By: ABP Desam | Updated at : 13 Jul 2021 04:54 PM (IST)
త్రిశంకు స్వర్గం
స్వర్గం, నరకం... పుణ్యాత్ములంతా స్వర్గానికి..పాపాత్ములంతా నరకానికి అని చెబుతుంటారు. మరి ఏంటీ త్రిశంకు స్వర్గం? అక్కడ ఎవరుంటారు?ఎవరు సృష్టించారు? ఎవరికోసం సృష్టించారు?
ఇక్ష్వాకు వంశానికి చెందిన పృధు మహారాజు కుమారుడు త్రిశంకుడు. వారి వంశంలో అందరినీ ప్రజలు కీర్తించడం చూసిన త్రిశంఖునకు తన పుర్వీకుల కంటే మరేదయినా విశిష్టమైన పనిని చేసి అమితమైన కీర్తి గడించాలి అని కోరిక కలిగింది. ఏంతో ఆలోచించాడు. తమ వంశంలో ఇప్పటి వరకూ ఎవరూ శరీరంతో స్వర్గానికి వెళ్ళలేదు కనుక తను వెళితే బాగుంటుందని నిర్ణయానికి వచ్చాడు.
వెంటనే తమ కుల గురువైన వశిష్టునికి తన కోరిక చెప్పాడు. అది విని ఆశ్చర్య పోయిన వశిష్టుడు ఎంత గొప్ప మహారాజైనా కానీ, ఎంత గొప్ప యజ్ఞ యాగాలు చేసినా కానీ శరీరం తో స్వర్గానికి వెళ్ళడమనేది ధర్మశాస్త్రంలో లేదు. పంచ భూతములతో నిర్మితమైన ఈ శరీరo కొంత కాలానికి పడిపోవాల్సిందే. అది పడిపోయిన తరువాతే శరీరం లోని జీవుడు స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. అందుకే శరీరంతో స్వర్గానికి వెళ్ళటం అనేది జరగదని ఖచ్చితంగా చెప్పాడు. కుల గురువు వశిష్టుని మాటలకు సంతృప్తి చెందని త్రిశంకుడు నూరుగురు గురుపుత్రుల వద్దకు వెళ్లి తన కోరికను వివరించాడు. తండ్రి జరగదు అని చెప్పిన పనిని తాము ఎంత మాత్రమూ చేయమని చెప్పారు. పైగా అన్ని శాస్త్రములు తెలిసిన తమ తండ్రి ఒక పని జరగదని చెబితే అది ఎన్నటికీ జరగదని...ఇక ఆ ఆలోచన మానుకోవావని సూచిoచారు. అయినా కూడా తన ఆలోచన మార్చుకోని త్రిశంకుడు తాను మరొక గురువును ఆశ్రయిస్తాను అన్నాడు. ఆ మాటలకు ఆగ్రహించిన నూరుగురు గురుపుత్రులు ముక్తకంఠంతో ఆ త్రిశంకుడు చేయతలచిన గురుద్రోహానికి అతనిని చండాలుడవు కమ్మని శపించారు. మరునాటి ఉదయం నిద్రలేచే సమయానికి త్రిశంకుని ముఖంలో కాంతి పోయి నల్లగా అయ్యాడు. ఆయన వేసుకున్న బంగారు ఆభరణాలన్ని ఇనుము ఆభరణాలు అయ్యాయి. జుట్టు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆయనని చూసిన ఆ మందిరంలోని వాళ్ళు, ఇతర మంత్రులు అందరు భయపడి పారిపోయారు. ఆ రూపంతో అలాతిరుగుతూ చివరికి త్రిశంకుడు విశ్వామిత్రుడిని ఆశ్రయించాడు.
అప్పటికి విశ్వామిత్రుడు వశిష్టుని మీద కోపంతో తప్పస్సు చేస్తూ రాజర్షి అయ్యాడు. అప్పటికే తన దనుర్విధ్య వశిష్టుని మీద పనిచెయ్యదు అని కుడా తెలుసుకున్నారు కాబట్టి వశిష్టుని మీద పై చేయి ఎలా సాధించాలా అని ఆలోచిస్తున్న విశ్వామిత్రునికి త్రిశంకుడు ఓ మార్గం గా కనిపించాడు. వశిష్టుడు చేయను అన్న పనిని విశ్వామిత్రుడు చేస్తే ఆది వశిష్టుని ఓటమే అవుతుందని ఆలోచించాడు. అందుకే త్రిశంకుని కోరిక తాను తీరుస్తానని మాటిచ్చాడు. తన పుత్రులను, శిష్యులను పిలిచి...వశిష్టుడు చేయలేని పనిని విశ్వామిత్రుడు చేస్తున్నాడు అని చెప్పి అందరిని ఆహ్వానించమని చెప్పాడు. ఒకవేళ ఎవరైనా రాను అన్నా, ఈ పనిని తప్పు పట్టినా వారి వివరాలు తనకు చెప్పమని ఆజ్ఞాపించాడు.
