(Source: ECI/ABP News/ABP Majha)
IND vs AFG: ఒకే ప్యాటర్న్‌లో ఇండియా, అఫ్గాన్! 2 విన్స్ 2 లాస్ ఆఖరికి రూల్డ్ ఔట్!!
IND vs AFG: కొన్నిసార్లు అంతే! తెలియకుండానే గెలుపోటముల్లో ఒకర్నొకరు అనుసరించాల్సి వస్తుంది. ఆసియాకప్-2022లో ఇదే జరిగింది. టీమ్‌ఇండియా, అఫ్గానిస్థాన్ ఒకేలా నిష్క్రమించాయి.
IND vs AFG, Asia Cup 2022 : కొన్నిసార్లు అంతే! ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుంది!! తెలియకుండానే గెలుపోటముల్లో ఒకర్నొకరు అనుసరించాల్సి వస్తుంది. ఆసియాకప్-2022లో ఇదే జరిగింది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమ్‌ఇండియా, ఊహించని థ్రిల్లర్లను అందించిన అఫ్గానిస్థాన్ ప్యాటర్న్‌లో నడిచాయి. ఒకేలా గెలిచాయి. విచిత్రంగా ఒకేలా నిష్క్రమించాయి. ఎలాగంటారా!!
2 విన్ 2 లాస్!
ఆసియాకప్-2022లో టీమ్‌ఇండియా తిరుగులేని ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. సీనియర్ పేసర్లు లేనప్పటికీ కుర్ర జట్టుతో దుబాయ్‌కు వచ్చేసింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు ముందు ప్రయోగాలు చేపట్టింది. మొదట్లో ఇవి బాగానే పనిచేసినా కీలకమైన సూపర్-4 దశలో ఓటములనే మిగిల్చాయి. గ్రూప్-ఏలో రోహిత్ సేన రెండు మ్యాచులు ఆడిన సంగతి తెలిసిందే. మొదటి పోరులోనే దాయాది పాక్‌తో తలపడింది. ప్రత్యర్థి నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని ఆఖరి ఓవర్లో ఛేదించింది. ఇక రెండో మ్యాచులో ఏకంగా 192-2 స్కోర్ చేసింది. బదులుగా హాంకాంగ్‌ను 152-5కు పరిమితం చేసింది. వరుస విజయాలతో చెలరేగిన భారత్ సూపర్-4లో మొదటి మ్యాచులో అదే దాయది పాక్ చేతిలో పరాభవం చవిచూసింది. 182 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి 1 బంతి మిగిలుండగా ఛేదించింది. ఇక రెండో మ్యాచులో 174 టార్గెట్‌ను లంకేయులు సేమ్ 1 బంతి మిగిలుండగానే ఛేజ్ చేశారు. దాంతో హిట్‌మ్యాన్ సేన ఫైనల్‌కు వెళ్లకుండానే నిష్క్రమించింది.
సేమ్ రూట్లో అఫ్గాన్!
విచిత్రంగా అఫ్గానిస్థాన్‌దీ ఇదే సిచ్యువేషన్! గ్రూప్-బి తొలి మ్యాచులో శ్రీలంకను మొదట 105కే ఆలౌట్ చేసేశారు. ఆ తర్వాత 10.1 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టంతో టార్గెట్‌ను ఛేదించేసి రికార్డు సృష్టించారు. రెండో మ్యాచులో బంగ్లాదేశ్‌కు ముచ్చెమటలు పట్టించారు. తొలి ఇన్నింగ్స్‌లో 127కే పరిమితం చేశారు. స్వల్ప టార్గెట్‌ను 18.3 ఓవర్లలో 7 వికెట్ల తేడాతో ఛేజ్ చేసి ఆశలు రేపింది. ఈ సారి ఫైనల్లో టీమ్‌ఇండియాతో తలపడేది అఫ్గానే అన్నట్టుగా అంచనాలు పెంచేశారు. అలాంటిది సూపర్-4 తొలి మ్యాచులో లంకేయుల చేతిలో షాక్ తిన్నారు. ఇండియా లాగే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేశారు. ప్రత్యర్థికి 176 రన్స్ టార్గెట్ ఇచ్చారు. షార్జా కావడంతో గెలుస్తుందనే అనుకుంటే మిడిలార్డర్ అసాధారణ పోరాటంతో లంకేయులు గెలుపు లాగేసుకున్నారు. ఇక కీలకమైన రెండో మ్యాచులోనూ అంతే! 130 టార్గెట్ ఛేదనలో పాక్ 19 ఓవర్లకు 119-9తో నిలిచింది. మ్యాచ్ గెలవాలంటే ఆఖరి ఓవర్లో పాక్‌కు 11 పరుగులు కావాలి. అఫ్గాన్‌కు ఒక వికెట్ కావాలి. ఫజల్ హక్ ఫారూఖీ వేసిన తొలి బంతిని అప్పుడే క్రీజులోకి వచ్చిన నసీమ్ షా సిక్సర్‌గా మలిచాడు. అదే ఊపులో రెండో బంతినీ సిక్సర్‌గా బాదేసి అఫ్గాన్ ఫైనల్ ఆశలకు గండి కొట్టేశాడు.
ఇప్పుడు గెలిచేదెవరు?
ఇదండీ సంగతి! భారత్, అఫ్గాన్ లీగు దశలో రెండుకు రెండూ గెలిచాయి. సూపర్-4లో తొలి 2 మ్యాచుల్లో టార్గెట్‌ను డిఫెండ్ చేసుకోలేక ఓటమి పాలయ్యాయి. గురువారం నామమాత్రమైన ఆఖరి సూపర్-4 మ్యాచులో పరస్పరం తలపడుతున్నాయి. మొత్తానికి ఇద్దరిలో ఎవరో ఒకరు విజయం సాధిస్తారు. అయితే ఓడిపోయేది ఎవరన్నదే ప్రశ్న!!