Yashasvi Jaiswal: బాబోయ్ ఏంటీ విధ్వంసం! యంగెస్ట్ టీ20 సెంచూరియన్‌గా గిల్ రికార్డు బద్దలు కొట్టిన జైశ్వాల్
Yashasvi Jaiswal: టీమ్‌ఇండియా యువకెరటం యశస్వీ జైశ్వాల్ రెచ్చిపోయాడు. ఆడిన ప్రతి మ్యాచులో తనదైన ముద్ర వేస్తున్నాడు.
Yashasvi Jaiswal:
టీమ్‌ఇండియా యువకెరటం యశస్వీ జైశ్వాల్ రెచ్చిపోయాడు. ఆడిన ప్రతి మ్యాచులో తనదైన ముద్ర వేస్తున్నాడు. భారత జట్టులో శాశ్వత స్థానం సంపాదించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. వరుస పెట్టి రికార్డులు సృష్టిస్తున్నాడు. ప్రత్యర్థులకు సింహస్వప్నంగా మారుతున్నాడు. సహచరుల రికార్డులను బద్దలు కొడుతున్నాడు. తాజాగా మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ శతక రికార్డును అతడు తిరగరాశాడు.
ప్రస్తుతం సీనియర్ జట్టు ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం సిద్ధమవుతోంది. ఇదే సమయంలో చైనాలో ఆసియా క్రీడలు జరుగుతున్నాయి. ఇందులోనూ టీ20 క్రికెట్‌ను ప్రవేశపెట్టారు. దాంతో యువకులతో కూడిన బృందాన్ని బీసీసీఐ పంపించింది. జాతీయ క్రికెట్ అకాడమీ అధినేత వీవీఎస్ లక్ష్మణ్‌కు కోచింగ్ బాధ్యతలు అప్పగించింది. టీమ్‌ఇండియా తొలి మ్యాచులోనే అద్భుత విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో నేపాల్‌ను ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లింది.
క్వార్టర్ ఫైనల్ మ్యాచులో యశస్వీ జైశ్వాల్ తన సహచరుడైన శుభ్‌మన్ గిల్ రికార్డును బద్దలు కొట్టాడు. అతి తక్కువ వయసులో టీ20ల్లో సెంచరీ కొట్టిన ఆటగాడిగా చరిత్ర లిఖించాడు. గిల్ 23 ఏళ్ల 146 రోజుల్లో పొట్టి క్రికెట్లో శతకం చేస్తే జైశ్వాల్ కేవలం 19 ఏళ్ల 8 నెలల 13 రోజులకు సాధించాడు. కేవలం 48 బంతుల్లోనే శతకం అందుకున్నాడు.
అరంగేట్రం చేసినప్పటి నుంచీ యశస్వీ జైశ్వాల్ అమేజింగ్ ఇన్సింగ్స్‌లు ఆడాడు. టెస్టుల్లో 2 మ్యాచులాడి 88.66 సగటు, 54.17 స్ట్రైక్‌రేట్‌తో 266 పరుగులు చేశాడు. ఒక సెంచరీ అందుకున్నాడు. ఇక 6 టీ20లు ఆడి 46.40 సగటు, 165.71 స్ట్రైక్‌రేట్‌తో 232 పరుగులు చేశాడు. ఒక సెంచరీ ఒక హాఫ్ సెంచరీ బాదేశాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగులో రాజస్థాన్ రాయల్స్ తరఫున అతడెలాంటి పరుగుల వరద పారించాడో అందరికీ తెలిసిందే.
ఇక టీ20 క్రికెట్లో అత్యంత పిన్న వయసులో శతకం సాధించిన రికార్డు ఫ్రాన్స్‌కు చెందిన జీ మెకాన్ పేరుతో ఉంది. అతడు 18 ఏళ్ల 280 రోజులకే స్విట్జర్లాండ్‌పై 108 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇక నేపాల్‌కు చెందిన కుశాల్ మల్లా 19 ఏళ్ల 206 రోజులకే మంగోలియాపై సెంచరీ (137 నాటౌట్) బాదేశాడు. అఫ్గానిస్థాన్‌కు చెందిన హజ్రతుల్లా జజాయ్ హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఐర్లాండ్‌పై 20 ఏళ్ల 337 రోజులకే శకతం దంచాడు. 162 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఏషియా గేమ్స్ లో స్వర్ణ పతకమే లక్ష్యంగా భారత పురుషుల క్రికెట్ జట్టు తొలి అడుగు ఘనంగా వేసింది. నేపాల్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్ లో 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. సెమీఫైనల్ లోకి అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, 202 పరుగులు చేసింది. యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ రికార్డు సెంచరీ సాధించాడు. 49 బాల్స్ లోనే ఆ మార్క్ అందుకున్నాడు. టీమిండియా తరఫున సెంచరీ చేసిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించాడు. టాప్ ఆర్డర్ లో జైస్వాల్ తప్ప మిగతా ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. పవర్ ప్లే తర్వాత వికెట్ కాస్త స్లో అవటంతో షాట్లు ఆడటానికి బ్యాటర్లు ఇబ్బందిపడ్డారు.
కానీ చివర్లో యువ సంచలనం రింకూ సింగ్ తో పాటు శివం దూబే భారీ షాట్లు ఆడారు. రింకూ అయితే 15 బాల్స్ లోనే 37 స్కోర్ చేశాడు. చేజింగ్ కు దిగిన నేపాల్, నిర్ణీత 20 ఓవర్లలో 179 స్కోర్ చేసింది. ఇన్నింగ్స్ లో పలువురు బ్యాటర్లు ఆడిన షాట్లు ఆకట్టుకున్నాయి. కాస్త ప్లానింగ్ తో ఆడి ఉంటే టార్గెట్ కు మరింత దగ్గరగా వచ్చేవాళ్లే. భారత స్పిన్నర్లు రవి బిష్ణోయ్ మరియు సాయి కిషోర్ బౌలింగ్ లో నేపాల్ ఇబ్బందిపడింది కానీ పేసర్లను చాలా బాగా హ్యాండిల్ చేసింది. అవేష్ ఖాన్ మరియు రవి బిష్ణోయ్ మూడేసి వికెట్లు తీశారు. మరో క్వార్టర్ ఫైనల్ లో వచ్చే ఫలితం ఆధారంగా అక్టోబర్ 6వ తేదీన భారత్ ఆడబోయే సెమీఫైనల్ లో ప్రత్యర్థి ఎవరో తెలుస్తుంది.