Asia Cup 2022 Final: ఆరోసారి ఆసియాకప్ దక్కించుకున్న శ్రీలంక - చివరి పోరులో చేతులెత్తేసిన పాకిస్తాన్!
పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక 23 పరుగులతో విజయం సాధించి కప్‌ను సొంతం చేసుకుంది.
శ్రీలంక ఆసియాకప్‌ను ఆరోసారి దక్కించుకుంది. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో 23 పరుగులతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్ 20 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో శ్రీలంక ఆరోసారి ఆసియాకప్‌ను సొంతం చేసుకుంది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు ఆరంభంలోనే బోలెడన్ని ఎదురు దెబ్బలు తగిలాయి. టాప్ 4 బ్యాటర్లలో ధనంజయ డిసిల్వ (28: 21 బంతుల్లో, నాలుగు ఫోర్లు) మినహా మరెవరూ రెండంకెల స్కోరు సాధించలేదు. వీరికి తోడు కెప్టెన్ షనక (2: 3 బంతుల్లో) కూడా విఫలం అయ్యాడు. దీంతో కేవలం 58 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో భనుక రాజపక్స (71 నాటౌట్: 45 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు), వనిందు హసరంగ (36: 21 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) శ్రీలంకను ఆదుకున్నారు. ఆరో వికెట్‌కు 66 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. స్కోరు 116 పరుగులకు చేరుకున్నాక హసరంగ అవుటయినా, కరుణరత్నే (14: 14 బంతుల్లో, ఒక సిక్సర్) సాయంతో రాజపక్స శ్రీలంకకు భారీ స్కోరు అందించాడు. పాకిస్తాన్ బౌలర్లలో హరీస్ రౌఫ్ అత్యధికంగా మూడు వికెట్లు తీసుకున్నాడు.
అనంతరం శ్రీలంక ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. మహ్మద్ రిజ్వాన్ (55: 49 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), ఇఫ్తికార్ అహ్మద్ (32: 31 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) మినహా మరెవ్వరూ కనీసం 15 పరుగులు కూడా చేయలేకపోయారు. వీరిద్దరి తర్వాత అత్యధిక స్కోరు ఎక్స్‌ట్రాలదే (14). దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పాక్ బ్యాటింగ్ ఎంత పేలవంగా సాగిందో.
మరోవైపు లంక బౌలర్లు కూడా అద్బుతంగా బౌలింగ్ చేశారు. దీంతో పాకిస్తాన్ 20 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయింది. లంక బౌలర్లలో ప్రమోద్ మదుషాన్ నాలుగు, వనిందు హసరంగ మూడు, కరుణరత్నే రెండు, మహీష్ ధీక్షణ ఒక వికెట్‌ను దక్కించుకున్నారు.
View this post on Instagram