Tirumala Tirupathi Devastanam: టీటీడీ గోవిందుని గోపథకం...పంచగవ్యాలతో సరికొత్త ఉత్పత్తులు తయారీ...
టీటీడీ సరికొత్త పథకం ప్రారంభించింది. ఇప్పటి వరకూ స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులను అందించిన టీటీడీ అధికారులు....త్వరలో పంచగవ్యాలతో ఉత్పత్తులు తయారు చేసి మార్కెట్లో దించేందుకు సిద్ధమవుతున్నారు.
గోమాత రక్షణ, సేవ, పూజ అత్యంత పుణ్యప్రదమని భారతీయ పురాణేతిహాసాలు చెబుతున్నాయి. ఆవులో సకల దేవతలూ కొలువై ఉంటారు. రామాయణంలో కామధేనువును విశ్వామిత్రుడు బలవంతంగా వశిష్ట మహర్షినుంచి తీసుకుపోవటం, తత్పర్యవసానాలు, భాగవతంలో శ్రీకృష్ణుడు గోవులపట్ల ప్రకటించిన అవ్యాజమైన ప్రేమ..వంటి సంఘటనలెన్నో ఇందుకు తార్కాణాలు. సనాతన ధర్మంలో గోవుకి ఉన్న విశిష్టతను తెలియజేసేందుకు గోవిందుని గోపథకం ప్రారంభించామంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ప్రాజెక్టుకి సంబంధించి త్వరలో విధివిధానాలు ప్రకటిస్తామన్నారు టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి.
గోవిందుని గోపథకం ప్రాజెక్టుకు సంబంధించి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి నేతృత్వంలో టిటిడి బోర్డు నిష్ణాతుల కమిటీ ఏర్పాటుచేసింది. ఈ మేరకు ఇప్పటికే జరిగిన తొలిసమావేసంలో దేశంలో పలు ప్రాంతాల్లో పర్యటించిన కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలు ఈవోకి వివరించారు. గో ఆధారిత పదార్థాలతో స్వామివారి నైవేద్యం, ప్రసాదం తయారు చేస్తామన్నారు. పంచగవ్యాలతో తయారయ్యే ఉత్పత్తుల ద్వారా సమాజంలో గోవు ప్రాముఖ్యతను పెంచవచ్చన్నారు. గో ఆధారిత సేంద్రీయ వ్యవసాయం ద్వారా మంచి దిగుబడులు రాబట్టవచ్చని చెప్పారు. కమిటీ సభ్యులు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారని, వారి సూచనలు నిర్మాణాత్మకంగా, సమాజానికి ఉపయోగపడేలా ఉన్నాయని తెలిపారు.
ఈ లెక్కన టీటీడీ కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టనుందన్నమాట. ఇకపై తిరుమలేశుడి ఉత్పత్తులు ప్రతి ఇంట్లోనూ దర్శనమివ్వనున్నాయి. భక్తులను అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్నే కాదు.. స్వచ్ఛమైన గో ఆధారిత ఉత్పత్తులను అందించేందుకు టీటీడీ అధికారులు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. గోవుల నుంచి లభించే సహజ పదార్థాల నుంచి సౌందర్య ఉత్పత్తులు తయారు చేయాలని భావిస్తోంది. వీటి నుంచి సబ్బులు, అగరబత్తిలు, క్రిమిసంహారకాలు, ఫేస్ క్రీములు, హెయిల్ ఆయిల్స్ వంటి ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాల నుంచి వివిధ ఆలయాలకు పాలు, టీటీడీ ఉద్యానవనాలు, తోటలకు గో ఆధారిత ఎరువులను సరఫరా చేస్తోంది. గోవుల నుంచి వచ్చే ‘పంచగవ్య’ ఉత్పత్తులు..అంటే...పాలు, పెరుగు, నెయ్యి, పేడ, మూత్రం నుంచి సరికొత్త ఉత్పత్తులను తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఇప్పటికే టీటీడీ అధికారులు ప్రస్తుతం నాగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ‘గోవిజ్ఞాన్ అనుసంధాన్ కేంద్ర’తో సంప్రదింపులు జరిపారు. ఈ సంస్థ గోవులు, గో ఆధారిత వ్యవసాయం, ఆరోగ్యం, జంతు సంరక్షణ గురించి పరిశోధనలు చేస్తోంది. ఈ అంశంపై టీటీడీ అధికారులకు ప్రజెంటేషన్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక గో ఆధారిత ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా గో సంస్కృతికి మరింత ప్రాచుర్యం కల్పించాలని టీటీడీ భావిస్తోంది. ఈ ప్రాజెక్టుపై టీటీడీ అధికారులు గుజరాత్ లోని ‘బన్సీ గిర్ గోశాల’తో కూడా చర్చలు జరుపుతోంది.
ఆవు పాలు, పెరుగు, మూత్రం, పేడలో ఉంటే సహజ ఔషధాల నుంచి హెయిర్ ఆయిల్, ఫేస్ పౌడర్లు, ఫేషియల్ క్రీములు, మసాజ్ ఆయిల్స్ తయారు చేయడం ద్వారా ఆరోగ్యకరమైన ఉత్పత్తులను ప్రజలకు అందించే వీలుంటుందని టీటీడీ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం టీటీడీ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో గోవులుండటంతో బ్రాండ్ టీటీడీ పేరుతో ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లడం పెద్ద కష్టమేమి కాదని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గోవిందుని గోపథకం ప్రాజెక్టు పట్టాలెక్కేయడంతో త్వరలోనే శ్రీవారి ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చే అవకాశముంది.