Ind vs Eng: బాజ్ బాల్: టెస్ట్ క్రికెట్లో ఇంగ్లండ్ విప్లవం.. దూకుడు ఆటతో సరికొత్త చరిత్ర!
బాజ్ బాల్అనే పేరు ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ జట్టు కోచ్ బ్రెండన్ మెకల్లమ్ వల్ల వచ్చింది. మెకల్లమ్ ముద్దుపేరు "బాజ్" నుండి ఈ పదం వచ్చింది. మెకల్లమ్ కోచ్‌గా ఇంగ్లండ్ దూకుడైన ఆట శైలిని తీసుకువచ్చారు.

టెస్ట్ క్రికెట్ అంటే చాలా బోరింగ్‌గా ఉంటుందని ఈ తరం క్రికెట్ ప్రియులు భావిస్తుంటారు. అయితే, అసలు సిసలు మజా ఉండేది టెస్ట్‌లోనే అని పాతతరం క్రికెట్ అభిమానులు అంటుంటారు. ఇటీవలి కాలంలో టెస్ట్ క్రికెట్ లో కూడా చాలా మెరుపులు చూస్తున్నాం. భారత క్రికెట్ విషయానికి వస్తే, కింగ్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్, బూమ్ బూమ్ బుమ్రా బౌలింగ్ ఎంత చూసినా బోర్ కొట్టేవి కావు. అదే రీతిలో ప్రపంచ క్రికెట్‌లో ఇంగ్లండ్ టీమ్ అనుసరిస్తున్న బాజ్ బాల్ క్రికెట్ గేమ్ ప్లాన్ కూడా క్రికెట్ ప్రేమికులను కట్టిపడేస్తోంది. అసలు ఈ బాజ్ బాల్ గేమ్ అంటే ఏంటి, ఎందుకు ఆ పేరు వచ్చిందో తెలుసుకుందాం.
బాజ్ బాల్ క్రికెట్ అనే పేరుకు అర్థం తెలుసా?
బాజ్ బాల్ (Bazball) అనే పేరు ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ జట్టు కోచ్ బ్రెండన్ మెకల్లమ్ వల్ల వచ్చింది. మెకల్లమ్ ముద్దుపేరు "బాజ్" నుండి ఈ పదం వచ్చింది. మెకల్లమ్ కోచ్‌గా ఇంగ్లండ్ టెస్ట్ టీమ్‌లోకి దూకుడైన, నిర్భయమైన ఆట శైలిని తీసుకువచ్చారు. సంప్రదాయ క్రికెట్ ఆట తీరు కాకుండా, దూకుడుగా పరుగులు సాధించడాన్ని ఒక గేమ్ ప్లాన్‌గా ఇంగ్లండ్ టీమ్‌కు అలవాటు చేశాడు. డ్రా కోసం కాకుండా, గెలుపే లక్ష్యంగా ఆడేలా ఇంగ్లీష్ టీమ్ ఆటగాళ్లను సానబెట్టారు. ఈ కారణంగా ఇంగ్లండ్ టీమ్ ఆట తీరును బాజ్ బాల్ క్రికెట్‌గా పిలవడం ఆరంభమైంది.
బాజ్ బాల్ గేమ్ ప్లాన్ ఎలా ఉంటుందంటే..?
బాజ్ బాల్ గేమ్ ప్లాన్‌లో నాలుగు అంశాలు కీలకంగా చెప్పవచ్చు:
-
ఆత్మవిశ్వాసంగా ఆడే పద్ధతి: ఆటగాళ్లు తమ సహజసిద్ధమైన ఆట తీరును స్వేచ్ఛగా ఆడేలా ప్రోత్సహించడం బాజ్ బాల్ గేమ్‌లో ముఖ్యమైన అంశం. ఒకవేళ వారు తమ సహజ సిద్ధమైన ఆట తీరుతో కొన్నిసార్లు వైఫల్యం చెందినా, అంతటితో ఆగిపోకుండా, భయపడకుండా ఆడేలా వారిని తీర్చిదిద్దడమే ఈ గేమ్ ప్లాన్.
