Asian Games 2023: పిల్లలను తీసుకురావొద్దన్న నిర్వాహకులు - ఆసియా క్రీడల నుంచి తప్పుకున్న పాక్ మాజీ సారథి
పాకిస్తాన్ మహిళా క్రికెట్ టీమ్ మాజీ సారథి, ఆ జట్టులో కీలక ప్లేయర్‌గా ఉన్న బిస్మా మరూఫ్ త్వరలో జరిగే ఆసియా క్రీడల నుంచి తప్పుకుంది.
Asian Games 2023: పాకిస్తాన్ మాజీ సారథి, ప్రస్తుతం ఆ జట్టులో ఆల్ రౌండర్‌గా కొనసాగుతున్న బిస్మా మరూఫ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ - అక్టోబర్‌లో జరుగబోయే ఆసియా క్రీడలలో పాల్గొనబోనని స్పష్టం చేసింది. మరూఫ్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఆసియా క్రీడల నిర్వాహకుల నిర్ణయమే కారణంగా ఉంది.
హాంగ్జౌ వేదికగా జరుగబోయే ఈ గేమ్స్‌లో పాల్గొనబోయే క్రీడాకారులెవరూ గేమ్స్ విలేజ్‌లో తమ పిల్లలను తీసుకురావొద్దని నిర్వాహకులు నిబంధన విధించారు. బిస్మా మరూఫ్ ఓ బిడ్డకు తల్లి. 2021 ఆగస్టులో ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 2022లో మహిళల వన్డే ప్రపంచకప్ సందర్భంగా ఆమె తన గారాలపట్టిని తీసుకుని టోర్నీలో పాల్గొంది. భారత్ - పాక్ మ్యాచ్ సందర్భంగా భారత క్రికెటర్లు.. ఈ చిన్నారితో కలిసి ఆడుకున్న ఫోటోలు, వీడియోలు అప్పట్లో వైరల్‌గా మారాయి.
ఇక ఆసియా క్రీడల విషయానికొస్తే.. రెండేండ్ల తన కూతురిని పాకిస్తాన్‌లో వదిలేసి మ్యాచ్‌లు ఆడేందుకు చైనాకు తాను వెళ్లబోనని మరూఫ్ స్పష్టం చేసింది. ఈ క్రీడల నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపింది. మరూఫ్ లేకపోవడం పాకిస్తాన్‌కు భారీ లోటు. ఇటీవలే పాకిస్తాన్ యువ క్రికెటర్ అయేషా నసీమ్ వ్యక్తిగత కారణాల రీత్యా 18 ఏండ్లకే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించడం, తాజాగా మరూఫ్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఆ ప్రభావం పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్‌పై తీవ్రంగా పడనుంది.
ఇదిలాఉండగా.. ఆసియా క్రీడల్లో పాల్గొనబోయే క్రికెట్ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) రెండ్రోజుల క్రితమే ప్రకటించింది. నిదా దార్ నాయకత్వంలో పాకిస్తాన్ ఆసియా క్రీడల్లో బరిలోకి దిగనుంది. ఇక కొద్దికాలం క్రితం గాయం బారిన పడ్డ డయానా బేగ్ తిరిగి జట్టుతో చేరగా యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అనూష నసీర్, బ్యాటర్ షవాల్ జుల్ఫికర్‌లు చోటు దక్కించుకున్నారు. అనూష, జుల్ఫికర్‌లు ఈ ఏడాది జరిగిన ఐసీసీ అండర్ - 19 టీ20 వరల్డ్ కప్, ఎమర్జింగ్ ఉమెన్స్ టీమ్స్ ఆసియా కప్‌లో మెరుగైన ప్రదర్శనలు చేశారు.
హ్యాట్రిక్ కోసం పాక్ తపన..
ఆసియా క్రీడలలో భాగంగా 2010 (గాంగ్జో, చైనా), 2014 (ఇంచియాన్, దక్షిణ కొరియా) లలో నిర్వహించిన ఈవెంట్స్‌లో పాకిస్తాన్ రెండుసార్లూ స్వర్ణం గెలిచింది. ఆ తర్వాత 9 ఏండ్లకు మళ్లీ ఆసియా క్రీడల్లో క్రికెట్‌ను చేర్చారు. ఈసారి కూడా పాకిస్తాన్ స్వర్ణం గెలిస్తే అది హ్యాట్రిక్ గెలిచినట్టు అవుతోంది.
🚨 Here's our 15-player squad for the 19th #AsianGames Hangzhou 2022! 🚨
— Pakistan Cricket (@TheRealPCB) July 25, 2023
Read more: https://t.co/b7jrofscuJ#BackOurGirls pic.twitter.com/F7boao0ebK
ఆసియా క్రీడల కోసం పాకిస్తాన్ క్రికెట్ టీమ్ : నిదా దార్ (కెప్టెన్), అలియా రియాజ్, అనూష నాయర్, డయానా బేగ్, ఫాతిమా సనా, మునీబా అలీ, నజియా అల్వి, నష్రా సుంధు, నటాలియా పర్వేజ్, ఒమైమా సోహైల్, సదాఫ్ షమాస్, షవాల్ జుల్ఫికర్, సిద్ర అమిన్, సయిద అరూబ్ షా, ఉమ్-ఇ-హని
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial