Ashes Series 2023: బజ్‌బాల్ వర్సెస్ వరల్డ్ ఛాంపియన్స్ - యాషెస్ సమరాన్ని చూసేయండిలా!
ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియాల మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు అంతా సిద్ధమైంది. మే 16 నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది.
Ashes Series 2023: ప్రపంచ క్రికెట్‌లో భారత్ - పాకిస్తాన్‌కు ఉండే క్రేజే వేరు. అయితే దాయాదుల సమరం మొదలై మహా అయితే ఏడు దశాబ్దాలు. కానీ అంతకు ఏడు దశాబ్దాల మందే క్రికెట్‌లో అగ్రరాజ్యాలైన ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియాల మధ్య ‘యాషెస్’రణరంగం మొదలైంది. 1882 నుంచి సాగుతున్న ఈ ‘బూడిద’ సమరం మరోసారి అభిమానులకు అసలైన టెస్టు క్రికెట్ సమరాన్ని పంచడానికి సిద్ధమైంది. గతంలో కంటే ఈసారి ఈ సిరీస్ మరింత రసవత్తరంగా సాగనుంది.
బజ్‌బాల్ కాన్సెప్ట్‌తో ఇంగ్లాండ్..
2021-22 లలో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ చావుదెబ్బతింది. కంగారూలు.. తమ స్వంతగడ్డపై 4-0 తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించారు. ఆ తర్వాత వెస్టిండీస్ కూడా ఇంగ్లీష్ జట్టును ఓడించడంతో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ).. వెటరన్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ను సారథిగా నియమించి అతడిని న్యూజిలాండ్ మాజీ సారథి బ్రెండన్ మెక్‌కల్లమ్‌ను జత చేసింది. ఇది అగ్నికి ఆయువు తోడైనట్టుగా అయింది. 2022 జూన్ నుంచి మొన్నీమధ్యే ఐర్లాండ్ తో ముగిసిన ఏకైక టెస్ట్ వరకూ ఈ ద్వయం 13 టెస్టులు ఆడితే ఇందులో పది విజయాలు దక్కాయంటే ఈ జోడీ ఎంత సూపర్ హిట్టో అర్థం చేసుకోవచ్చు. ‘బజ్‌బాల్’ (దూకుడుగా ఆడటం) కాన్సెప్ట్ తో దూసుకుపోతున్న ఇంగ్లాండ్‌కు, ఈ జోడీకి స్వదేశంతో పాటు ఏరకంగా చూసుకున్నా ఇదే తొలి కఠినమైన అగ్నిపరీక్ష.
The #Ashes 2023.
— England Cricket (@englandcricket) June 15, 2023
Immortality awaits...@FallingInSand | @BenStokes38 pic.twitter.com/zuXNAcVCuA
డబ్ల్యూటీసీ జోష్‌లో ఆసీస్..
ఆస్ట్రేలియా కూడా తక్కువ తిన్లేదు. ఇంగ్లాండ్ ఇప్పుడు బజ్‌బాల్ కాన్సెప్ట్ తో ఉంది గానీ ఆసీస్ అందులో అందెవేసిన చేయి. దూకుడుకు మారుపేరు ఆ జట్టు. అదీగాక ఇటీవలే కమిన్స్ సేన.. వరల్డ్ ఛాంపియన్‌షిప్ గదను కూడా గెలుచుకున్న జోష్‌లో ఉంది. ఆ జట్టులో కూడా మ్యాచ్ విన్నర్లు పుష్కలంగా ఉన్నారు. ఇక యాషెస్ అంటేనే రెచ్చిపోయే స్టీవ్ స్మిత్ ను ఎదుర్కోవడం ఇంగ్లాండ్‌కు అంత ఆషామాషీ కాదు. ప్రస్తుతం రెండు జట్లలో యాషెస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు అతడే. స్మిత్ తో పాటు డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, మార్నస్ లబూషేన్, వికెట్ కీపర్ అలెక్స్ కేరీలూ మంచి టచ్ లోనే ఉన్నారు. బౌలింగ్ లో మిచెల్ స్టార్క్, స్కాట్ బొలాండ్, పాట్ కమిన్స్, జోష్ హెజిల్వుడ్‌లు ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపేందుకు రెడీగా ఉన్నారు. బలాబలాలలో ఇరు జట్లూ సమంగా ఉండటంతో రెండు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది.
The Mace is ours!
— Cricket Australia (@CricketAus) June 11, 2023
Congratulations to captain Pat Cummins and our men’s national team on becoming World Test Champions 🏆 pic.twitter.com/LCTILuI6ja
తుది జట్టు ప్రకటన :
ఇంగ్లాండ్ తొలి టెస్టుకు రెండ్రోజుల ముందే తమ తుది జట్టును ప్రకటించి ‘మేం ఛాలెంజ్‌కు రెడీగా ఉన్నాం. ఇక మీదే ఆలస్యం..’ అని చెప్పకనే చెప్పింది. సాధారణంగా టాస్ వేసిన తర్వాత ప్రకటించే 11 మంది సభ్యుల తుది జట్టును ఇంగ్లాండ్ ఏకంగా రెండ్రోజుల ముందే ప్రకటించడం గమనార్హం.
తొలి టెస్టుకు ఇంగ్లాండ్ తుది జట్టు : బెన్ డకెట్, జాక్ క్రాలే, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్ స్టో, మోయిన్ అలీ, ఓలీ రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్
భారత్‌లో చూడొచ్చా..?
ఇంగ్లాండ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లను భారత్‌లో కూడా లైవ్ చూడొచ్చు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగబోయే తొలి టెస్టు (జూన్ 16-20) శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలవుతుంది. ఈ మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించొచ్చు. మొబైల్స్, వెబ్‌సైట్ లలో అయితే సోనీ లివ్ యాప్ లో చూడొచ్చు.