WTC Final AUS VS SA Updates: గెలుపు దిశగా సౌతాఫ్రికా, మార్క్రమ్ అజేయ సెంచరీ.. బవూమా కెప్టెన్ ఇన్నింగ్స్.. వెనుకంజలో ఆసీస్
ఐసీసీ టైటిల్ నెగ్గేందుకు సౌతాఫ్రికా కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉంది. భారీ టార్గెట్ ను ఛేజ్ చేసి, తొలిసారి డబ్ల్యూటీసీ చాంపియన్ గా నిలవాలని తహతహలాడుతోంది. మార్క్రమ్ సెంచరీతో అదరగొట్టాడు.

Aiden Markram Stunning Century: ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా అదరగొడుతోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ అల్టిమేట్ టెస్టులో ప్రొటీస్ విజయం దిశగా సాగుతోంది. 282 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సఫారీలు.. శుక్రవారం మూడోరోజు ఆటముగిసేసరికి రెండు వికెట్లకు 213 పరుగులు చేసింది. ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ అజేయ సెంచరీ (159 బంతుల్లో 102 బ్యాటింగ్, 11 ఫోర్లు) తో కదం తొక్కడంతో ఛేజింగ్ ను సాఫీగా లాగిస్తోంది. అతనికి తోడుగా కెప్టెన్ టెంబా బవూమా అజేయ అర్ధ సెంచరీ (121 బంతుల్లో 65 బ్యాటింగ్, 5 ఫోర్లు) తో సత్తా చాటాడు. ప్రొటీస్ విజయానికి ఇంకా కేవలం 69 పరుగులు మాత్రమే కావాలి. చేతిలో ఎనిమిది వికెట్లు ఉండటంతో సఫారీలు ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నారు.
Aiden Markram and Temba Bavuma guide South Africa to the brink of #WTC25 glory 🙌
— ICC (@ICC) June 13, 2025
Look how the day unfolded 👉 https://t.co/pQ7yVByD1d pic.twitter.com/kHI8s8GDg7
స్టార్క్ ఒంటరి పోరాటం..
అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 144/8 తో రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఆసీస్.. 207 పరుగులకు ఆలౌటైంది. ఓవర్ నైట్ బ్యాటర్ మిషెల్ స్టార్క్ అజేయ ఫిఫ్టీ (136 బంతుల్లో 58 నాటౌట్, 5 ఫోర్లు) తో చెలరేగి జట్టుకు సవాలు విసరగలిగే టార్గెట్ ను అందించాడు. అంతకుముందు ఓవర్ నైట్ బ్యాటర్ నాథన్ లయోన్ (2) త్వరగానే ఔటైనా, చివరి బ్యాటర్ జోష్ హేజిల్ వుడ్ (17) అద్భుతంగా ఆడాడు. స్టార్క్ కు స్ట్రైక్ ఇస్తూ, జట్టు భారీ స్కోరు సాధించేలా చేశాడు. మరో ఎండ్ లో చకచకా పరుగులు సాధించిన స్టార్క్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ పదో వికెట్ కు 59 పరుగులు జోడించాక, ఎట్టకేలకు హేజిల్ వుడ్ ను మార్క్రమ్ ఔట్ చేశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ఓవరాల్ గా 282 పరుగుల టార్గెట్ ను ప్రొటీస్ నిర్దేశించింది. బౌలర్లలో కగిసో రబాడ నాలుగు, లుంగీ ఎంగిడికి మూడేసి వికెట్లు దక్కాయి.
మార్క్రమ్ సూపర్ సెంచరీ..
తొలి ఇన్నింగ్స్ లో 138 పరుగులకే ఆలౌటైనా ప్రొటీస్.. 282 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేస్తుందని ఎవరికీ నమ్మకం లేకపోయింది. అందుకు తగ్గట్లుగానే ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (6) మూడో ఓవర్లోనే ఔట్ కావడం ప్రొటీస్ అభిమానులను కలవరపర్చింది. ఈ దశలో వియాన్ మల్డర్ (27) తో కలిసి ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న మర్క్రమ్.. చూడ చక్కని బౌండరీలు సాధిస్తూ, స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. మల్దర్ కూడా ఐదు బౌండీరీలు సాధించి, కాస్తే వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. దీంతో ఆసీస్ బౌలర్లు కాస్త ఒత్తిడిలో పడిపోయారు. రెండో వికెట్ కు 61 పరుగులు జోడించాక, మల్డర్ ఔటయ్యాడు. ఈ దశలో బవూమా-మార్క్రమ్ జోడీ సమన్వయంతో ఆడింది. ఒక్కో పరుగు తీస్తూ, వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. దీంతో టార్గెట్ కరుగుతూ వచ్చింది. ఈ దశలో మార్క్రమ్, బవూమా అర్ధ సెంచరీలు సాధించారు. ఆ తర్వాత కాస్త దూకుడుగా ఆడిన మార్క్రమ్ సెంచరీ వైపు కదం తొక్కాడు. ఆట చివర్లో హేజిల్ వుడ్ బౌలింగ్ లో సొగసైన బౌండరీ కొట్టి, 8వ సెంచరీని నమోదు చేశాడు. ఆట ముగిసే వరకు అజేయంగా నిలిచిన జంట.. మూడో వికెట్ కు అబేధ్యంగా 143 పరుగులు జోడించింది. బౌలింగ్ లో స్టార్క్ కే రెండు వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 212 పరుగులు చేయగా, ప్రొటీస్ 138 రన్స్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం మీద ఆటకు నాలుగో రోజైన శనివారం ఫలితం తేలే అవకాశముంది.




















