Andre Russell: ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు - బౌలర్లకు చుక్కలు చూపించిన నైట్‌రైడర్ రసెల్!
వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ ఆండ్రీ రసెల్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు.
వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లతో చెలరేగాడు. కరీబియన్ దీవుల్లో జరుగుతున్న 6IXTY టోర్నమెంట్‌లో రసెల్ ఈ రికార్డును సాధించాడు. అయితే ఒకే బౌలర్ బౌలింగ్‌లో కాదండోయ్... వేర్వేరు ఓవర్లలో తాను ఎదుర్కున్న వరుస ఆరు బంతులను సిక్సర్లుగా తరలించాడు. ఈ మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ తరఫున ఆడిన ఆండ్రీ రసెల్ (72: 24 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో డొమినిక్ డ్రేక్స్ బౌలింగ్‌లో మూడు, నాలుగు, ఐదు, ఆరు బంతులను సిక్సర్లు కొట్టిన రసెల్, ఎనిమిదో జాన్ రస్ జాగెస్సర్ బౌలింగ్‌లో మొదటి రెండు బంతులకు కూడా అదే పరిస్థితి కల్పించాడు. ఏడో ఓవర్లో చివరి బంతి ఆడాక నాన్ స్ట్రైకర్ ఎండ్‌కు రావాలి కదా అనే సందేహం మీకు రావచ్చు. కానీ 6IXTY టోర్నమెంట్ రూల్స్ వేరుగా ఉంటాయి. అక్కడ ఓవర్ మారాక నాన్ స్ట్రైకర్ ఎండ్‌కు వెళ్లరు.
డొమినిక్ డ్రేక్స్ బౌలింగ్‌లో నాలుగు సిక్సర్లతో రసెల్ తన అర్థ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. తర్వాతి ఓవర్లో కూడా బౌండరీలతో చెలరేగిన రసెల్ అదే ఓవర్ చివరి బంతికి అవుట్ కావడంతో ప్రత్యర్థి జట్టయిన సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్ ఊపిరి పీల్చుకుంది.
రసెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 10 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 155 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్ లక్ష్యాన్ని దాదాపు ఛేదించినంత పని చేసింది. ఆండ్రీ ఫ్లెచర్ (33: 15 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (50: 15 బంతుల్లో, ఒక ఫోర్, ఏడు సిక్సర్లు), డొమినిక్ డ్రేక్స్‌లు (33 నాటౌట్: 10 బంతుల్లో, రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడినా, ఆఖర్లో క్రిస్ గేల్ (19 నాటౌట్: 17 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) వేగంగా పరుగులు చేయలేకపోవడంతో మూడు పరుగులతో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్ ఓటమి పాలైంది.
Andre Russell SIX SIXES off consecutive SIX balls in the SIXTY tournament.
— 𝗔𝗱𝗶𝘁𝘆𝗮⎊ (@StarkAditya_) August 28, 2022
8 SIXES and 5 FOURS.@TKRiders pic.twitter.com/jBKyzqwPOj
View this post on Instagram