Women's Day 2023: ప్రేమ, క్షమ, ఆత్మాభిమానం, సహనానికి కేరాఫ్ - అందుకే యుగయుగాలకు ఆమె ఆదర్శం
మహిళా దినోత్సవం: మహాపతివ్రతల్లో సీతాదేవి పేరు ఎందుకు చెబుతారు..సహనానికి మారుపేరుగా ఆమె పేరు ఎందుకు చెబుతారు.. భార్య అంటే సీతలా ఉండాలని ఎందకంటారు...ఆమె ఎందుకు ఆదర్శనీయమైంది..
శ్రీరామ పత్నీ జనకస్య పుత్రీ సీతాంగనా సుందర కోమలాంగీ
భూగర్భ జాతా భువనైక మాతా వధూవరాభ్యాం వరదా భవంతు
సీతాదేవి గురించి చెప్పే ఈ శ్లోకాన్ని...చాలా శుభలేఖల్లో చూసి ఉంటారు. వివాహ ఆహ్వాన పత్రికపై ఈ శ్లోకం రాయడం వెనుకున్న ఆంతర్యం ఏంటో తెలుసా...అన్ని విషయాల్లో సీతాదేవిని ఆదర్శంగా తీసుకుని భర్త అడుగుజాడల్లో నడవాలని.. భర్త ప్రేమను గెలుచుకోవాలని చెబుతారు.
జనకుడి కుమార్తె, శ్రీరాముని ధర్మపత్ని అయిన సీతాదేవి సహనానికి మారుపేరుగా తన క్షమాగుణంతో భూదేవిని మించి అనిపించుకుంది. పుట్టినింట్లో అల్లారుముద్దుగా పెరిగిన సీతాదేవి మెట్టినింటలో అండుగుపెట్టినప్పటి నుంచి తిరిగి తల్లి భూదేవి ఒడికి చేరేవరకూ ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. అయినప్పటికీ ఎక్కడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. భార్యగా తన బాధ్యత మరువకుండా భర్త వెంట నడిచింది, లవకుశలకు జన్మించేసరికి అడవిలో ఉన్నప్పటికీ వారిని వీరులుగా తీర్చిదిద్దడంలో తల్లిగా విజయాన్ని సాధించింది.
Also Read: ఆ క్షణం తలదించుకుంటే అబల అనుకున్నారు కానీ ఆమె ప్రతీకారం రేంజ్ ఊహించలేకపోయారు
దశావతారాల్లో భాగంగా శ్రీ మహావిష్ణువు రామావతారం ఎత్తినప్పుడు, భూగర్భంలోంచి సీతాదేవిగా ఉద్భవించిది శ్రీ మహాలక్ష్మి. క్షమ, దయ,ధైర్యం, వివేకం, ఆత్మాభిమానం కలబోసిన ఉదాత్తమైనది సీతాదేవి. సీత లేకుండా రాముడు లేడు అందుకే ఆమె గుణగణాలపై ఎందరో మేథావులు చర్చల మీద చర్చలు చేశారు. సీతలోని సుగుణాలు నేటి మగువకు ఎంతో ఆదర్శం, స్పూర్తి దాయకం. రామాయణంలో ఏ ఘట్టం తీసుకున్నా ఆ సమయంలో సీత ప్రవర్తన అద్భుతం అనిపిస్తుంది.
ఆత్మాభిమానం
వనవాసంతో భాగంగా చిత్రకూటానికి సీతారాములు వచ్చారని తెలిసిన ఆమె తండ్రి జనకుడు..వారిని కలిసి వనవాసం పూర్తై రామలక్ష్మణులు వచ్చేవరకూ మిథిలా నగరానికి వచ్చి తనతో పాటూ ఉండాలని కోరతాడు. ఆ మాటలను సున్నితంగా తిరస్కరించిన అభిమానవతి సీత. మెట్టినింటికొచ్చాక ఎన్ని కష్టాలు ఎదురైనా ఎవరికి వారు పరిష్కరించుకోవాలి కానీ పుట్టింటి గడప తొక్కకూడదన్న సందేశాన్నిచ్చింది.
