Beth Mooney: ఈ ఆస్ట్రేలియా బ్యాటర్‌కు భారత్‌పై తిరుగులేని రికార్డు - వావ్ అనిపించే నంబర్లు!
ఆస్ట్రేలియా క్రికెటర్ బెత్ మూనీ అంతర్జాతీయ క్రికెట్‌లో అద్బుతమైన నంబర్స్ ఉన్నాయి.
Beth Mooney Stats: మహిళల టీ20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు టీమిండియాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో కంగారూ జట్టు బ్యాటర్ బెత్ మూనీ 37 బంతుల్లో 54 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఆమె ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. వాస్తవానికి మహిళల క్రికెట్ చరిత్రలో బెత్ మూనీ అత్యుత్తమ బ్యాటర్ అని గణాంకాలు చెబుతున్నాయి.
బెత్ మూనీ గణాంకాలు ఏమి చెబుతున్నాయి?
బెత్ మూనీ టీ20 కెరీర్‌ను పరిశీలిస్తే ఈ ప్లేయర్ ఇప్పటి వరకు 82 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. బెత్ మూనీ 82 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో 39.24 సగటుతో 2214 పరుగులు చేసింది. ఈ సమయంలో బెత్ మూనీ స్ట్రైక్ రేట్ 124.17 కాగా, అత్యుత్తమ స్కోరు 117 పరుగులుగా ఉంది.
ఈ ఆస్ట్రేలియా వెటరన్ ప్లేయర్ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో రెండుసార్లు సెంచరీ మార్కును దాటింది. బెత్ మూనీ పేరిట 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇది కాకుండా బెత్ మూనీ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో 298 ఫోర్లు, 12 సిక్సర్లు కొట్టింది.
వన్డే ఫార్మాట్‌లో 50కి పైగా సగటు
టీ20 మ్యాచ్‌లే కాకుండా వన్డే టెస్టు మ్యాచ్‌ల్లోనూ బెత్ మూనీ తనదైన ముద్ర వేసింది. ఈ ఆస్ట్రేలియన్ బ్యాటర్ ఇప్పటివరకు 57 వన్డేల్లో 1,941 పరుగులు సాధించింది. ఈ ఫార్మాట్‌లో ఈ ఆస్ట్రేలియన్ ప్లేయర్ సగటు 51.08 కాగా, స్ట్రైక్ రేట్ 87.67గా ఉంది. బెత్ మూనీ వన్డే ఫార్మాట్‌లో మూడు సార్లు సెంచరీ మార్కును దాటింది. అదే సమయంలో 13 అర్ధ సెంచరీలను కూడా సాధించింది. వన్డే క్రికెట్‌లో తన గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి.
ముఖ్యంగా భారత్‌పై బెత్ మూనీ రికార్డు అద్భుతంగా ఉంది. భారత్‌పై తొమ్మిది వన్డేలు ఆడిన బెత్ మూనీ అందులో ఏడు ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగింది. ఈ ఏడు ఇన్నింగ్స్‌లో ఏకంగా 85.75 సగటుతో 343 పరుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీ, రెండు అర్థ సెంచరీలు ఉన్నాయి. మూడు సార్లు నాటౌట్‌గా నిలిచింది.
టీ20ల్లో కూడా భారత్‌పై మూనీకి మంచి రికార్డే ఉంది. భారత్‌పై బెత్ మూనీ 22 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో 21 ఇన్నింగ్స్‌లో 817 పరుగులు సాధించింది. తన యావరేజ్ 48.05 కాగా, స్ట్రైక్ రేట్ ఏకంగా 127.85గా ఉంది. ఇందులో ఎనిమిది అర్థ సెంచరీలు ఉన్నాయి.
మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాను ఓడించడంలో భారత్ విఫలం అయింది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో చివరి బంతి వరకు పోరాడినప్పటికీ విజయానికి ఐదు పరుగుల దూరంలో ఆగిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అనంతరం భారత్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 167 పరుగులకే పరిమితం అయింది. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా మరోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
173 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఘోరమైన ప్రారంభం లభించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (2: 5 బంతుల్లో), షెఫాలీ వర్మ (9: 6 బంతుల్లో, ఒక ఫోర్), వన్ డౌన్ బ్యాటర్ యస్తికా భాటియా (4: 7 బంతుల్లో, ఒక ఫోర్) ముగ్గురూ రెండంకెల స్కోరు చేయడంలో విఫలం అయ్యారు. దీంతో భారత్ 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. విజయంపై ఆశలు కూడా పూర్తిగా చెదిరిపోయాయి.