Asia Cup 2023 Point Table: భారత్, పాక్ ముందడుగు - గ్రూప్ బీలో సూపర్ 4కు వెళ్లేదెవరు? - ఇప్పటివరకూ ‘అత్యధికం’ ఎవరిది?
ఆసియా కప్ - 2023లో సూపర్ - 4 దశ ప్రారంభానికి ముందు గ్రూప్ - ఎ నుంచి రెండు జట్లు ఖాయమైనా గ్రూప్ - బీ నుంచి వెళ్లే జట్లపై ఇంకా స్పష్టత రాలేదు.
Asia Cup 2023 Point Table: ఆరు రోజుల క్రితం మొదలైన ఆసియా కప్‌లో గ్రూప్ - ఎ నుంచి ఆతిథ్య పాకిస్తాన్ ఇదివరకే సూపర్ - 4కు అర్హత సాధించగా సోమవారం నేపాల్‌ను ఓడించిన భారత్ కూడా ముందడుగు వేసింది. కానీ గ్రూప్- బీ నుంచి సూపర్ -4 కు వెళ్లబోయే జట్లపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లు ఉన్న ఆ గ్రూప్‌లో లంక, బంగ్లాలు రెండేసి పాయింట్లతో సమానంగా ఉన్నాయి. అఫ్గానిస్తాన్‌కు కూడా నేడు లంకతో జరుగబోయే మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే సూపర్ - 4కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో సూపర్ - 4కు వెళ్లబోయే జట్లు ఏవి..? పాయింట్ల పట్టిక ఎలా ఉంది..? ఇప్పటివరకూ టోర్నీలో అత్యధిక పరుగులు, వికెట్లు తీసిన ఆటగాళ్లు ఎవరు..? వంటి వివరాలు ఇక్కడ చూద్దాం.
పాయింట్ల పట్టిక ఇలా..
గ్రూప్ - ఏ నుంచి పాకిస్తాన్, భారత్ రెండేసి మ్యాచ్‌లు ఆడి తలా ఒకటి గెలిచి (వర్షం కారణంగా ఒకటి అర్థాంతరంగా రద్దు) మూడు పాయింట్లతో సూపర్ - 4కు అర్హత సాధించాయి. భారత్ (+2.689) కంటే పాకిస్తాన్ (+4.760) నెట్ రన్ రేట్ బెటర్‌గా ఉండటంతో ఆ జట్టు తొలి స్థానంలో ఉంది. నేపాల్ ఎలిమినేట్ అయింది.
గ్రూప్ - బీ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్‌లు రెండేసి పాయింట్లతో ఉండగా అఫ్గానిస్తాన్ బోణీ కొట్టలేదు. లంక అగ్రస్థానంలోనే ఉన్నా నేడు అఫ్గాన్‌తో జరుగబోయే మ్యాచ్ లో గెలవడం ఆ జట్టుకు అత్యావశ్యకం. నెట్ రన్ రేట్ విషయంలో శ్రీలంక (+0.951), బంగ్లాదేశ్ (+0.373)లు మెరుగ్గానే ఉన్నాయి. కానీ అఫ్గాన్ (-1.780) పరిస్థితి దారుణంగా ఉంది. దీంతో నేటి మ్యాచ్‌లో ఆ జట్టు భారీ విజయాన్ని నమోదుచేస్తే అప్పుడు సమీకరణాలు మారతాయి.
టాప్ రన్ స్కోరర్స్ వీళ్లే..
ఆసియా కప్‌లో ఇప్పటివరకూ ఐదు మ్యాచ్‌లు జరుగగా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో బంగ్లా బ్యాటర్ నజ్ముల్ హోసేన్ శాంతో అగ్రస్థానంలో ఉన్నాడు. శాంతో రెండు ఇన్నింగ్స్‌లలో 193 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ అర్థ శతకం ఉన్నాయి. రెండో స్థానంలో బాబర్ ఆజమ్ నిలిచాడు. పాకిస్తాన్ సారథి ఒక ఇన్నింగ్స్‌లో 151 పరుగులు (నేపాల్‌పై) చేశాడు. ఆ తర్వాత మెహిది హసన్ మిరాజ్ (బంగ్లాదేశ్ - 117), ఇఫ్తికార్ అహ్మద్ (పాక్ - 109) ఉన్నారు. ఐదో స్థానంలో హార్ధిక్ పాండ్యా (87 ) ఉండగా రోహిత్ శర్మ (85) ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటిదాకా టోర్నీలో వ్యక్తిగతంగా హయ్యస్ట్ స్కోరు చేసిన బ్యాటర్‌గా బాబర్ ఆజమ్ (నేపాల్‌పై 151) నిలిచాడు.
టాప్ వికెట్ టేకర్స్..
అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో పాకిస్తాన్ స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రిది అగ్రస్థానంలో ఉన్నాడు. అఫ్రిది.. రెండు మ్యాచ్‌లు ఆడి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత బంగ్లా పేసర్ టస్కిన్ అహ్మద్ ( 2 మ్యాచ్‌లలో ఐదు వికెట్లు), హరీస్ రౌఫ్ (పాక్: 2 మ్యాచ్‌లలో ఐదు వికెట్లు), నసీమ్ షా (పాక్ : 2 మ్యాచ్‌లలో ఐదు వికెట్లు) ఉండగా ఐదో స్థానంలో లంక యువ సంచలనం మతీషా పతిరాన (4 వికెట్లు) ఉన్నాడు. భారత్ నుంచి రవీంద్ర జడేజా టాప్ - 10లో 8వ స్థానంలో ఉన్నాడు. జడేజా ఖాతాలో మూడు వికెట్లు ఉన్నాయి. బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన.. పాక్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ (నేపాల్‌పై 4-27) పేరిట ఉంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial