Asia Cup 2023: లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ - ఆఖరి బంతికి తేలిన ఫలితం - దాయాదుల పోరూ ఇంత ఉత్కంఠగా జరగలే!
టీ20ల హోరులో పడి మనుగడ ప్రమాదంలో పడ్డ వన్డే క్రికెట్‌కు ప్రపంచకప్ తర్వాత నూకలు చెల్లుతాయని తీవ్ర చర్చ జరుగుతోంది. కానీ ఈ ఫార్మాట్‌లో ఉండే మజాను పాక్- లంక మ్యాచ్‌లు మరోసారి చూపించాయి.
Asia Cup 2023: శ్రీలంక-పాక్‌ల మధ్య ముగిసిన సూపర్ - 4 మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా సాగింది. హై ఓల్టేజ్ మ్యాచ్ అయిన భారత్ - పాక్ పోరులోనూ ఇంత ఉత్కంఠ, డ్రామా లేదు. భారత్ - పాక్ మధ్య ఆసియా కప్‌లో రెండు మ్యాచ్‌లు జరిగినా ఒక మ్యాచ్ వర్షార్పణం కాగా మరో పోరు పూర్తిగా ఏకపక్షం అయింది. కానీ పాక్ - లంక మధ్య ముగిసిన కీలక పోరు మాత్రం ఆ మజాను పంచింది. తొలుత బ్యాటింగ్ చేసి పాకిస్తాన్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్యాన్ని లంక చివరి ఓవర్ (42) ఆఖరి బంతికి ఛేదించింది. మెండిస్, సమరవిక్రమల పోరాటంతో పోటీలోకి వచ్చిన లంక.. ఆఖరి 2 ఓవర్లలో 12 పరుగులు చేస్తే విజయం దక్కించుకునే స్థితికి వచ్చింది. మ్యాచ్ అంతా ఒక ఎత్తు అయితే ఆ చివరి రెండు ఓవర్లు మరో ఎత్తుగా సాగింది లంకేయుల పోరాటం. టీ20ల హోరులో వన్డే క్రికెట్ మనుగడపై అనుమానాలు, ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఈ ఫార్మాట్‌లో ఉండే మజాను మరోసారి ఈ మ్యాచ్ రుచి చూపించింది.
షహీన్ ఆదుకున్నా..
40 ఓవర్ ప్రారంభానికి ముందు లంక స్కోరు 240-5గా ఉంది. కానీ 41వ ఓవర్ వేసిన షహీన్ షా అఫ్రిది లంకను దెబ్బకొట్టాడు. ఆ ఓవర్‌లో నాలుగు పరుగులే ఇచ్చిన షహీన్.. ధనంజయ డిసిల్వతో పాటు వెల్లలాగెను పెవిలియన్‌కు పంపాడు. ఇది పాకిస్తాన్‌కు కొంచెం ఎడ్జ్ ఇచ్చి లంకను ఒత్తిడిలోకి నెట్టింది. 41వ ఓవర్ ముగిసేసరికి లంక స్కోరు 244-7గా మారింది. క్రీజులో చరిత్ అసలంక ఒక్కడే బ్యాటర్.
ఆ ఆరు బంతులు..
ఇక చివరి ఓవర్‌లో లంక గెలవాలంటే 8 పరుగులు కావాలి. పాక్ తరఫున తొలి వన్డే ఆడుతున్న జమాన్ ఖాన్‌కు 8 పరుగులు డిఫెండ్ చేయమని బంతినిచ్చాడు బాబర్. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ జమాన్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి బంతికి ఎల్బీ ద్వారా ఒక్క పరుగే వచ్చింది. రెండో బాల్ డాట్. మూడో బంతికి ఒక్క పరుగే. లంక ఆటగాళ్లు, మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానుల్లో ఒక్కటే టెన్షన్. ఆ ఉత్కంఠను మరోసారి పీక్స్‌లోకి తీసుకెళ్తూ.. నాలుగో బంతికి ప్రమోద్ మధుశాన్ ఔట్ రనౌట్ అయ్యాడు. ఇక చివరి రెండు బంతుల్లో ఆరు పరుగులు చేయాలి. క్రీజులో అసలంక.. జమాన్ ఖాన్ వేసిన ఐదో బంతి అసలంక బ్యాట్ ఎడ్జ్‌కు తాకి షార్ట్ థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీకి పరుగులు పెట్టింది. పాక్ ఆటగాళ్లలో నైరాశ్యం. కానీ ఇంకా అయిపోలేదు. ఆఖరి బంతికి రెండు పరుగులు చేస్తే లంక విజయం. ఒక్క పరుగు చేస్తే డ్రా. బాబర్ ఫీల్డర్లను అసలంకకు దగ్గరగా మొహరించాడు. సింగిల్ అడ్డుకోవడానికి అన్ని ఏర్పాట్లూ చేశాడు. కొత్త కుర్రాడు జమాన్ కొద్దిగా భయంగానే బంతిని సంధించాడు. కానీ అనుభవజ్ఞుడై అసలంక.. ఆన్‌సైడ్‌లో ఖాళీని గుర్తించి బాల్‌ను అటుదిశగా మళ్లించాడు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే అసలంక - పతిరాన రెండు పరుగులు పూర్తి చేశారు. అంతే.. లంక 12వ సారి ఆసియా కప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. అంత ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించిన అసలంక గెలిచిన తర్వాత ఆకాశం వైపు చేతిని పంచ్ చేస్తూ సంబురాలు చేసుకున్నాడు. బాబర్ గ్యాంగ్ తల పట్టుకుని మరోసారి ఆసియా కప్ నుంచి రిక్తహస్తాలతో నిష్క్రమించింది. ఇక లంకలోనే ఉంటే ఏం లాభం లేదని లాహోర్‌కు టికెట్లనూ బుక్ చేసుకుంది.
One of the craziest finishes in the ODIs!
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 14, 2023
Sri Lanka came out on top of Pakistan and knocked them out of Asia Cup...!!! pic.twitter.com/QcQTFpeRaM
ఇది మా అడ్డా..
1984లో మొదలైన ఆసియా కప్‌లో ఇంతవరకూ తలపడని భారత్ - పాక్‌ల పోరును ఈ సారైనా చూద్దామనుకుంటే లంకేయులు ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. ‘యే బిడ్డా.. ఇది మా అడ్డా’ అంటూ ఫైనల్‌కు అర్హత సాధించారు. ఆసియా కప్ అంటేనే తమలోని అత్యుత్తమ ఆటను బయటకు తీసే లంకేయులు.. సెమీఫైనల్ గా భావించిన పాకిస్తాన్ తో పోరులో సింహగర్జన చేసి భారత్ కు కూడా హెచ్చరికలు పంపారు. మరి ఆదివారం ఈ లంక సింహాలు భారత్ తో ఏ మేరకు గర్జిస్తాయో చూడాలి.
- Hasaranga injured.
— Johns. (@CricCrazyJohns) September 14, 2023
- Chameera injured.
- Madushanka injured.
- Kumara injured.
- Covid cases.
Then Sri Lanka fought against all the odds and qualified for the finals of the Asia Cup 2023 - One of the greatest performances ever. pic.twitter.com/m9dtgghECz
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial