Mitchell Starc Retirement: టీ20లకు మిచెల్ స్టార్క్ రిటైర్మెంట్- టెస్టులు, వన్డే వరల్డ్ కప్ మీద ఫోకస్
Starc retirement from T20 format | ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ టి20ల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. 65 మ్యాచ్‌లలో స్టార్క్ 79 వికెట్లు తీశాడు.

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌కు మిచెల్ స్టార్క్ రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ టెస్ట్ టూర్, యాషెస్ సిరీస్, 2027 ODI ప్రపంచ కప్ లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు 35 ఏళ్ల స్టార్క్ తెలిపాడు. అతను జూన్, 2024 లో భారత్ తో చివరి టీ20 మ్యాచ్ ఆడాడు.
స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ మాట్లాడుతూ.. "ఎల్లప్పుడూ టెస్ట్ క్రికెట్ నా మొదటి ప్రాధాన్యత. నేను ఆస్ట్రేలియా తరపున ఆడిన ప్రతి టీ20 మ్యాచ్ లో ప్రతి నిమిషాన్ని ఆనందించాను. 2021 ప్రపంచ కప్ లో ఆసీస్ టైటిల్ గెలిచింది. మా జట్టు అద్భుతంగా ఉంది. ఆ సమయాన్ని మేం ఆస్వాదించాం. చాలా సరదాగా గడిపాం" అని తెలిపాడు.
మిచెల్ స్టార్క్ T20I నుంచి రిటైర్మెంట్‌కు కారణం
ఆస్ట్రేలియా వచ్చే ఏడాది టెస్ట్ క్రికెట్ లో బిజీ షెడ్యూల్ ను కలిగి ఉంది. ఇందులో బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్, దక్షిణాఫ్రికా టూర్, న్యూజిలాండ్ తో 4 మ్యాచ్ ల సిరీస్ ఉన్నాయి. ఆస్ట్రేలియా జనవరి 2027 లో భారత్ లో 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది, ఇది ICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పరంగా చాలా కీలకం. తరువాత, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వేలలో ODI ప్రపంచ కప్ 2027 నిర్వహిస్తున్నారు. ఇందులో ఆస్ట్రేలియా జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతుంది. టెస్ట్, వన్డేలకు అధిక ప్రాధాన్యతనిస్తూ స్టార్క్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
మిచెల్ స్టార్క్ మాట్లాడుతూ.. "భారత క్రికెట్ జట్టుతో టెస్ట్ సిరీస్, యాషెస్, తరువాత 2027 ODI ప్రపంచ కప్. ఈ టోర్నమెంట్లలో నన్ను నేను ఫిట్ గా ఉంచుకోవడానికి, అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ఇది సరైన నిర్ణయం అని నేను భావిస్తున్నాను. 2026 లో జరిగే టీ20 ప్రపంచ కప్ కోసం కొత్త బౌలింగ్ విభాగం సిద్ధం కావడానికి తగినంత సమయం ఇస్తుందని’ పేర్కొన్నాడు.
🚨 MITCHELL STARC EYES 2027 ODI WC AS HE RETIRES FROM T20I 🚨
— Johns. (@CricCrazyJohns) September 2, 2025
"Test is & has always been my highest priority - Looking ahead to an away Indian Test tour, the Ashes & an ODI WC in 2027, I feel this is my best way forward to remain fresh, fit & at my best for those campaigns". pic.twitter.com/b25SFjZ0lv
ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ జార్జ్ బెయిలీ మాట్లాడుతూ: " ఆస్ట్రేలియా కోసం స్టార్క్ టీ20 కెరీర్ గురించి చాలా గర్వపడాలి. అతను 2021 ప్రపంచ కప్ విజేత జట్టులో కీలక సభ్యుడు. అతను ఎక్కువ కాలం టెస్ట్, వన్డే క్రికెట్ ఆడాలని భావించి ఈ నిర్ణయం తీసుకోవడం మంచి విషయం" అన్నారు.
మిచెల్ స్టార్క్ టీ20 ఇంటర్నేషనల్ కెరీర్
సెప్టెంబర్, 2012 లో పాకిస్తాన్‌తో మ్యాచ్ ద్వారా మిచెల్ స్టార్క్ తన టీ20 ఇంటర్నేషనల్ అరంగేట్రం చేశాడు. అతను చివరి టీ20 భారత్ తో జూన్ 24, 2024న ఆడాడు. 12 సంవత్సరాల టీ20 కెరీర్లో మిచెల్ స్టార్క్ 65 టీ20 మ్యాచ్లు ఆడాడు. స్టార్క్ ఖాతాలో 79 టీ20 వికెట్లు ఉన్నాయి. ఈ ఫార్మాట్లో అతను 5 వికెట్ల హాల్ సాధించలేదు. కానీ కీలక సందర్భాలలో ఆసీస్ కు తన బౌలింగ్‌తో విజయాలు అందించిన బౌలర్లలో స్టార్క్ ఒకడు.





















