Mahalaya Amavasya 2024 : పితృదేవతల ఆశీస్సులు ఎందుకంత ముఖ్యం..శాస్త్రం ఏం చెబుతోంది!
Mahalaya Amavasya : పితృ అమావాస్య లేదా పెత్రమాస లేదా మహాలయ అమావాస్య ఎందుకు జరుపుకుంటారు? ఈ రోజు చేసే క్రతువులు ఎందుకు అంత ముఖ్యమైనవి? జరపక పోతే ఏమవుతుంది?
![Mahalaya Amavasya 2024 : పితృదేవతల ఆశీస్సులు ఎందుకంత ముఖ్యం..శాస్త్రం ఏం చెబుతోంది! Why we do Mahalaya amavasya date and significance of mahalaya amavasya Mahalaya Amavasya 2024 : పితృదేవతల ఆశీస్సులు ఎందుకంత ముఖ్యం..శాస్త్రం ఏం చెబుతోంది!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/28/252e39f43b717efd718c5d2ea0df14721727533303843560_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పరిణామ క్రమంలో క్రమంగా జంతువుల నుంచి మానవుడు ఏర్పడుతూ వచ్చాడు. మనిషిగా పరిణామం చెందూతు ఉన్న క్రమంలో రకరకాల కొత్త కొత్త విషయాలను ఆవిష్కరిస్తూ జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా జీవించడం నేర్చుకున్నాడు. మనం ఈ రోజున ఇన్ని సౌకర్యాల నడుమ ఇంతటి అందమైన, సౌకర్యవంతమైన జీవితం గడుపుతున్నామంటే అందుకు కారణం మన పూర్వీకుల జిజ్ఞాస, వారి కృషి తప్పకుండా ఉందని అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈరోజు మనం ఆనందిస్తున్న అన్ని వస్తువులూ వారి ఆవిష్కరణలే అయినపుడు వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం, ఆ భావాన్ని వ్యక్తం చెయ్యడం మన కర్తవ్యం. వారికి కృతజ్ఞత తెలుపుకునే విధానమే పితృపక్షాల్లో ఆచరించే క్రతువులు.
Also Read: తిథి తెలియకపోతే పితృదేవతలకు శ్రాద్ధం ఎప్పుడు పెట్టాలి - పితృపక్షం మిస్సైతే మరో ఆప్షన్ ఇదే!
మహాలయ అమావాస్య
పితృదేవతలు ఈ అమావాస్య రోజున వారసులు ఇచ్చే తర్పణాలతో తృప్తి చెంది ఆశీర్వాదాలు అందిస్తారని నమ్మకం. కొత్త పంటలు వచ్చే కాలం కనుక పండించిన పంటను మొదట పితృదేవతలకు సమర్పించుకుని కృతజ్ఞత తెలుపుకోవడమే ఈ పితృపక్షాల వెనకున్న ఆంతర్యం. ఆ తర్వాత రోజు నుంచి దేవీ నవరాత్రుల ఉత్సవాలు శాస్త్రబద్ధంగా ప్రారంభిస్తారు.
పితృదేవతల శాంతి కోసం పవిత్ర నదీజలాల్లో తర్పణం విడిచి శ్రాద్ధ పూజలు, పిండ ప్రదానం చేస్తారు. వీటితో పాటు కాకులకు, ఇతర జంతువులకు ఆహారం అందించడం, అన్నదానం చెయ్యడం వంటి క్రతువులు నిర్వహిస్తారు.
మహాలయ అమావాస్య ప్రాశస్థ్యం
ఈ రోజు గురించి మహాభారతంలో కూడా ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. పితృదేవతలను తృప్తి పరచని కారణంగా యుదధ్ధంలో మరణించినప్పటికీ కర్ణుడికి స్వర్గ ప్రాప్తి లభించలేదట. పితృదేవతలను శాంతింప జేస్తే తప్ప స్వర్గానికి అనుమతి లేదని, కనుక ముందుగా ఆ క్రతువు పూర్తి చేసి స్వర్గానికి అర్హత సాధించాలని దేవతలు సూచించారట. అందుకోసమని కర్ణుడు భూమి మీదకు వచ్చి పితృదేవతలకు తర్పణ విడిచి, పిండప్రధానం ఇతర క్రతువులన్నీ పూర్తి చేసిన తర్వాతే అతడికి స్వర్గ ప్రాప్తి లభించిందని కొన్ని మహాభారత కథల్లో ఉంది.
Also Read: స్వయంగా బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి - మహాలయపక్షంలో ఒక్కసారి పఠించినా చాలు!
ఈ కథ ద్వారా ఎంతటి దాన ధర్మాలు చేసినప్పటికీ, యుధ్దరంగంలో వీరమరణం పొందినప్పటికీ, పితృదేవతలను నిర్లక్ష్యం చేసినా, వారిని తృప్తి పరచలేక పోయినా, వారి ఆశీర్వాదం లేకపోయినా స్వర్గం ప్రాప్తించదని శాస్త్రం చెబుతోంది. ప్రతీ ఒక్కరూ తప్పకుండా ఈ పితృపక్షకాలంలో పూర్వీకులను స్మరించుకుని వారిని తృప్తి పరిచే క్రతువులు తప్పక నిర్వహించాలి. ఈ పక్షం రోజులు ఎలాంటి కార్యక్రమాలు నిర్వర్తించలేకపోయినా అమావాస్య రోజునైనా ఈ కార్యక్రమం పూర్తిచెయ్యాలని శాస్త్రం చెబుతోంది.
Also Read: బతుకమ్మ ప్రారంభ సంబరాలను ఎంగిలి పూలుగా ఎందుకు పిలుస్తారు!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)