మిమ్మల్ని మీరు తెలివైనవారని అనుకుంటున్నారా? అయితే, విదుర నీతిలో ఏం చెప్పారో తెలుసుకోవల్సిందే!
కురుక్షేత్ర యుధ్దానికి ముందు బెంగగా ఉన్న ద్రుతరాష్ట్రునికి థైర్యం చెబుతూ విదురుడు జీవితానికి అవసరమైన అనేక విషయాల గురించి వివరిస్తాడు. అవి ఇప్పటికీ ఆచరణీయం. ఆ విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
మనం రోజు వారీ జీవితంలో చాలా వింటుంటాం, చాలా చూస్తుంటాం. ఎప్పుడైనా మనకు దొరికిన సమాచారంలో మంచి విషయాలను, జీవన గమనాన్ని మరింత సుఖప్రదం చేసే విషయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని మిగతా వాటిని వదిలెయ్యాలి. కొన్ని సార్లు మనం ఊహించని విధంగా చిన్నపిల్లల నోటి నుంచో, మనం ఏమాత్రం పరిగణనలోకి తీసుకోని వ్యక్తుల నుంచో మనకు ఆ సమయానికి పనికి వచ్చే విషయాలు మనకు చేరవచ్చు. అంత మాత్రం చేత వాటిని నిర్లక్ష్యం చెయ్యకూడదు. అది దేవుడు మనకు వారి ద్వారా అందించిన పరిష్కారం కావచ్చు. తెలివైన వారు ఎవరి నుంచైనా సరే పనికి వచ్చే విషయాలను రాబట్టుకోగలరు. మట్టిలో బంగారం దొరికినట్టు ఒక్కోసారి మూర్ఖుడు, తెలివి లేని వాడు, కొత్తగా పరిచయం అయినవాడు ఇలా ఎవరి నోటి నుంచైనా మంచి మాట మనను చేరవచ్చు. అటువంటి చైతన్యం మనకు ఉండాలని విదుర నీతి చెబుతోంది.
పెద్దలూ విజ్ఞులైన వ్యక్తులు కొన్ని సార్లు కఠినంగా అయినా సరే మంచి చెబుతున్నపుడు మాటల్లో ధ్వనించే కఠినత్వాన్ని కాకుండా అందులోని వియష పరిజ్ఞానాన్ని గ్రహించ గలిగితే.. వారి వ్యక్తిత్వం మరింత ఇనుమడిస్తుందనేది విదుర నీతిలో తెలియజేసిన విషయాలలో ఒకటి.
ఎవరు తెలివైనవారు?
విజ్ఞులు మంచి జీవితం గడపడానికి మార్గాలను మనకు సూచిస్తుంటారు. ఈ సూచనలు మనకు మంచి మార్గం చూపే జ్యోతుల వంటివి. అందుకే విజ్ఞులు యథాలాపంగా మాట్లాడిన మాటల్లోంచి కూడా జ్ఞానాన్ని గుర్తించగలిగిన వాడే తెలివైన వాడనేది విదురనీతి. పావురం పంటపొలంలో గింజలను ఏరుకున్నట్టు ఈ సమాజంలో మనకు ఎదురైన మనుషుల్లో విజ్ఞులను వెతికి పట్టుకునే నేర్పరితనం కలిగి ఉండి వారి సాంగత్యంలో గడపడం ఆలోచనల్లో వివేకం పెంచేమార్గం. అలా విజ్ఞులను గుర్తించగలిగిన వాడే తెలివైన వాడని విదురనీతి చెబుతోంది.
ఆవులకు ఒక ప్రత్యేకమైన వాసనలు గుర్తించే శక్తి ఉంటుంది. అవి ఏవి తాము తినదగినవో ఏవి కాదో వాసనను బట్టి గుర్తిస్తాయి. రాజులు విషయ సేకరణకు వేగులను ఉపయోగిస్తారు. పరోక్షంగా ఈ వేగులు రాజుకు కళ్లు గా వ్యవహరిస్తారు. అదే జ్ఞాని అయిన వాడు శస్త్ర పరిజ్ఞానాన్ని నమ్ముకుంటాడు. కళ్లతో చూసి , చెవులతో విని, చేతితో తాకి అర్థం చేసుకుంటారు. ఏవ్యక్తి తన ఇంద్రియ జ్ఞానాన్నంతా సమన్వయ పరిచి విషయ సంగ్రహణం చేస్తాడో అతడిని విజయం వరిస్తుందనేది విదుర నీతి.
విధ్వాంసులెవరు?
నిజాయితీ, ధర్మం తప్పని జీవితం గడపడానికి మార్గాలు ఏర్పాటు చేసుకోవడమే ఉత్తమ జీవిత లక్ష్యం. పాలిచ్చే ఆవు ప్రతిఘటన లేకుండా పాలు పితకనిస్తే అది ఎటువంటి కష్టాన్ని అనుభవించదు. కానీ పాలు పితకడానికి సహకరించని ఆవు చాలా రకాల దండనలకు గురికావల్సి వస్తుంది. తన వద్ద ఉన్న నైపుణ్యమైనా ప్రదర్శించడంలో లేదా అందించడంలో ఇబ్బంది పడకుండా సునాయసంగా ప్రక్రియను పూర్తిచెయ్యగలగాలి. అటువంటి విశాల దృక్పథంతో ఉండాలి. అలా ఉన్నపుడే అతడి విద్యకు లేదా అతడి నైపుణ్యానికి మంచి గుర్తింపు వస్తుంది. వారినే విజ్ఞులుగ విధ్వాసుంలుగా సమాజం గుర్తిస్తుంది అని విదుర నీతి చెబుతోంది.
Also Read: భార్య అందంగా ఉంటే అదృష్టమా? విదుర నీతిలో ఏం చెప్పారో తెలుసా?
Also Read: విదుర నీతి ప్రకారం ఎలాంటి వ్యక్తులకు నిద్రపట్టదు?