Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. జనవరి 19 వరకూ వైకుంఠ ద్వార దర్శనాలు!
Tirumala News: తిరుమల శ్రీవారి సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనాల రద్దీ కొనసాగుతోంది.. పండుగ సెలవుకు కూడా రావడంతో శ్రీ వేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు...
Tirumala: వీకెండ్, సంక్రాంతి సెలవులు కలసిరావడంతో తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. జనవరి 10న మొదలైన వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులు క్యూ లైన్లలో నిల్చుని కలియుగ దైవాన్ని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ద్వార దర్శనానికి మొదటి మూడు రోజులకు ముందుగానే టోకెన్లు జారీ చేసిన టీటీడీ..ఆ తర్వాత నుంచి ముందురోజు టోకెన్లు ఇస్తోంది.వైకుంఠ ద్వార దర్శనాలు 19 వ తేదీవరకూ కొనసాగుతాయి. కేవలం ఆరు రోజుల్లో 4 లక్షల 8 వేల మంది భక్తులు శ్రీవారిని ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు.
Also Read: తిరుమల ఆనందనిలయంలో ఏ ఏ విగ్రహాలు ఉన్నాయి - శ్రీవారితో పాటూ ఈ విగ్రహాలను గమనించారా!
సంక్రాంతి సెలవుల సందర్భంగా గురువారం వేకువజాము నుంచి శ్రీవారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. అర్థరాత్రి 12 గంటల వరకూ ఆలయాన్ని తెరిచి ఉంచిన అర్చకులు ధనుర్మాస కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. గురువారం వేకువ జామునే మూడు గంటల 50 నిముషాల నుంచి వైకుంఠ ద్వార దర్శనాలకు వీఐపీలను అనుమతించారు. ఆ తర్వాత సర్వ దర్శనం భక్తులను అనుమతించారు. గతంలో వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనాలు ఉండేవి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ అధికారులు పది రోజుల పాటూ దర్శన ఏర్పాట్లు చేశారు. అందులో భాగమే జనవరి 10 నుంచి 19 వరకూ వైకుంఠ ద్వార దర్శనాలకు భక్తులకు అనుమతి...
Also Read: ముస్లిం భక్తుడు సమర్పించిన బంగారు పూలతోనే దశాబ్ధాలుగా శ్రీవారికి అష్టదళ పద్మారాధన సేవ!
వైకుంఠ ఏకాదశి నుంచి ఆరోరోజు (జనవరి 15)..అధ్యయనోత్సవాల్లో భాగంగా తిరుమలలో ప్రణయ కలహోత్సవం ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సాయంత్రం 4 గంటలకు శ్రీ మలయప్పస్వామి మహాప్రదక్షిణ మార్గంలో స్వామి పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అమ్మవార్లు చెరో పల్లకిపై అప్రదక్షిణంగా స్వామివారికి ఎదురుగా నిల్చున్నారు. పురాణ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరఫున జియ్యంగార్లు ప్రణయకలహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. అనంతరం ఆస్థానం నిర్వహించి...శ్రీ నమ్మాళ్వార్ రచించిన ఆళ్వార్ దివ్య ప్రబంధంలోని పాశురాలను నిందాస్తుతి శైలిలో పారాయణం చేశారు. రాత్రి తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలో గోదా కల్యాణం కన్నుల పండువగా జరిగింది. శ్రీకృష్ణుడిని, ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులను అలంకరించిన కళ్యాణ వేదికపైకి తీసుకొచ్చి వైభవంగా వేడుక నిర్వహించారు. మహా సంకల్పం, స్వామివార్లు- అమ్మవార్ల ప్రవర, మాంగల్యపూజ అనంతరం మాంగల్య ధారణ నిర్వహించారు.
వెంకటేశ్వర వజ్రకవచం (Sri Venkateshwara Vajra Kavacha Stotram)
(మార్కండేయ ఉవాచ)
నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణం
ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ
సహస్ర శీర్షా పురుషో వెంకటేశ శ్శిరోవతు
ప్రాణేశ: ప్రాణనిలయః ప్రాణాన్ రాక్షతుమే హరి:
ఆకాశరాట్ సురానాధ ఆత్మానం మే సదావతు
దేవదేవోత్తమ పయాద్దేహం మే వెంకటేశ్వరః
సర్వత్ర సర్వకాలేషు మంగంబాజాని రీశ్వరః
పాలయేన్మామకం కర్మసాఫల్యం నః ప్రయచ్చుతు
య ఏతద్వజ్రకవచ మభేద్యం వెంకటేశితు:
సాయంప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః
ఇతి మార్కండేయకృత వెంకటేశ్వర వజ్రకవచం
ఓం నమో వేంకటేశాయ
Also Read: ఏడాదిలో రోజుల సంఖ్య కన్నా తిరుమలేశుడి ఉత్సవాల సంఖ్యే ఎక్కువ!