝗲𝘀𝗶𝗱𝗲𝗻𝘁 | బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ ఎన్నికయ్యారు. ముంబైలో జరిగిన బీసీసీఐ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

BCCI Presisent Salary: ఆదివారం (సెప్టెంబర్ 28న) ముంబైలో జరిగిన BCCI (భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్) వార్షిక సాధారణ సమావేశం (AGM)లో కొత్త BCCI అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్‌ను ఎన్నుకున్నారు. మిథున్ మన్హాస్‌కు ముందు, ఈ పదవిని ప్రపంచ కప్ మాజీ విజేత రోజర్ బిన్నీ నిర్వహించారు. అయితే వయసు పరిమితి కారణంగా ఆయన ఈ పదవిని వదులుకున్నారు. తర్వాత కొన్ని నెలల పాటు ఐపీఎల్ ఛైర్మన్ గా వ్యవహరించిన రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.
ప్రపంచ క్రికెట్‌లో BCCI హోదా చాలా పెద్దది. ఇంత పెద్ద బోర్డుకు అధ్యక్షుడు కావడం చాలా గొప్ప విషయం. మిథున్ మన్హాస్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్న తర్వాత, BCCI అధ్యక్షుడికి ఎంత జీతం వస్తుంది, ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి అనే ప్రశ్న క్రికెట్ ప్రేమికులకు వస్తుంది. పూర్తి సమాచారం మీకు అందిస్తున్నాం.

ముంబైలో జరిగిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 94వ వార్షిక సర్వసభ్య సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇలా ఉన్నాయి. BCCI కొత్త ఆఫీస్ బేరర్లుగా కింది సభ్యులను ఎన్నుకున్నారు:
(ఎ) బీసీసీఐ అధ్యక్షుడు: మిథున్ మన్హాస్
(బి) బీసీసీఐ ఉపాధ్యక్షుడు: రాజీవ్ శుక్లా
(సి) బీసీసీఐ కార్యదర్శి: దేవజిత్ సైకియా
(డి) బీసీసీఐ జాయింట్ సెక్రటరీ: ప్రభతేజ్ భాటియా
(ఇ) బీసీసీఐ కోశాధికారి: ఎ. రఘురామ్ భట్
BCCI అపెక్స్ కౌన్సిల్‌లో జనరల్ బాడీకి ఒక ప్రతినిధి ఎన్నిక
(ఎ) జయదేవ్ షా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్‌లో ఇద్దరు ప్రతినిధులు ఎన్నికయ్యారు
(ఎ) అరుణ్ సింగ్ ధుమాల్
(బి) ఎం ఖైరుల్ జమాల్ మజుందార్.
ఎలాంటి జీతం ఉండదు
BCCI అధ్యక్షుడికి నెలవారీగా ఇతర ఉద్యోగుల తరహాలో జీతం ఉండదని చెబితే, మీరు ఆశ్చర్యపోవచ్చు, కానీ ఇది నిజం. BCCI అధ్యక్షుడి పదవి ఆఫీస్ బేరర్ల కేటగిరీలోకి వస్తుంది. అంటే, ఈ పదవికి ఎలాంటి స్థిరమైన జీతం ఉండదు. బదులుగా, వివిధ అలవెన్సులు, సౌకర్యాలు అందుకుంటారు.
ఈ అలవెన్సులు, సౌకర్యాలు లభిస్తాయి
BCCI అధ్యక్షుడికి స్థిరమైన జీతం రాకపోయినా ఆ పదవిలో ఉన్న వారికి పలు సౌకర్యాలు, అలవెన్సులు లభిస్తాయి. బహుశా ఏ పెద్ద అధికారికి కూడా లభించకపోవచ్చు. BCCI అధ్యక్షుడికి అలవెన్సులు విషయానికి వస్తే.. విదేశీ పర్యటనలలో రోజుకు వెయ్యి డాలర్ల అలవెన్స్ లభిస్తుంది. అంటే దాదాపు 84 వేల భారత రూపాయలు. అదే సమయంలో BCCI అధ్యక్షుడు భారతదేశంలో సమావేశాలు నిర్వహించినా లేదా ఏదైనా పని కోసం వెళ్లినా వారికి 30 నుండి 40 వేల రూపాయల వరకు అలవెన్స్ ఇస్తారు. భారతదేశంలో, విదేశాలలో ఎక్కడైనా ప్రయాణించడానికి వారికి బిజినెస్ క్లాస్ లేదా ఫస్ట్ క్లాస్ ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. దీనితో పాటు, ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉండే సౌకర్యం లభిస్తుంది. దీనితో పాటు, ఏదైనా అధికారిక పని ఉంటే, దాని కోసం వారికి ప్రత్యేకంగా బీసీసీఐ అలవెన్స్ అందిస్తుంది.
BCCI నికర విలువ ఇంత
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు BCCI. బోర్డు మొత్తం నికర విలువ విషయానికి వస్తే 2.5 బిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు 18760 కోట్లుగా అంచనా. అయితే, కొన్ని వర్గాల ప్రకారం, ఇది 20000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఉంటుంది. IPL, అంతర్జాతీయ, దేశీయ మీడియా హక్కులు, స్పాన్సర్‌షిప్, ICC ఆదాయం ద్వారా BCCI సంపాదిస్తుంది.





