-
టెస్ట్ మ్యాచ్‌లు గెలవడమే లక్ష్యం: సాధారణంగా గతంలో టెస్ట్ మ్యాచ్‌లు ఎక్కువగా డ్రా దిశగా నడిచేవి, అందుకే ప్రేక్షకుల్లో బోరింగ్ ఉండేది. బ్రెండన్ మెకల్లమ్ ఆ పద్ధతిని పక్కన పెట్టి, ప్రతీ టెస్ట్ మ్యాచ్ గెలవడమే లక్ష్యంగా ఆటగాళ్లకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇది కూడా బాజ్ బాల్ గేమ్ ప్లాన్‌గా క్రీడా విశ్లేషకులు చెబుతారు.
-
ఫోర్లు, సిక్సర్లతో వేగంగా స్కోరింగ్: టెస్ట్ మ్యాచ్ అంటే డిఫెన్స్ ఆటకు ప్రాధాన్యత ఎక్కువ. డిఫెన్స్ టెక్నిక్‌లో బాగా నిష్ణాతులయిన బ్యాట్స్‌మెన్‌లకు ఎక్కువ అవకాశాలు టెస్ట్ మ్యాచ్‌లలో ఇస్తారు. కానీ, మెకల్లమ్ స్టైల్ వేరు. తక్కువ బంతుల్లో ఎక్కువ స్కోర్లు చేయడం బాజ్ బాల్ గేమ్ ప్లాన్‌లో ప్రధానమైన అంశం. టీ20 గేమ్ లాగానే టెస్ట్‌లో వేగంగా పరుగులు చేయడం బాజ్ బాల్ ప్రత్యేకత. నిర్భయంగా, దూకుడుగా, బౌలర్ ఎవరన్నది చూడకుండా ఎదురుదాడికి దిగడమే ఈ గేమ్‌లో ప్రాధాన్యత అంశం.
-
డేరింగ్ డెసిషన్స్ (ధైర్యమైన నిర్ణయాలు): కేవలం బ్యాటింగ్‌లో కాకుండా, ఫీల్డ్‌లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం బాజ్ బాల్ గేమ్ ప్లాన్‌లో భాగమే. దూకుడుగా బౌలింగ్ చేయించడం, బ్యాట్స్‌మెన్‌లను డిఫెన్స్‌లోకి నెట్టేలా ఎటాకింగ్ ఫీల్డింగ్ సెట్ చేయడం కూడా బాజ్ బాల్ క్రికెట్‌లో భాగం.
ఇలా టెస్ట్ క్రికెట్‌లో బాజ్ బాల్ ఒక ట్రెండ్‌గా మారింది. దీన్నే మీడియా బాజ్ బాల్ క్రికెట్ అని పిలవడం ప్రారంభమైంది. తద్వారా ప్రపంచ క్రికెట్‌లో ఇంగ్లండ్ బ్రాండ్ క్రికెట్ అయింది. క్రికెట్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన ఇంగ్లండ్ జట్టే ఇప్పుడు బాజ్ బాల్ టెస్ట్ క్రికెట్‌ను పరిచయం చేసిందని చెప్పాలి.
బాజ్ బాల్ కు ముందు, ఆ తర్వాత ఇంగ్లండ్ ఆట తీరు ఎలా ఉందంటే..
బాజ్ బాల్ క్రికెట్ ఆట తీరుకు ఆద్యుడు బ్రెండన్ మెకల్లమ్. 2022 మే నెలలో ఇంగ్లండ్ జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఇంగ్లండ్ పేలవమైన రికార్డును మూటగట్టుకొని ఉంది. మెకల్లమ్ కోచ్ బాధ్యతలు తీసుకోక ముందు ఇంగ్లండ్ టీమ్ 17 టెస్ట్ మ్యాచ్‌లు ఆడితే, గెలిచింది కేవలం ఒక్క టెస్ట్ మాత్రమే. పదకొండు టెస్ట్ మ్యాచ్‌లు ఓడిపోయింది, ఐదు టెస్ట్ మ్యాచ్‌లు డ్రా చేసుకుంది. ఇది ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో ఒక చెత్త రికార్డుగా క్రీడా విశ్లేషకులు చెబుతారు. ఓ రకంగా చెప్పాలంటే, ఇంగ్లండ్ టీమ్ నిరాశజనకంగా, ఆత్మవిశ్వాసం లేకుండా సంక్షోభంలో పయనిస్తోంది. ఆటగాళ్లు తమ సామర్థ్యం మీద నమ్మకం కోల్పోయిన పరిస్థితి ఇంగ్లండ్ టీమ్‌లో నెలకొంది. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మకంగా ఆడే యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ 0-4 తేడాతో చిత్తుగా ఓడిపోయింది. బలహీన జట్టుగా ఉన్న వెస్టిండీస్ టీమ్‌తోనూ సిరీస్ కోల్పోయింది. ఇది ఇంగ్లండ్ క్రికెట్‌కు అత్యంత దారుణమైన దశగా చెప్పవచ్చు.
మెకల్లమ్ రాకతో రూపు మారిన ఇంగ్లండ్ టీమ్
2022 మే నెలలో మెకల్లమ్ ఇంగ్లండ్ జట్టు కోచ్‌గా రావడం, కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ బాధ్యతలు చేపట్టడం రెండూ ఇంగ్లీష్ టీమ్ రూపురేఖలను మార్చేశాయి. బాజ్ బాల్ క్రికెట్‌తో ఇంగ్లండ్ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా తన ఆట తీరును మార్చుకుంది. 2025 జూన్ నాటికి ఇంగ్లండ్ సాధించిన విజయాలు చూస్తే, ఆ జట్టు ఎంతగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు:
-
గెలిచిన సిరీస్‌లు:
- 2022లో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లండ్ 3-0తో గెలుచుకుంది.
- అదే ఏడాది స్వదేశంలో జరిగిన దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను 2-1తో ఇంగ్లండ్ ఓడించింది.
- 2022లో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లండ్, పాకిస్తాన్ టీమ్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసి ఘన విజయం సాధించింది. పాకిస్తాన్‌లో పాకిస్తాన్‌పై క్లీన్‌స్వీప్ విజయం సాధించడం అరుదైన విషయంగా చెప్పుకోవాలి.
- ఆ తర్వాత ఐర్లాండ్‌తో 2023లో స్వదేశంలో ఆడిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌ను ఇంగ్లండ్ గెలుచుకుంది.
- 2024లో శ్రీలంకను తమ దేశంలోనే 2-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది.
- 2024లో వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌ను 3-0 తేడాతో గెలుచుకుంది.
-
డ్రా చేసుకున్న సిరీస్‌లు:
- 2022లో స్వదేశంలో భారత్‌తో జరిగిన వాయిదాపడిన టెస్ట్ మ్యాచ్‌ను గెలిచి, గత సిరీస్‌ను 2-2 తేడాతో డ్రా చేసుకుంది.
- ఆస్ట్రేలియాతో 2023లో జరిగిన యాషెస్ సిరీస్‌ను 2-2 తేడాతో డ్రా చేసుకుంది. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ ఆడిన దూకుడైన ఆట అందరినీ ఆకట్టుకుంది.
-
ఓడిపోయిన సిరీస్‌లు:
- అయితే, ఇదే బాజ్ బాల్ క్రికెట్‌కు గెలుపుకు బ్రేక్ వేసింది మాత్రం ఇండియానే. 2024లో భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్‌ను 1-3 తేడాతో ఇండియా సిరీస్‌ను గెలుచుకుంది. బాజ్ బాల్ శైలితో గెలుపు బాట పట్టిన ఇంగ్లండ్ టీమ్‌కు ఇదే తొలి సిరీస్ ఓటమిగా చెప్పవచ్చు.
త్రీ బీ ఫ్యాక్టర్‌తో ఇంగ్లండ్‌లో జోష్
"త్రీ బీ" అంటే బాజ్ బాల్, బ్రెండన్ మెకల్లమ్, బెన్ స్టోక్స్. బాజ్ బాల్ గేమ్ ప్లాన్, కోచ్‌గా బ్రెండన్ మెకల్లమ్, కెప్టెన్‌గా బెన్ స్టోక్స్.. ఈ ముగ్గురూ ఇంగ్లండ్ క్రికెట్‌పై తమ ముద్ర వేశారు. ఆటగాళ్ల తీరులో మార్పు తేగలిగారు. నిర్భయంగా గెలుపు కోసమే టెస్ట్ క్రికెట్ ఆడటంలో తీర్చిదిద్దారు. టెస్ట్ క్రికెట్‌లో దూకుడైన తీరును ప్రవేశపెట్టారు.





















