Babar Azam: షాహీన్ అఫ్రిదికి షాక్ - బాబర్‌కే కెప్టెన్సీ బాధ్యతలు
PCB: టీ20 ప్రపంచకప్ 2024కు ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. టీ20 ఫార్మాట్‌తో పాటు వన్డే ఫార్మాట్ లకు కెప్టెన్‌గా బాబర్ అజామ్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించింది.

PCB reappoint Babar Azam as captain: టీ20 ప్రపంచ కప్(T20 World Cup)సమీపిస్తున్న తరుణంలో మరోసారి పాక్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు బాబర్ అజామ్(Babar Azam)ను తిరిగి నియమించినట్లు ప్రకటించింది. బాబర్ అజామ్ ను వన్డే, టీ20 కెప్టెన్ గా నియమిస్తున్నట్టు సోషల్ మీడియాలో పీసీబీ(PCB) ఓ ప్రకటన చేసింది. జాతీయ సెలెక్షన్ కమిటీ ఏకగ్రీవ సిఫారసు మేరకు బాబర్ అజామ్ ను కెప్టెన్ గా నియమించాలని పీసీబీ చైర్మన్ మొహిసిన్ నఖ్వీ నిర్ణయం తీసుకున్నారని ఆ పోస్టులో వెల్లడించింది.
ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ బాబర్ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీని వదులుకున్న విషయం తెలిసిందే. అయితే మెగాటోర్నీల్లో ఓటమిపాలైన తర్వాత తమ జట్టు కెప్టెన్లను మార్చడం పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు కొత్తేమి కాదు. దీంతో బాబర్ అజామ్ కెప్టెన్సీపై వేటు సాధారణమే అన్నట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో షాహీన్ షా ఆఫ్రిది పాకిస్తాన్ క్రికెట్ జట్టు బాధ్యతలు తీసుకున్నాడు. అయితే ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌కు ముందు షహీన్ స్థానంలో మొహమ్మద్ రిజ్వాన్ , బాబర్ ఆజంలు రేసులో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే, ఇటీవలి పరిణామాలు బాబర్‌ను మరోసారి కెప్టెన్సీకి ప్రాథమిక అభ్యర్థిగా నిలిపాయి. అయితే గతంలో జరిగిన సంఘటనలతో బాబర్ అజామ్ ఈ పదవి పట్ల సుముఖంగా లేరని.. మరోసారి బాధ్యతలు స్వీకరించేందుకు సంకోచిస్తున్నారని పాకిస్తాన్ మీడియా వర్గాలు కధనాలు వెల్లడించాయి.
2023 ప్రపంచ కప్ తర్వాత బాబర్ అజామ్ తన వైట్-బాల్ కెప్టెన్సీ నుండిబయటపడ్డాడు. దీంతో షాహీన్ ఆఫ్రిది T20I నాయకత్వాన్ని తీసుకున్నాడు. తరువాత బాబర్ కూడా రెడ్-బాల్ కెప్టెన్సీ నుండి వైదొలిగాడు, దీంతో షాన్ మసూద్‌ను టెస్ట్ కెప్టెన్‌గా నియమించబడ్డాడు. ఇన్ని మార్పులు జరిగినా పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రదర్శన ఏమాత్రం మెరుగుపడలేదు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో మూడు టెస్టుల్లోనూ ఓడిపోయింది, అలాగే న్యూజిలాండ్‌లో జరిగిన T20I సిరీస్‌లో 1-4 తేడాతో ఓటమిపాలయ్యింది.
సంక్షోభంలో పాకిస్తాన్ క్రికెట్
మరికొన్ని నెలల్లో టీ20 ప్రపంచకప్(T20 World Cup) ఆరంభం కానున్న వేళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడుగురు సభ్యులతో కూడిన సెలెక్షన్ కమిటీని రద్దు చేసింది. ప్రస్తుతం కొనసాగతున్న సెలెక్షన్ కమిటీని రద్దు చేస్తున్నామని.... కొత్త కమిటీని త్వరలోనే ప్రకటిస్తామని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ వెల్లడించారు. మాజీ చీఫ్ సెలెక్టర్ వాహబ్ రియాజ్‌తో సమావేశమైన తర్వాత నఖ్వీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈమధ్యే పీసీబీ ఏడుగురు సభ్యుల సెలెక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. అందులో మాజీ ఆటగాళ్లు అబ్దుల్ రజాక్, అసద్ షఫీక్, మహమ్మద్ యూసుఫ్, వాహబ్ రియాజ్, కెప్టెన్, హెడ్‌కోచ్, డేటా అనలిస్ట్‌లకు చోటు దక్కింది. అయితే.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌లో పాక్ జట్టు చెత్త ఆటతో నిరాశపరిచింది. దాంతో, సెలక్షన్ కమిటీపై పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ వేటు వేశారు. మరోవైపు ఆటగాళ్లు ఫిట్నెస్ విషయంలో అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దగా దృష్టి పెట్టడం లేదని.. అందుకే జట్టులో ఉన్న ఆటగాళ్లు ఎవరు కూడా పెద్దగారాణించడం లేదు అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి అని చెప్పాలి. ఇలాంటి విమర్శలు వేళ ఇక ఆటగాళ్ల ఫిట్నెస్ను మరింత మెరుగుపరిచే విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

