Womens Ashes 2022: 10 ఓవర్లలో 45 పరుగులు.. చేతిలో ఏడు వికెట్లు.. యాషెస్ టెస్టులో హైడ్రామా.. చివరికి ఏం అయిందంటే?
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మహిళల మధ్య జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ హైడ్రామా నడుమ డ్రాగా ముగిసింది.
మహిళల యాషెస్ సిరీస్‌లో ఏకైక టెస్టు డ్రాగా ముగిసింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ఈ టెస్టులో ఎంతో హై డ్రామా చోటు చేసుకుంది. చివరిరోజు ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్‌కు 48 ఓవర్లలో 257 పరుగుల ఊరించే లక్ష్యం అందించింది. అంటే ఇంగ్లండ్ విజయం కోసం దూకుడుగా ఆడితే వికెట్లు తీసి మ్యాచ్ ముగించాలన్నది ఆస్ట్రేలియా ప్లాన్. కానీ ఆ ప్లాన్ మొదట్లో బెడిసికొట్టింది.
ఎందుకు ఇంగ్లండ్ మహిళా బ్యాటర్లు వన్డేను మించిన వేగంతో బ్యాటింగ్ చేసి లక్ష్యానికి దగ్గర అయ్యారు. 38 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. మరో 10 ఓవర్లలో 45 పరుగులు చేస్తే చాలు. ఈ దశలో ఇంగ్లండ్ బ్యాటర్లు అతి విశ్వాసానికి వెళ్లారు. భారీ షాట్లకు వెళ్లి వరుస వికెట్లు కోల్పోయారు.
మొదటి ఐదుగురు బ్యాటర్లు 30 పరుగులకు పైగా చేయగా.. తర్వాతి ఆరుగురిలో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. లారెన్ లాఫీల్డ్ హిల్ (33: 65 బంతుల్లో, ఐదు ఫోర్లు), టామీ బ్యూమొంట్ (36: 42 బంతుల్లో, ఏడు ఫోర్లు), హీథర్ నైట్ (48: 54 బంతుల్లో, ఐదు ఫోర్లు), నటాలీ స్కివర్ (58: 62 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు), సోఫియా డంక్లే (45: 32 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) రాణించారు. స్కివర్, డంక్లే చాలా దూకుడుగా ఆడారు.
అయితే ఆ తర్వాత ఆస్ట్రేలియన్ బౌలర్లు చెలరేగారు. వరుస ఓవర్లలో వికెట్లు పడటంతో ఇంగ్లండ్ కూడా ఒత్తిడిలో పడింది. 46వ ఓవర్లో ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్‌ను కోల్పోయింది. అప్పటికి ఇంగ్లండ్ విజయానికి 2.1 ఓవర్లలో 13 పరుగులు అవసరం. అయితే ఇంగ్లండ్ 11వ నంబర్ బ్యాటర్ కేట్ క్రాస్ (1: 12 బంతుల్లో) వికెట్ పడకుండా కాపాడుకోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 168 పరుగులు చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
View this post on Instagram