Pitru Paksham 2024: స్వయంగా బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి - మహాలయపక్షంలో ఒక్కసారి పఠించినా చాలు!
మహాలయ పక్షం రోజుల్లో అత్యధిక రోజులు...అదీ కుదరకుంటే మీ పెద్దలు మృతిచెందిన తిథి రోజు అయినా ఈ స్త్రోతాన్ని పఠించి... పితృదేవతలకు నమస్కరిస్తే వారి పాపకర్మలు నశిస్తాయని బృహద్ధర్మపురాణంలో ఉంది.
Pitru Paksham 2024 : బ్రహ్మదేవుడు స్వయంగా చేసిన ఈ పితృస్తుతిని ఎవరైనతే ఈ 15 రోజులు పఠిస్తారో ఆ ఇంట నెగటివ్ ఎనర్జీ ఉండదు.. వంశం వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత, వృత్తి జీవితంలో ఉండే పాపాలు ప్రక్షాళన అవుతాయంటారు పండితులు
తల్లిదండ్రుల విషయంలో తప్పు చేసిన వారు ఈ స్తోత్రాన్ని పశ్చాత్తాపంతో చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది.
మీ జన్మదినం రోజు కూడా పితృదేవతలను స్మరిస్తూ ఈ స్త్రోత్రాన్ని చదువుకుంటే వారి ఆశీస్సులు మీపై ఉంటాయి..
Also Read: సెప్టెంబర్ 18న పితృ పక్షం ప్రారంభం .. కర్ణుడు స్వర్గం నుంచి భూమ్మీదకు వచ్చిన ఈ 15 రోజులు ఎందుకంత ప్రత్యేకం!
బ్రహ్మ ఉవాచ
నమో పిత్రే జన్మదాత్రే సర్వ దేవమయాయ చ!
సుఖదాయ ప్రసంనాయ సుప్రీతాయ మహాత్మనే!!
ఎవరివల్ల ఈ జన్మ వచ్చిందో...ఎవరు సకల దేవతా స్వరూపులో..ఎవరి ఆశీస్సుల వల్ల నాకు మంచి జరుగునో అంతటి మహాత్ములైన పితృదేవతలకు నమస్కారం
సర్వ యజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే!
సర్వతీర్థావలోకాయ కరుణాసాగారాయ చ!!
సకల యజ్ఞస్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన..సకల పుణ్యతీర్థాలకు ఆలవాలం అయిన పితృదేవతలకు నమస్కారం..
నమో సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమః!
సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ!!
సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించే బోళాశంకరులు రూపం అయిన పితృదేవతలకు నమస్కారం. మేం ఆచరించే తప్పులను క్షమిస్తూ మాకు మంచి జరగాలని కోరుకునే పితృదేవతలకు నమస్కారం.
దుర్లభం మానుషమిదం యేనలబ్ధం మాయా వపుః!
సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమోనమః!!
ధర్మాలు ఆచరించే అవకాశం ఇచ్చిన ఈ మనిషి శరీరం ఎవరి వల్లనైతే వచ్చిందో..ఆ పితృ దేవతలకు నమస్కారం
తీర్థ స్నాన తపో హోమ జపాదీన్ యస్య దర్శనం!
మహా గురోశ్చ గురవే తస్మై పిత్రే నమోనమః!!
ఎవర్ని చూస్తే ఎన్నో తీర్థాలలో స్నానం ఆచరించిన ఫలితం , తపస్సులు, హోమాలు, జపాలు చేసిన ఫలితం లభిస్తుందో అలాంటి పితృదేవతలకు నమస్కారం
యస్య ప్రణామస్తవనాత్ కోటిశః పితృతర్పణం!
అశ్వమేధ శతైః తుల్యం తస్మై పిత్రే నమోనమః!!
ఎవరికి నమస్కరించినా, తర్పణాలు విడిచినా అశ్వమేధ యాగం చేసినంత ఫలితం సిద్ధిస్తుందో అలాంటి పితృదేవతలకు వందనం..
ఫలశ్రుతి
ఇదం స్తోత్రం పిత్రుః పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః
ప్రత్యహం ప్రాతరుత్థాయ పితృశ్రాద్ధదినోపి చ
స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపివా
న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాది వాంఛితమ్
నానాపకర్మకృత్వాపి యఃస్తౌతి పితరం సుతః
సధృవం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీ భవేత్
పితృప్రీతికరైర్నిత్యం సర్వ కర్మాణ్యధార్హతి
మహాలయ పక్షంలో ఈ స్త్రోత్రాన్ని నిత్యం పితృదేవతలకు నమస్కరించి పఠిస్తే అన్నీ శుభాలే జరుగుతాయి.
2024 సెప్టెంబరు 18 బుధవారం నుంచి ప్రారంభమయ్యే పితృ పక్షం అక్టోబరు 02 బుధవారం అమావాస్యతో పూర్తవుతాయి. వీటినే మహాలయ పక్షాలు , మహాలయ అమావాస్య అని అంటారు.
Also Read: శరన్నవరాత్రులు ఎప్పటి నుంచి మొదలు.. దసరా ఏ రోజు వచ్చింది - ఇంద్రకీలాద్రిపై అమ్మవారి అలంకారాలివే!
గమనిక: పండితులు పేర్కొన్న వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది... దీనిని ఎంతవరకూ పరిగమలోకి తీసుకోవాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం...