Akhanda 2: అఖండ 2లో బాలకృష్ణ శక్తి వెనుకున్న లాజిక్ ఇదేనా! రామాయణంలో బల, అతిబల విద్యల ప్రాముఖ్యత ఏంటి?
Akhanda 2: Thaandavam: అఖండ 2 లో బాలకృష్ణ శక్తి గురించి చెబుతూ రామాయణంలో విద్యల ప్రస్తావన వస్తుంది. అవే బల, అతిబల విద్యలు. ఆ ప్రస్తావన ఈ సినిమాలో ఎందుకు తీసుకొచ్చారు? ఏంటా విద్యలు?

Bala and Atibala Mantras : థియేటర్లలో అఖండ 2 తాండవం కొనసాగుతోంది. తెరపై బాలయ్య నటవిశ్వరూపం చూసి అభిమానులు కూడా పూనకంతో ఊగిపోతున్నారు. అయితే లాజిక్ లేదని, సూపర్ హీరో అంటూ కొంత ట్రోలింగ్ నడుస్తోంది. కానీ సినిమాలో ఈ క్లారిటీ ఇచ్చారు గమనించారా?
థియేటర్లలో అఖండ 2 తాండవం కొనసాగుతోంది. తెరపై బాలయ్య నటవిశ్వరూపం చూసి అభిమానులు కూడా పూనకంతో ఊగిపోతున్నారు. అయితే లాజిక్ లేదని, సూపర్ హీరో అంటూ కొంత ట్రోలింగ్ నడుస్తోంది. కానీ సినిమాలో ఈ క్లారిటీ ఇచ్చారు గమనించారా?
అఖండ 2 సినిమాలో అఖండగా నటించిన బాలకృష్ణ శక్తి గురించి చెబుతూ రామాయణంలో విద్యల ప్రస్తావన వస్తుంది. అవే బల, అతిబల విద్యలు
బల, అతిబల విద్యలు ఎందుకోసం ఉపయోగపడతాయి?
రామాయణంలో రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు ఈ విద్యలు ఎందుకు బోధించారు?
బల, అతిబల విద్యల ప్రస్తావన అఖండ 2లో ఎందుకొచ్చింది?
ఈ విద్యలు ఎలా నేర్చుకోవాలి?
వాల్మీకి రామాయణం బాలకాండ ద్వావింశ సర్గ లో విశ్వామిత్ర మహర్షి రాముడు, లక్ష్మణుడికి బల, అతిబల అనే రెండు విద్యలు ఉపదేశిస్తారు. ఇవి సాధారణ మంత్రాలు కాదు..శరీరం మనస్సును బలపరిచే జ్ఞానమూలక విద్యలు. ఇవి రామలక్ష్మణుల ఆకలి, దాహం, అలసట, భయం నుంచి రక్షిస్తాయి..అజేయుడిగా చేస్తాయి.
విశ్వామిత్రుడి అభ్యర్థన మేరకు దశరథమహారాజు రామలక్ష్మణులను తనవెంట పంపించేందుకు అంగీకరిస్తారు జనకమహారాజు. వారు సరయూ నది దక్షిణ తీరానికి చేరుకున్న తర్వాత విశ్వామిత్రుడు ఈ విద్యలను ప్రసాదిస్తారు. ఇది వారి యాత్రలో మొదటి రోజు.
విశ్వామిత్రుడు రామా అని మధురంగా పిలిచి..ఆలస్యం చేయకుండా నీరు తీసుకొచ్చి ఆచమనం చేసి ఈ మంత్రాలు గ్రహించు అని చెబుతారు. ఈ విద్యలు స్వీకరిస్తే రాముడికి అలసట, ఆకలి,అనారోగ్యం ఏదీ ఉండదు. తాను నిద్రలో ఉన్నప్పుడు కూడా రాక్షసులు ఏమీ చేయలేరు. రాముడి బాహుబలికి సమానమైనవారు భూమ్మీద ఎవరూ లేరు, ముల్లోకాలకి తనకి సమానుడు లేడు. సౌభాగ్యం, దాక్షిణ్యం, జ్ఞానం, బుద్ధి, నిశ్చయంలో అసమానుడు అవుతాడు. బల, అథిబలలు సమస్త జ్ఞానానికి మాతృతలు. శ్రీరామచంద్రుడు ధర్మానికి నిలువెత్తు నిదర్శనం కాబట్టి ఈవిద్యలు స్వీకరించేందుకు యోగ్యుడు.
@ బల విద్య శరీరాన్ని, అతిబల మానసిక బలాన్ని పెంచుతాయి
@ బల విద్య ఆకలి దాహం అలసటను జయిస్తుంది - అతిబల విద్య భయం దుఃఖం లోభం మానసిక బాధలను తొలగిస్తుంది
విశ్వామిత్రుడు రాముడికి నేర్పించిన శ్లోకాలు భావంతో సహా!
