Sarfaraz Khan: ముందు బ్యాటింగ్ మీద దృష్టి పెట్టాలి - మాటల మీద కాదు - సర్ఫరాజ్‌పై సెలెక్టర్ వ్యాఖ్యలు!
సర్ఫరాజ్ ఖాన్ అనవసర వ్యాఖ్యలు చేయడం కాదని, బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని సెలక్టర్ అభిప్రాయపడ్డారు.
Sarfaraz Khan: భారత జట్టు ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు టీమిండియాను ప్రకటించారు. అయితే భారత జట్టులో సర్ఫరాజ్ ఖాన్ కు చోటు దక్కలేదు. దీనిపై చాలా మంది నుంచి వ్యతిరేకత వ్యక్తం అయింది.
నిజానికి సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా ఆడాడు. అయితే ఇంత బాగా ఆడినప్పటికీ జట్టులో స్థానం పొందకపోవడంపై చాలా మంది అనుభవజ్ఞులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో పాటు సర్ఫరాజ్ ఖాన్ తానే స్వయంగా చాలా ఎమోషనల్ రియాక్షన్ ఇచ్చాడు.
'అతను తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలి'
అయితే సర్ఫరాజ్ వ్యాఖ్యలపై బీసీసీఐ ప్రస్తుత సెలక్టర్ మిలింద్ రేగే ఓ పెద్ద ప్రకటన చేశాడు. నిరసనలు తెలపవచ్చు కానీ, హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు. సర్ఫరాజ్ ఖాన్ తాను ఎంపిక కాకపోవడానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం మానుకోవాలని తెలిపారు.
‘సర్ఫరాజ్ పని పరుగులు చేయడం, అతను తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలి. ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్ గొప్ప ఫామ్‌లో ఉన్నాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే భారత టెస్టు జట్టు బ్యాటింగ్ లైనప్‌లో ఒక స్థానం ఖాళీగా ఉండటం చాలా ముఖ్యం. సరైన సమయంలో తనకు అవకాశం దక్కుతుంది.’ అని మిలింద్ రేగే అభిప్రాయపడ్డాడు.
'క్రికెట్‌లో ఇలా చేస్తే వర్కవుట్ అవ్వదు'
గతంలో సర్ఫరాజ్ ఖాన్ మీడియాతో మాట్లాడిన సమయంలో తనను ఎంపిక చేయలేదన్న బాధ స్పష్టంగా కనిపించింది. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మతో తాను మాట్లాడానని, గతేడాది బంగ్లాదేశ్ టూర్‌కు అవకాశం ఇస్తానని మాటిచ్చాడని చెప్పాడు.
'కొన్నిసార్లు మీరు పడిపోతారు. మరికొన్నిసార్లు లేస్తారు. అయితే కదలకుండా కూర్చోవడం కంటే నడవడం మంచిది. ఇతరులెవరూ మిమ్మల్ని ఎక్కడికీ తీసుకువెళ్లరు. మీ గమ్యం వైపు మీరే నడవాలి' అని సర్ఫరాజ్ తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఒక సందేశాన్ని ఉంచాడు. 'నేను ఎక్కడికి వెళ్లినా త్వరగా భారత్ కు ఆడతాననే గుసగుసలు వినిపిస్తాయి. సోషల్ మీడియాలో టీమిండియాలో నాకు స్థానం లభించని దానిపై వేలాది సందేశాలు దర్శనమిస్తాయి. ఆసీస్ తో టెస్ట్ సిరీస్ కు ఎంపికకాని రోజు నేను అస్సాం నుంచి దిల్లీకి వచ్చాను. ఆ రాత్రంతా నిద్రపోలేకపోయాను. నేను అక్కడు ఎందుకు లేను అని ఆలోచిస్తూనే ఉన్నాను. మా నాన్నతో మాట్లాడిన తర్వాత సాధారణ స్థితికి వచ్చాను. నేను బాధపడ్డాను కానీ డిప్రెషన్ కు లోను కాలేదు.' అని సర్ఫరాజ్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నాడు.
అదే సమయంలో భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ‘మీరు జట్టులో సన్నగా ఉన్నవారి కోసం మాత్రమే చూస్తున్నట్లయితే, ఫ్యాషన్ షోకి వెళ్లి కొంతమంది మోడల్స్‌ను తీసుకొచ్చి వారి చేతుల్లో బ్యాట్, బాల్‌ను పెట్టండి. క్రికెట్ ఇలా వర్కవుట్ అవ్వదు.’ అన్నాడు.
26 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ 2019 నుంచి దేశవాళీల్లో విశేషంగా రాణిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో ఖాన్ ముంబయికి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ మూడేళ్లలో 22 ఇన్నింగ్సుల్లో 134. 64 సగటుతో 2289 పరుగులు చేశాడు. అందులో ఒక ట్రిపుల్ సెంచరీ, 2 డబుల్ సెంచరీలు, 9 సెంచరీలు, 5 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ గణాంకాలతో అతడు టీమిండియా జట్టులో స్థానం కోసం ఆరాటపడడం తప్పు కాదు. అయినప్పటికీ సెలక్టర్లు అతన్ని టీం సెలక్షన్ లో పరిగణనలోకి తీసుకోవడంలేదు.