Asia Cup 2023, IND Vs PAK: దాయాదుల పోరులో వీళ్ల ఆట ముఖ్యం బిగిలూ - ఏ క్షణంలో అయినా మలుపు తిప్పగలరు
Asia Cup 2023, IND Vs PAK: భారత్ - పాకిస్తాన్ మధ్య పల్లెకెల వేదికగా శనివారం జరుగబోయే తొలి మ్యాచ్‌లో పలువురు ఆటగాళ్ల ఆట చూడటం మరిచిపోవద్దు. వాళ్లెవరంటే..
Asia Cup 2023, IND Vs PAK: ఆకలిగా ఉన్న రెండు కొదమసింహాల పోరులా ఉండే భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఆసియా కప్ - 2023 లో భాగంగా శనివారం క్యాండీ (పల్లెకెల) వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లలో ఉన్న పలువురు ఆటగాళ్లు కీలకం అవుతారు. మ్యాచ్ జరుగుతున్న క్రమంలో ఏ క్షణంలో అయినా ఆటను మలుపుతిప్పగల సమర్థులు రెండు జట్లలోనూ ఉన్నారు. వాళ్లెవరు..? గతంలో ఇలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా..? వంటి ఆసక్తికర విషయాలు మీకోసం..
దాయాదితో పోరుకు భారత్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, యువ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లు కీలకం అవుతారు. బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా కూడా కీలక పాత్ర పోషించనున్నాడు. ఇరు దేశాల మధ్య ఉండే సరిహద్దు, రాజకీయ విభేదాల కారణంగా గడిచిన దశాబ్దంలో భారత్.. పాకిస్తాన్‌తో ఆడింది తక్కువే అయినా రోహిత్, కోహ్లీలు పాక్‌పై మంచి రికార్డును కలిగిఉన్నారు.
రోహిత్ శర్మ..
రోహిత్ శర్మ.. పాక్‌పై ఇప్పటివరకూ 16 వన్డే మ్యాచ్‌లు ఆడి 720 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఆరు అర్థ సెంచరీలూ ఉన్నాయి. 2018 ఆసియా కప్‌లో అతడు సారథిగానే గాక బ్యాటర్ గా కూడా మెరుగైన ప్రదర్శనలు చేశాడు. 2018 ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై భారత్ ఆడిన రెండు మ్యాచ్‌లలో హిట్‌మ్యాన్.. సెంచరీతో పాటు అర్థ సెంచరీ సాధించాడు. పాకిస్తాన్‌పై రోహిత్ బ్యాటింగ్ సగటు 51.42గా ఉంది. కొంచెం కుదురుకుంటే పాకిస్తాన్ పేస్ త్రయం (షహీన్, నసీమ్ షా, రౌఫ్) లకు చుక్కలు చూపించడం హిట్‌మ్యాన్‌కు పెద్ద కష్టమేం కాదు.
కోహ్లీ కమాల్..
గత దశాబ్దిలో అంతర్జాతీయ క్రికెట్‌లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన కోహ్లీ.. పాక్‌పై 13 వన్డేలు మాత్రమే ఆడాడు. 48.73 సగటుతో 536 పరుగులు చేసిన విరాట్.. రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు కూడా నమోదుచేశాడు. వన్డేలలో కోహ్లీ అత్యధిక స్కోరు (183) కూడా పాకిస్తాన్ పైనే. గతేడాది మెల్‌బోర్న్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై ఆడిన ఇన్నింగ్స్ (81 నాటౌట్)ఇప్పటికీ యూట్యూబ్‌లో ట్రెండింగ్ లోనే ఉంది.
కిషన్ - గిల్ తొలిసారి..
టీమిండియా యువ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ లు గత కొంతకాలంగా నిలకడగా ఆడుతూ జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. ఈ ఇద్దరూ పాకిస్తాన్ పై ఇంతవరకూ ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా వన్డేలలో వీరికి తలా ఓ డబుల్ సెంచరీ ఉంది. రేపటి మ్యాచ్‌లో గిల్ కు ప్లేస్ పక్కా అయినా ఇషాన్ కూడా ఆడితే.. వీరితో షహీన్, నసీమ్ షా వంటి యువ పేసర్లతో పోరు ఆసక్తికరంగా మారనుంది. ఆది నుంచే ధాటిగా ఆడే ఇషాన్, నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను నిర్మించి ఆఖర్లో రెచ్చిపోయే గిల్‌లు పాక్ బౌలింగ్ దళాన్ని ఏ మేరకు నిలువరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
బుమ్రా ఏం చేస్తాడో..?
టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా చాలాకాలం తర్వాత వన్డేలు ఆడుతున్నాడు. గతేడాది ఇంగ్లాండ్‌లో వన్డే సిరీస్ తర్వాత అతడు మళ్లీ వన్డే ఆడలేదు. పాకిస్తాన్ పై ఇదివరకు ఐదు వన్డేలు ఆడిన బుమ్రా. నాలుగు వికెట్లు తీశాడు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న పాకిస్తాన్‌ను ఆదిలోనే దెబ్బతీయాలంటే బుమ్రా రాణించడం తప్పనిసరి. పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై బుమ్రా ఏ మేరకు మెరుస్తాడో చూడాలి.
బాబర్ డేంజర్..
103 వన్డేలలో 5,202 పరుగులు. ఇందులో 18 సెంచరీలు, 28 అర్థ సెంచరీలు. ఈ గణాంకాలు చాలు బాబర్ ఆజమ్ వన్డే ఫార్మాట్‌లో ఏ రేంజ్ లో రెచ్చిపోతున్నాడో చెప్పడానికి.. ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో నేపాల్‌తో 158 పరుగులతో బాబర్.. టీమిండియాకు హెచ్చరికలు పంపకనే పంపాడు. బాబర్ ఇప్పటివరకూ భారత్‌తో ఐదు వన్డేలు ఆడి 158 పరుగులే చేసినా అత్యంత ప్రమాదకారి. క్రీజులో కుదురుకుంటే ఓ పట్టాన ఔట్ కాడు. బ్యాటింగ్‌లో బాబర్‌తో పాటు వికెట్ కీపర్ రిజ్వాన్, మిడిలార్డర్‌లో నిలకడగా ఆడుతున్న అఘా సల్మాన్, ఇఫ్తికార్ అహ్మద్ ప్రమాదకర బ్యాటర్లే అని చెప్పక తప్పదు.
తురుపు ముక్క షహీన్ అఫ్రిది..
పాకిస్తాన్ పేసర్ షహీన్ అఫ్రిది ఇరు జట్లకూ కీలకం. భారత బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీయడంతో పాటు పాకిస్తాన్‌కు ఎడ్జ్ అందించడంలో అతడితే కీలక పాత్ర. షహీన్‌ను తొలి ఓవర్లలో అడ్డుకోగలిగితేనే భారత బ్యాటింగ్ ఆర్డర్ కాస్త ప్రశాంతంగా పరుగులు రాబట్టుకోవచ్చు. 2021 టీ20 ప్రపంచకప్‌లో మొదటి ఓవర్‌లో నాలుగో బంతికే రోహిత్ శర్మను తర్వాత ఓవర్లో కెఎల్ రాహుల్ తో పాటు ఆఖర్లో కోహ్లీని ఔట్ చేయడంతో షహీన్ పేరు మార్మోగిపోయింది. ప్రస్తుతం అతడు వరల్డ్ నెంబర్ వన్ బౌలర్లలో టాప్ పొజిషన్‌లో ఉన్నాడు. అఫ్రిది రాణించడంపైనే పాక్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
నసీమ్ షా తక్కువేమీ కాదు..
పాక్ యువపేసర్ నసీమ్ షా కూడా ప్రమాదకర బౌలరే. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సమర్థుడు అతడు. షహీన్ తో కలిసి ఇటీవల కాలంలో పాకిస్తాన్ బౌలింగ్‌కు కీలకంగా మారిన షా.. భారత్‌తో ఇప్పటివరకూ ఒక్క వన్డే ఆడకపోయినా గతేడాది మూడు టీ20లలోనూ భయపెట్టాడు. షా తో పాటు పాకిస్తాన్ ప్రధాన పేసర్ హరీస్ రౌఫ్ కూడా స్వింగ్‌తో భారత్‌ను ఇబ్బందిపెట్టగల బౌలరే.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial