అసలు అక్కడ ఏం జరిగింది? - సంచలన విషయాలు వెల్లడించిన ప్రత్యక్ష సాక్షి
విరాట్ కోహ్లీ వర్సెస్ గౌతం గంభీర్.. రెండ్రోజులుగా ఏ ఇద్దరు క్రికెట్ అభిమానులు మాట్లాడుకున్నా చర్చ అంతా దీని గురించే.. అసలు అక్కడ ఏం జరిగింది..?
Virat Kohli vs Gautam Gambhir: భారత క్రికెట్‌ను ఐపీఎల్ మరో లెవల్‌కు తీసుకెళ్లి కూర్చుండబెడితే క్రికెటర్ల ప్రవర్తన మాత్రం దానిని పాతాళానికి పడేస్తున్నది. తాజాగా జరిగిన గౌతం గంభీర్ - విరాట్ కోహ్లీల గొడవ అలాంటిదే. లక్నో - బెంగళూరు మధ్య రెండ్రోజుల క్రితం లక్నో వేదికగా ముగిసిన మ్యాచ్‌లో గంభీర్ - కోహ్లీలు మరోసారి తమ పాత పగలకు కొత్త టచ్ ఇస్తూ చేసుకున్న అగ్లీ ఫైట్ ఐపీఎల్‌లో మరో మాయని మచ్చగా మిగిలింది. ఇంతకీ అసలు అక్కడ వీళ్లిద్దరి మధ్య గొడవ ఎందుకు మొదలైంది..? దీనిపై లక్నో టీమ్ డగౌట్ లో ఉన్న ఓ వ్యక్తి.. తాజాగా పీటీఐతో సంచలన విషయాలు వెల్లడించాడు. ఈ గొడవ జరుగుతున్నప్పుడు అతడు అక్కడే ప్రత్యక్ష సాక్షిగా (పేరు వెల్లడించలేదు) ఉన్నాడు.
ఇదీ జరిగింది..
ఈ వివాదం గురించి ఆ వ్యక్తి పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘ఏం జరిగిందో మీరు టీవీలలో చూశారు. మ్యాచ్ ముగియగానే కైల్ మేయర్స్.. కోహ్లీ మాట్లాడుకుంటున్నారు. కోహ్లీతో మేయర్స్.. ‘నువ్వెందుకు పదే పదే మమ్మల్ని అబ్యూజ్ (దుర్భాషలాడటం) చేస్తున్నావ్’ అని ప్రశ్నించాడు. అప్పుడు కోహ్లీ.. ‘మరి మీరెందుకు నా వైపు అంత కోపంగా చూస్తున్నారు..?’అని ఎదురుప్రశ్న వేశాడు..
ఇది జరుగుతుండగానే అక్కడకు గంభీర్ వచ్చి మేయర్స్ ను పక్కకు తీసుకుపోతూ విరాట్‌తో ‘నువ్వు అతడికి ఏం చెప్తున్నావ్?’ అని అడిగాడు. దానికి విరాట్ ‘అసలు మేం మాట్లాడుకుంటుంటే నువ్వు మధ్యలోకి ఎందుకొచ్చావ్..?’ అని గుస్సా అయ్యాడు. దాంతో గౌతమ్.. ‘నువ్వు నా ప్లేయర్స్‌ను నిందిస్తున్నావ్. నా ప్లేయర్స్ అంటే నా ఫ్యామిలీ. నువ్వు వాళ్లను తిడితే నా ఫ్యామిలీని తిట్టినట్టే..’అని చెప్పాడు..
గంభీర్ మాటలకు కోహ్లీ కల్పించుకుని.. ‘అయితే నువ్వు నీ ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకో..’ అని అన్నాడు. ఇది గంభీర్‌కు మరింత కోపం తెప్పించింది.. ‘హా.. నీ నుంచే నేర్చుకోవాలి నేను..’ అని గంభీర్ ఎదురుతిరిగాడు.. ఇద్దరిమధ్య వాగ్వాదం పెరుగుతుండటంతో అక్కడే ఉన్న ఇరు జట్ల ఆటగాళ్లు వచ్చి వారిద్దరినీ విడదీశారు...’’ అని అక్కడ జరిగింది ఇదేనని వివరించాడు.
— 🤞विशाल🤞 (@Visl___) May 1, 2023
ఇప్పటికైనా ఆపుతారా..?
గంభీర్ - కోహ్లీ మధ్య పదేండ్లుగా జరుగుతున్న ఈ కోల్డ్ వార్ ప్రతి ఐపీఎల్ సీజన్ లో మరింత ముదురుతున్నది. ఈ సీజన్ లో ఇప్పటికైతే ఆర్సీబీ - లక్నోలు రెండు సార్లు తలపడ్డాయి. ఒకవేళ ఈ రెండు జట్లూ ప్లేఆఫ్స్ చేరితే తప్ప ఈ సీజన్ లో అయితే ప్రత్యక్షంగా మరోసారి ఆడే అవకాశం లేదు. ఒకవేళ అదే జరిగితే మాత్రం మళ్లీ ఎంత రచ్చ చేస్తారోనని ఐపీఎల్ నిర్వాహకులు వాపోతున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్లు కూడా కోహ్లీ, గంభీర్ లపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణాన ఇప్పటికైనా గంభీర్ -కోహ్లీలు గొడవలను పక్కనబెట్టి కలిసిపోతారా..? అన్నది ఆసక్తికరంగా మారింది.