రామేతి మధురాం వాణీం విశ్వామిత్రోభ్యభాషత |
గృహాణ వత్స సలిలం మా భూత్కాలస్య పర్యయః ||
విశ్వామిత్రుడు మధురమైన పలుకులతో రామా అని పిలిచి..వత్సా ఆచమనం కోసం నీళ్లు తీసుకో, సమయం ఆలస్యం కాకూడదు అన్నారు
మంత్రగ్రామం గృహాణ త్వం బలామతిబలాం తథా |
నశ్రమో నజ్వరో వాతే న రూపస్య విపర్యయః ||
నువ్వు బల, అతిబల అనే మంత్రసమూహాన్ని గ్రహించి. వీటివలన మీకు శ్రమ, కష్టం, ఆకలి, దప్పిక ఏ రూపంలోనూ రావు
న చ సుప్తం ప్రమత్తం వా ధర్షయిష్యంతి నైరృతాః |
న బాహ్వోః సదృశో వీర్యే పృథివ్యామస్తి కశ్చన ||
నువ్వు నిద్రిస్తున్నా, అజాగ్రత్తగా ఉన్నా రాక్షసులు నీపై దాడిచేయలేరు, భూమిపై నీ బాహుబలానికి సమానుడు ఎవ్వరూ ఉండడు
త్రిషు లోకేషు వై రామ న భవేత్సదృశస్తవ |
న సౌభాగ్యే న దాక్షిణ్యే న జ్ఞానే బుద్ధినిశ్చయే ||
రామా! మూడు లోకాల్లో నీకు సమానుడు ఎవ్వుడూ ఉండడు. సౌభాగ్యం, ఉదారత, జ్ఞానం, బుద్ధి, నిశ్చంలో కూడా..
నోత్తరే ప్రతివక్తవ్యే సమో లోకే తవానఘ |
ఏతద్విద్యాద్వయే లబ్ధే భవితా నాస్తి తే సమః ||
రామా! నీక ఈ లోకంలో తిరుగులేదు. ఈ రెండు విద్యలు పొందిన తర్వాత నీకు సమానుడు ఎవరూ ఉండరు
బలా చాతిబలా చైవ సర్వజ్ఞానస్య మాతరౌ |
క్షుత్పిపాసే న తే రామ భవిష్యేతే నరోత్తమ ||
బల, అతిబలా..ఇవి సర్వజ్ఞానానిరి మాతృకలు నరోత్తముడవైన రామా నీకు ఆకలి దప్పికలు కలగవు
బలామతిబలాం చైవ పఠతస్తవ రాఘవ |
విద్యాద్వయమధీయానే యశశ్చాప్యతులం త్వయి ||
రాఘవా! బల, అతిబలను పఠిస్తూ ఈ రెండు విద్యలను అభ్యసించిన నీకు అపారమైన యశస్సు కలుగుతుంది
పితామహసుతే హ్యేతే విద్యే తేజఃసమన్వితే |
ప్రదాతుం తవ కాకుత్స్థ సదృశస్త్వం హి ధర్మిక ||
కాకుత్థ్సా! ఈ రెండు విద్యలు బ్రహ్మదేవుని కుమార్తెల తేజస్సుతో కూడినవి. ధర్మాత్ముడివి అయిన నీవు వీటిని గ్రహించడానికి పూర్తి అర్హుడవు
కామం బహుగుణాః సర్వే త్వయ్యేతే నాత్ర సంశయః |
తపసా సంభృతే చైతే బహురూపే భవిష్యతః ||
నీలో అన్ని గుణాలు ఉన్నాయి..ఇందులో సందేహం లేదు తపస్సు వలన సంపాదించిన ఈ విద్యలు నీకు ఎన్నో రూపాల్లో ఫలాన్ని అందిస్తాయి
తతో రామో జలం స్పృష్ట్వా ప్రహృష్టవదనః శుచిః |
ప్రతిజగ్రాహ తే విద్యే మహర్షేర్భావితాత్మనః ||
శ్రీరామచంద్రుడు ఆచమనం చేసి..శుద్ధుడై ప్రసన్నవదనుడై ఆ రెండు విద్యలను గ్రహించాడు
విద్యాసముదితో రామః శుశుభే భూరివిక్రమః |
సహస్రరశ్మిర్భగవాన్ శరదీవ దివాకరః ||
విద్యలతో సంపన్నుడైన మహావిక్రముడు రాముడు..శరత్కాల సూర్యుడిలా వెలిగిపోయాడు. ఈ విద్యలు రాముడికి అపార శక్తిని, రక్షణను ఇస్తాయని విశ్వామిత్రుడు ఉపదేశించాడు. ఇవి ఆధ్యాత్మికంగా సర్వజ్ఞానానికి మూలాలుగా చెబుతారు
రామచంద్రుడు నేర్చుకున్న ఈ విద్యలు వనవాసంలో కష్టాలను దాటుకుంటూ సాగేందుకు దోహదం చేశాయి. సీతాన్వేషణలో కూడా రాముడికి ఈ విద్యలు శక్తిని ఇచ్చాయి.
బల, అతిబల విద్యలు ఆధ్యాత్మికంగా ప్రకృతితో సామరస్యాన్ని సాధించేందుకు , ధర్మమార్గంలో నడవడానికి సహాయపడతాయని రామాయణం సూచిస్తుంది
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఇక్కడ ABP దేశం ఏదైనా నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.






