ఆహ్వానం అందుకున్న అందరూ విశ్వామిత్రుడికి భయపడి వచ్చారు. ఆ తరువాత విశ్వామిత్రుని పుత్రులు వచ్చి వశిష్టుని పుత్రులు, మరొక బ్రాహ్మణుడు ఈ యజ్ఞానికి వచ్చేది లేదన్నారని చెప్పారు కారణం అడగ్గా "ఒక క్షత్రియుడు ఒక చండాలుని కోసం యజ్ఞం చేస్తుంటే దేవతలు ఆ హవిస్సు ఎలా తీసుకుంటారు? అది జరిగే పని కాదు కనుక అక్కడకు వచ్చి సమయం ఎందుకు వృధా చేసుకోవాలి?" అని అన్నారని చెప్పారు. కోపించిన విశ్వామిత్రుడు వశిష్టుని నూరుగురు పుత్రులు ఇప్పుడే భస్మరాసులై పడిపోయి నరకానికి వెళ్లి తరువాత 700 జన్మల పాటు నరమాంస భక్షకులుగా, ఆ తరువాత కొన్ని జన్మల పాటు ముష్టికులు అనే పేరుతొ పుట్టి కుక్కమాంసం తింటూ బ్రతుకుతారు, ఆ బ్రాహ్మణుడు మహోదయుడు సర్వలోకాల్లో అందరి ద్వేషానికి గురవుతూ జీవిస్తాడు అని శపించాడు.
అప్పుడు యాగం మొదలు పెట్టాడు. విశ్వామిత్రుడు యాగాగ్నిలో హవిస్సులు ఇస్తున్నా...తీసుకోవటానికి దేవతలు రావటం లేదు. ఇది చుసిన విశ్వామిత్రుడిలో అహంకారం నిద్రలేచింది. తన తపోబలంతోనే త్రిశంకుడిని స్వర్గానికి పంపాలని అనుకుని సంకల్పించాడు. అనన్య సామాన్య మైన అతని తపోబలం వల్ల త్రిశంకుడు స్వర్గలోకం దిశగా ప్రయాణమయ్యాడు. ఈ విషయం దేవేంద్రడికి తెలిసి ఆయన త్రిశంకునితో " త్రిశంకుడా! నువ్వు గురు శాపానికి గురి అయ్యావు. నీకు స్వర్గలోక ప్రవేశం లేదు" అని తలక్రిందులుగా క్రిందికి పో అన్నాడు. అలా తలక్రిందులుగా భూమి మీదకి పడిపోతున్న త్రిశంకుడు....రక్షిoచమని విశ్వామిత్రుడిని ప్రార్ధించాడు. మరింత ఆగ్రహించిన విశ్వామిత్రుడు త్రిశంకుడిని ఆకాశం లో నిలిపాడు. తన మిగిలిన తపశక్తి తో దక్షిణ దిక్కున నక్షత్ర మండలాన్ని, సప్తర్షులని సృష్టించాడు. ఇక దేవతలను దేవాధిపతి ఇంద్రుడిని సృష్టించే ప్రయత్నంలో ఉండగా దేవతలంతా దిగొచ్చారు.
మహానుభావా! శాంతించు. ఎంత తపశ్శక్తి ఉంటే మాత్రం ఇలా వేరే స్వర్గాన్ని సృస్తిస్తారా? మీకు శాస్త్రం తెలుసు, సశరీరంగా ఎవ్వరినీ స్వర్గానికి పంపాలేము, పైగా ఈ త్రిశంకుడు గురుశాపo పొందినవాడు కనుక స్వర్గ ప్రవేశం లేదు. కానీ మీరు మీ తపశక్తి ని ధారపోసినతపహ్శక్తిని ధారపోసి సృస్టించిన ఈ నక్షత్రమండలం జ్యోతిష్య చక్రానికి ఆవల వైపు ఉంటుంది. అందులో త్రిశంకుడు ఇప్పుడు ఉన్నట్లుగానే తలకిందులుగా ఉంటాడని వరం ఇచ్చారు. అప్పటికి శాంతించిన విశ్వామిత్రుడు సరే అన్నాడు.
మొత్తానికి వశిష్టుడిపై పైచేయి సాధించాలనే విశ్వామిత్రుడి పంతంతో త్రిశంకు స్వర్గానికి రూపకల్పన జరిగిందన్నమాట.
Horoscope Today 30th January 2023: రాబోయే రోజుల్లో ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది, జనవరి 30 రాశిఫలాలు
Bhishma Pratigya Mahabharat: భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏంటి - ఇంతకీ భీష్ముడు ఏం సందర్భంలో ఏమని ప్రతిజ్ఞ చేశాడు!
Bhishma Ashtami 2023:అందరూ కృష్ణుడిని తలుచుకుంటే కృష్ణుడు ఎవర్ని స్మరించాడో తెలుసా!
Srimad Bhagavatam:పెళ్లి ఆలస్యం అయ్యే అమ్మాయిలు రుక్మిణీ కళ్యాణం - మరి పెళ్లికాని అబ్బాయిలు ఏం చదవాలంటే!
Weekly Horoscope 30 January to 5 February 2023: ఈ వారం ఈ రాశులవారికి అనుకూలం, ఆ రాశులవారికి ప్రతికూలం- జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 రాశి ఫలాలు
BRS Corporators Arrest : మేడిపల్లిలో పేకాట స్థావరంపై దాడి, డిప్యూటీ మేయర్ సహా 7గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్టు
Sundar Pichai Salary: గూగుల్లో మరో హిట్ వికెట్, సుందర్ పిచాయ్ జీతంలో భారీ కోత!
Hockey WC 2023 Winner: హాకీ ప్రపంచకప్ విజేత జర్మనీ- షూటౌట్ లో బెల్జియంపై 5-4 తేడాతో గెలుపు
Visakha Steel Plant Privatization: స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా నేడే "ఉక్కు ప్రజా గర్జన "