Asia Cup Hockey 2022: ఆసియా కప్‌లో 'కంచు' మోగించిన టీమ్‌ఇండియా!
Asia Cup Hockey 2022: ఆసియా కప్ హాకీని టీమ్‌ఇండియా మూడో స్థానంతో ముగించింది. జపాన్‌తో జరిగిన హోరాహోరీ పోరులో 1-0 తేడాతో విజయం సాధించింది.
Asia Cup Hockey 2022: ఆసియా కప్ హాకీని టీమ్‌ఇండియా మూడో స్థానంతో ముగించింది. జకార్తా వేదికగా జపాన్‌తో జరిగిన హోరాహోరీ పోరులో 1-0 తేడాతో విజయం సాధించింది. కాంస్య పతకం అందుకుంది. తొలి క్వార్టర్లోనే ఏడో నిమిషంలో రాజ్‌కుమార్ పాల్ ఏకైక గోల్ చేశాడు. ఆ తర్వాత రెండు జట్లు గోల్స్ కోసం చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు.
ఈ టోర్నీలో టీమ్‌ఇండియా ప్రస్థానం రోలర్ క్యాస్టర్ రైడ్‌ను తలపించింది. అనూహ్య ఓటములు చవిచూసింది. కీలకమైన మ్యాచుల్లో నెగ్గింది. సూపర్-4కు అర్హత సాధించేందుకు ఇండోనేషియా మ్యాచులో 16 గోల్స్ కొట్టింది. సూపర్-4లో ఆఖరి రౌండ్ రాబిన్ మ్యాచులో దక్షిణ కొరియాతో తలపడింది. ఫైనల్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచును టీమ్‌ఇండియా 4-4తో డ్రా చేసింది. మెరుగైన గోల్ స్కోర్ వల్ల కొరియా ఫైనల్‌కు వెళ్లింది. ఫలితంగా జపాన్‌తో భారత్ మూడో స్థానం కోసం పోటీ పడింది.
అంతకు ముందు సూపర్-4 టీమ్‌ఇండియా విచిత్రంగా క్వాలిఫై అయింది. ఇండోనేషియాతో మ్యాచులో ఏకంగా 16 గోల్స్ కొట్టింది. దీంతో పాకిస్తాన్ ఇంటి బాట పట్టింది. ఈ మ్యాచ్ చివరి క్వార్టర్‌లో ఏకంగా ఏడు గోల్స్‌ను భారత్ సాధించడం విశేషం.
భారత ఆటగాళ్లలో డిప్సన్ టిర్కే ఐదు గోల్స్, పవర్ రాజ్‌భర్ మూడు గోల్స్‌తో చెలరేగారు. కార్తీక్ సెల్వం, అభరన్ సుదేవ్, ఎస్వీ సునీల్ రెండేసి గోల్స్ సాధించగా... నీలం సందీప్, ఉత్తం సింగ్ చెరో గోల్ కొట్టారు. ఇండోనేషియా అస్సలు ఒక్క గోల్ కూడా సాధించలేకపోయింది. అక్కడక్కడా ప్రయత్నించినా బలమైన భారత్ డిఫెన్స్ ముందు నిలబడలేకపోయారు.
భారత్ మొదటి క్వార్టర్ ముగిసేసరికి 3-0, రెండో క్వార్టర్ ముగిసేసరికి 6-0, మూడో క్వార్టర్ ముగిసేసరికి 10-0 ఆధిక్యంతో నిలిచింది. చివరి క్వార్టర్‌లో ఏకంగా ఆరు గోల్స్ సాధించి మ్యాచ్‌ను గెలుచుకోవడంతో పాటు సూపర్-4లోకి కూడా అడుగుపెట్టింది.
ఈ టోర్నమెంట్ మొదటి మ్యాచ్‌లో భారత్ 1-1తో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఆ తర్వాత జపాన్ చేతితో 2-5తో ఓడింది. పాకిస్తాన్ కూడా జపాన్ చేతిలో 2-3తో ఓడటంతో... ఇండోనేషియాతో మ్యాచ్‌ను 15 గోల్స్ తేడాతో గెలిస్తే సూపర్-4లో అడుగు పెట్టే ఈక్వేషన్‌లోకి టీమిండియా ఎంటర్ అయింది. ఇండోనేషియాను 16-0తో ఓడించి సూపర్-4లోకి అడుగుపెట్టింది.
A magnificent game of Hockey concludes with the #MenInBlue defeating Japan and winning the 🥉 in the Hero Asia Cup 2022. 🤩#IndiaKaGame #HockeyIndia #HeroAsiaCup #MatchDay #INDvsJPN @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI pic.twitter.com/0pPs7s8gWy
— Hockey India (@TheHockeyIndia) June 1, 2022