Telangana Srirangam: తమిళనాడు ఆలయానికి ప్రతిరూపం తెలంగాణ శ్రీరంగం దర్శించుకున్నారా? వివాహాలకు ప్రసిద్ధి ఈ ఆలయం!
Sri Ranganayaka Swamy Temple: తెలంగాణలోని అతి పురాతన ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది శ్రీరంగాపురం. ఉత్తర శ్రీరంగం అని కూడా పిలిచే ఈ ఆలయం ప్రత్యేత ఏంటో తెలుసా

Telangana Srirangam: తమిళనాడు శ్రీరంగంలో ఉన్న రంగనాథుడి ఆలయం వైష్ణవులకు దివ్యక్షేత్రం. తిరుచిరాపల్లికి ఆనుకుని ఉభయ కావేరి నదుల మధ్య ఉన్న పట్టణం ఇది. వైష్ణవ దివ్య దేశాల్లో అత్యంత ప్రధానమైన ఈ ఆలయం భారతదేశంలో అతిపెద్ద ఆళయ సంకీర్ణాలలో ఒకటి. జీవితకాలంలో హిందువులు దర్శించుకోవాల్సిన మహిమాన్విత ప్రదేశం ఇది. అయితే ఈ ఆలయాన్ని పోలిఉండే మరో ఆలయం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తెలుగు రాష్ట్రాల భక్తులకు అందుబాటులో వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం శ్రీరంగాపూర్ లో పానుగంటి నదీ తీరాన ఉంది శ్రీ రంగనాయక స్వామి ఆలయం.

ఆలయ చరిత్ర
తెలంగాణలో పురాతన దేవాలయాల్లో ఒకటైన శ్రీ రంగనాథస్వామి ఆలయం. ఈ ఆలయం 18వ శతాబ్దంలో వనపర్తి సంస్థానానికి చెందిన రాజులు నిర్మించారని, తమిళనాడులోని శ్రీరంగం ఆలయం ఆధారంగా దీనిని నిర్మించారని అక్కడి స్థానికులు చెబుతారు. ఓసారి దక్షిణ దేశ యాత్రలకు వెళ్ళిన రాజా బహిరీ గోపాలరావు శ్రీరంగాన్ని సందర్శించారు. అక్కడ రంగనాథుడి దర్శనం అనంతరం వైష్ణవ మతాన్ని స్వీకరించారు. తీర్థయాత్రలు పూర్తిచేసుకుని తిరిగి వచ్చిన తర్వాత ఓరోజు రాత్రి కలలో రంగనాథుడు కనిపించి..తాను 'కానాయపల్లె' గ్రామం పుట్టలో ఉన్నానని, తీసుకొచ్చి ప్రతిష్టించాలని చెప్పారట. అలా స్వామివారు కలలో చెప్పిన ప్రదేశానికి వెళ్లి చూసిన బహిరీ గోపాలరావు అక్కడున్న విగ్రహాన్ని కొరివిపాడు గ్రామానికి తీసుకొచ్చి ఆలయం నిర్మించి ప్రతిష్టించారు. అప్పటి నుంచి కొరివిపాడు పేరు శ్రీ రంగాపురంగా మారింది. తదుపరి కాలంలో రాజా రామేశ్వరరావు ఆలయం చుట్టూ శ్రీరంగ సముద్రం అనే పెద్ద చెరువును తవ్వించారు. లక్ష్మీతాయారు ఆలయాన్ని కూడా నిర్మించారు.

రంగనాథస్వామి ఆలయం ప్రత్యేకతలు
శనయమూర్తిగా రంగనాథుడు దర్శనమిచ్చే ఈ ఆలయంలో పురాతన తంజావూరు పెయింటింగ్స్, నేలమాళిగలు ఉన్నాయని చెబుతారు. ఏటా ఇక్కడ ప్రధానంగా మూడుసార్లు ( సంక్రాంతి, ఉగాది, శ్రావణమాసం)బ్రహ్మోత్సవాలు , గోదా - రంగనాథ స్వామి కళ్యాణం ఘనంగా జరుపుతారు. తెలుగు రాష్ట్రాలతో పాటూ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి భక్తులు రంగనాథుడి దర్శనానికి తరలివస్తుంటారు. ఈ ఆలయంలో శిల్పకళ భక్తులను కట్టిపడేస్తుంది.
వివాహాలకు ప్రసిద్ధి
శ్రీరంగాపూర్ లో పానుగంటి నదీ తీరాన ఉంది శ్రీ రంగనాయక స్వామి ఆలయం వివాహాలకు ప్రసిద్ధి. ఇక్కడ వివాహం చేసుకుంటే ఆ జంట కలకాలం సంతోషంగా ఉంటారని భక్తుల విశ్వాసం. ఆ మధ్య హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరి వివాహం జరిగింది ఇక్కడే. కేవలం అదితి వివాహం మాత్రమే కాదు.. ఈ కుటుంబానికి చెందిన అందరి వివాహాలు రంగనాథుడి ఆలయంలోనే జరగుతాయి. ఎందుకంటే ఈ ఆలయం నిర్మించింది అదితిరావు హైదరీ పూర్వీకులే..

రంగనాథస్వామి ఆలయానికి ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుంచి 160 కిలోమీటర్ల దూరంలో, వనపర్తి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో , పెబ్బేరు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీరంగాపురం. ఇక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో గద్వాల రైల్వే స్టేషన్ ఉంది. ట్రైన్లో వెళ్లాలి అనుకుంటే గద్వాల వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లొచ్చు. శ్రీరంగం వెళ్లి స్వామిని దర్శించుకోలేకపోయాం అని బాధపడే భక్తులు..ఇక్కడ రంగనాథుడిని దర్శించుకుని తరించవచ్చు
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