దయ
తన ముందు చేయి చాచి నిల్చున్నది ఎవరినైనా ఆదరించాలన్న దయాగుణం ఆమెది. అందుకే తనింటికి మారువేషంలో భిక్షాటనకు వచ్చిన రావణుడికి లక్ష్మణరేఖ దాటి మరీ భిక్షం వేసిన దయామూర్తి. అంటే తన రక్షణ కన్నా దానమే గొప్పదన్నది ఆమె భావన.
వివేకం
మనం ఎంత తెలివైన వారం అనేది కష్టం వచ్చినప్పుడు స్పందించే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే రావణుడు తనను అపహరించుకుపోతున్నప్పుడు..తన ఆనవాళ్లు రాముడికి ఎలా తెలిపాలా అని ఆలోచించింది. ఇప్పట్లా అప్పట్లో ఫోన్లు లేవుకదా... అందుకే తన ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను నేలపై జారవిడిచి తనకోసం వెతికే భర్తకు ఓ క్లూ వదిలిపెట్టింది.
ప్రేమ
భర్త పక్కన ఉన్నప్పుడు మాత్రమే కాదు.. రావణుడి చెరలో బంధీగా ఉన్నప్పుడు కూడా నిత్యం శ్రీరామనామస్మరణ చేస్తూ అనుక్షణం పతి క్షేమాన్ని కోరుకుంది సీతాదేవి.
Also Read: శ్రీ శోభకృత్ నామసంవత్సర ఉగాది ఎప్పుడొచ్చింది, పంచాంగ శ్రవణం ఎందుకు!
అపాయంలో ఉన్నప్పుడు కూడా ఆమె శత్రువులకు లొంగలేదు. తన వశం కావాలంటూ రావణుడు బెదిరించినప్పుడు కూడా సీత అస్సలు తగ్గలేదు. నువ్వు నాకు ఈ గడ్డిపరకతో సమానం అని చెప్పి రావణుడి ధర్మ హీనతను ప్రశ్నించింది, స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెప్పింది0.
క్షమ
రాక్షస సంహారం తర్వాత సీతను అశోకవనం నుంచి విడిపించి తీసుకువెళ్తున్న సమయంలో..తాను బంధీగా ఉన్నప్పుడు మాటలతో, చేతలతో తనను హింసించిన రాక్షసులకు ఎలాంటి కీడు తలపెట్టవద్దని, వాళ్లు కేవలం స్వామిభక్తి చూపారని హనుమంతుడితో చెప్పిన క్షమాగుణం సీత సొంతం.
ధైర్యం
పాతివ్రత్య నిరూపణ కోసం సీతను అగ్నిప్రవేశం చేయమని రాముడు అడిగినప్పుడు ఆమె బోరుబోరున ఏడవలేదు. తనని నమ్మమని ప్రాధేయపడలేదు. రాముడి మాటలు తన గుండెను గాయపరిచినా సహనంతో భరించింది...తాను తప్పుచేయలేదన్న ఆత్మవిశ్వాసంతో నిప్పుల్లో దూకి తనపై నిందలేసిన వారు కూడా సిగ్గుతో తలదించుకునేలా చేసింది.
ఆదర్శం
అడవిలో ఆశ్రమవాసిగా కాలం గడుపుతూ కూడా తన కుమారులను ప్రయోజకుల్ని చేయాలని ఎల్లవేళలా తపిస్తూ, వారిని కార్యసాధకులుగా, తండ్రిని మించిన తనయులుగా తీర్చిదిద్దడం ఆమె ఉత్తమ పెంపకానికి నిదర్శనం.
జంతు ప్రేమికురాలు
ప్రకృతి మీద, పశుపక్ష్యాదుల మీద సీతకు ఎనలేని ప్రేమ. అదే ప్రేమతో అందమైన జింకను తన కోసం తీసుకురమ్మని భర్తను అభ్యర్థించింది. అయితే అదే ఘట్టం ఆ తదనంతరం రావణసంహారానికి దారితీసిందనుకోండి