Ashes Series 2023: నాలుగో టెస్టులో కీలక మార్పు చేసిన ఇంగ్లాండ్ - ఆండర్సన్‌కు ఆఖరి అవకాశం?
ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో నాలుగో టెస్టు ఈనెల 19 నుంచి మాంచెస్టర్ వేదికగా మొదలుకానుంది.
![Ashes Series 2023: నాలుగో టెస్టులో కీలక మార్పు చేసిన ఇంగ్లాండ్ - ఆండర్సన్‌కు ఆఖరి అవకాశం? Ashes Series 2023: England announce playing XI 4th Test made this big change Manchester clash Ashes Series 2023: నాలుగో టెస్టులో కీలక మార్పు చేసిన ఇంగ్లాండ్ - ఆండర్సన్‌కు ఆఖరి అవకాశం?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/17/63c7c27c6b7ce83c7f4a705cf0a247891689601700486689_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ashes Series 2023: ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య రసవత్తరంగా సాగుతున్న యాషెస్ పోరులో ఇంగ్లీష్ జట్టు నాలుగో టెస్టుకు ముందు తుది జట్టులో కీలక మార్పు చేసింది. ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్‌ను తుది జట్టులోకి తీసుకుంది. మాంచెస్టర్ వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లాండ్‌కూ చాలా కీలకం. ఇప్పటికే సిరీస్‌లో 2-1 తేడాతో వెనుకబడ్డ బెన్ స్టోక్స్ సేన.. మాంచెస్టర్‌లో ఓడినా, టెస్టును డ్రా చేసుకున్నా యాషెస్‌ను సొంతం చేసుకోవడం కష్టమే అవుతుంది.
ఆండర్సన్‌కు ఆఖరి ఛాన్స్..?
యాషెస్ సిరీస్‌కు ముందు ఏడాదికాలంగా ఇంగ్లాండ్ ఆడిన టెస్టులలో ఆండర్సన్ కీలక పాత్ర పోషించాడు. నాలుగు పదుల వయసులో యువ పేసర్లతో పోటీ పడుతూ అతడు వరుసగా మెరుగైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. దీంతో అతడు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్‌లో కూడా అదరగొడతాడని ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్ టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు ఆ జట్టు ఫ్యాన్స్ కూడా భావించారు. కానీ ఆండర్సన్ మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయాడు. ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్‌లో ఆడిన అతడు రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో మూడో టెస్టులో ఇంగ్లాండ్ అతడికి రెస్ట్ ఇచ్చింది.
One change for the 4th @LV_Cricket #Ashes Test at @EmiratesOT 🏟🏏
— England Cricket (@englandcricket) July 17, 2023
మూడో టెస్టులో ఓలీ రాబిన్సన్ గాయపడటంతో ఇంగ్లాండ్.. ఆండర్సన్‌కు మళ్లీ తుది జట్టులోకి తీసుకుంది. లీడ్స్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లు బౌలింగ్ చేసిన రాబిన్సన్.. వెన్నుగాయంతో రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు రాలేదు. కానీ ఆ టెస్టులో మార్క్ వుడ్, క్రిస్ వోక్స్‌లు బౌలింగ్, బ్యాటింగ్‌లలో రాణించి ఇంగ్లాండ్‌కు సూపర్ డూపర్ విక్టరీని అందించారు. ఇక ఇప్పుడు మాంచెస్టర్ వేదికగా జరుగబోయే నాలుగో టెస్టులో కూడా ఆండర్సన్ రాణించకుంటే అతడి కెరీర్ ముగిసినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. వయసుభారంతో పాటు ఇంగ్లాండ్ టీమ్‌లోకి కొత్త నీరు వచ్చి చేరుతుండటంతో ఇక ఆండర్సన్‌ను తప్పిస్తే బెటర్ అన్న చర్చ జోరుగా సాగుతోంది. మరి ఈ విమర్శలకు, చర్చలకు ఫుల్ స్టాప్ పడాలంటే మాంచెస్టర్‌లో ఆండర్సన్ ఏ విధంగా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
బెయిర్ స్టో కు మరో అవకాశం..
ఈ సిరీస్‌లో ఆండర్సన్‌తో పాటు వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో మీద కూడా ఇంగ్లాండ్ భారీ ఆశలు పెట్టుకుంది. కానీ అతడి ఆటతీరు మాత్రం అందుకు అనుగుణంగా లేదు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఒక్క ఇన్నింగ్స్‌లో తప్ప బెయిర్ స్టో తన మార్కును చూపించలేదు. నాలుగో టెస్టు నేపథ్యంలో బెయిర్ స్టోను తప్పించి బెన్ ఫోక్స్‌కు అవకాశం కల్పించాలని ఇంగ్లాండ్ మాజీలు బెన్ స్టోక్స్‌కు సూచించారు. కానీ ఇంగ్లాండ్ సారథి మాత్రం బెయిర్ స్టో మీదే నమ్మకముంచాడు.
నాలుగో టెస్టుకు ఇంగ్లాండ్ జట్టు : బెన్ డకెట్, జాక్ క్రాలే, మోయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ బెయిర్ స్టో (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)