![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Saina Nehwal: గంట ఆడితే మోకాళ్లలో మంట! రిటైర్మెంట్‌పై మాట్లాడిన సైనా నెహ్వాల్
Saina Nehwal: ప్యారిస్ ఒలింపిక్స్‌కు ఎంపికయ్యేందుకు శాయశక్తులా కృషి చేస్తానని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ అంటోంది.
![Saina Nehwal: గంట ఆడితే మోకాళ్లలో మంట! రిటైర్మెంట్‌పై మాట్లాడిన సైనా నెహ్వాల్ Badminton Saina Nehwal plays down Paris Olympics retirement not in mind yet know details Saina Nehwal: గంట ఆడితే మోకాళ్లలో మంట! రిటైర్మెంట్‌పై మాట్లాడిన సైనా నెహ్వాల్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/14/4ef92272393f4ef6293d4454a441d71e1694680228991251_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Saina Nehwal:
ప్యారిస్ ఒలింపిక్స్‌కు ఎంపికయ్యేందుకు శాయశక్తులా కృషి చేస్తానని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ (Saina Nehwal) అంటోంది. అర్హత సాధించడం సులభం కానప్పటికీ ప్రయత్నిస్తానని తెలిపింది. అందరూ ఏదో ఒక రోజు ఆటకు వీడ్కోలు పలకాల్సిందేనని పేర్కొంది. ఇప్పట్లో దానిపై నిర్ణయం తీసుకోనని వెల్లడించింది. ఫిజియో, వైద్యుల పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నానని వివరించింది.
ప్రపంచంలోని అగ్రశ్రేణి షట్లర్‌గా ఎదిగిన సైనా నెహ్వాల్ ప్రస్తుతం గాయాలతో సతమతం అవుతోంది. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వలేకపోతోంది. 33 ఏళ్ల వయసులో మోకాలి గాయాలతో ఇబ్బంది పడుతోంది. జూన్‌లో సింగపూర్ ఓపెన్లో మొదటి రౌండ్లోనే నిష్క్రమించిన తర్వాత మరే టోర్నీలోనూ ఆడలేదు. 2023లో పాల్గొన్న ఆరు టోర్నీల్లోనూ ఆమె రెండో రౌండ్ దాటకపోవడం బాధాకరం. గాయాల బెడదతోనే మరికొన్ని రోజుల్లోనే జరిగే ఆసియా క్రీడల నుంచి తప్పుకొంది.
ప్యారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే టాప్ 100లో ఉండాలి. ఈ లెక్కన మహిళల సింగిల్స్‌లో 55వ ర్యాంకుకు పడిపోయిన సైనాకు అవకాశమే రాకపోవచ్చు. మే నెలలో ఒలింపిక్ అర్హత దశ మొదలయ్యాక ఆమె రెండే టోర్నీలు ఆడింది. ఏదేమైనా ఆమె ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే మిగిలిన టోర్నీల్లో నిలకడగా ఫలితాలు సాధించాలి.
'గంట లేదా రెండు గంటలు శిక్షణ పొందితే మోకాళ్లలో మంటగా అనిపిస్తోంది. మోకాలిని వంచలేకపోవడంతో రెండో రౌండు ట్రైనింగ్ కుదరడం లేదు. వైద్యులు రెండు మూడు ఇంజెక్షన్లు ఇచ్చారు. ఒలింపిక్స్ సమీపిస్తున్నాయి. అర్హత సాధించడం కష్టమే. పునరాగమనం చేసేందుకు శాయశక్తులా కష్టపడుతున్నా. ఫిజియోలు నాకు సాయం చేస్తున్నారు. మంట తగ్గకపోతే కోలుకోవడానికి మరింత సమయం పడుతుంది. అన్యమనస్కంగా ఆడలేదు. ఆడినా ఫలితాలు రావు' అని సైనా నెహ్వాల్ తెలిపింది.
'శిక్షణ తర్వాత మోకాళ్లలో మంట వస్తోందంటే టోర్నీలో ఒక రౌండ్ ముగిశాకా వస్తుంది. అది ప్రతికూల సూచన. అందుకే ముందు దీన్నుంచి బయటపడాలని అనుకుంటున్నా. ఆడటం సులభమే. గాయపడకుండా జాగ్రత్తపడటం కష్టం. ఫిజియోలు, డాక్టర్ దిన్షా పార్దివాల మార్గనిర్దేశంలో త్వరగా కోలుకుంటాననే అనుకుంటున్నా. ఇవన్నీ శిక్షణపై ఆధారపడి ఉంటాయి' అని సైనా తెలిపింది.
ఇప్పట్లో వీడ్కోలుపై ఆలోచించడం లేదని సైనా వెల్లడించింది. 'ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు వీడ్కోలు పలకాల్సిందే. అందుకు తుది గడువేమీ లేదు. దేహం సహకరించడం లేదనిపిస్తే ఆడటం మానేస్తారు. నేనైతే ఇప్పుడు పునరాగమనం కోసం ప్రయత్నిస్తున్నా. ఒక క్రీడాకారిణిగా ప్రయత్నించడం నా బాధ్యత. ఎందుకంటే నాకీ ఆటంటే ఇష్టం. కొన్నేళ్లుగా ఆడుతున్నాను. ఒకవేళ కోలుకోవడం సాధ్యమవ్వకపోతే నేనేమీ పశ్చాత్తాపం చెందను. ఎందుకంటే ఆటలో చాలా సాధించాను. ఆసియా, ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు పొందాను. ఏం జరుగుతుందో చూడాలి' అని సైనా వివరించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)